రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-05-28T06:15:45+05:30 IST

రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడంలేదని బుక్కపట్నం మండలంలోని నారసింపల్లి తండాకు చెందిన రైతు భాస్కర్‌నాయక్‌ ఆత్మహత్యకు యత్నించాడు.

రైతు ఆత్మహత్యాయత్నం
ఒంటిపై పెట్రోలు పోసుకుంటున్న రైతు

పాసుపుస్తకం ఇవ్వలేదని మనస్తాపం

బుక్కపట్నం, మే 27: రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడంలేదని బుక్కపట్నం మండలంలోని నారసింపల్లి తండాకు చెందిన రైతు భాస్కర్‌నాయక్‌ ఆత్మహత్యకు యత్నించాడు. తహసీల్దారు కార్యాలయం వద్ద శుక్రవారం పెట్రోలు పోసుకున్నాడు. వెంటనే అక్కడున్న అధికారులు అడ్డుకున్నారు. తమ భూమికి పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ మూడేళ్ల నుంచి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతు తెలిపాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్‌ నటరాజ్‌, వీఆర్వో లక్ష్మీనారాయణరెడ్డిని శుక్రవారం కలిసి, పాసుపుస్తకం ఇవ్వాలని కోరారు. అయితే, భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున, తీర్పు వెలువడేవరకూ పాసుపుస్తకం ఇవ్వలేమని అధికారులు అన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భాస్కర్‌ నాయక్‌, ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించాడు. అధికార పార్టీ నాయకులు తమకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వనీకుండా అడ్డుకుంటున్నారని రైతు భార్య నీలాబాయి  ఆరోపించింది. కోర్టు పరిధిలో ఉన్నభూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినా, అధికారులు అడ్డుకోవడం లేదని, ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ, తమకు అన్యాయం చేస్తున్నారని ఆమె అధికారులపై మండిపడింది. అధికారులు న్యాయం చేయకపోతే కలెక్టర్‌ కార్యాలయం వద్ద తమ కుటుంబ సభ్యులందరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది. ఈ విషయంపై తహసీల్దార్‌ నటరాజ్‌ వివరణ కోరగా, భాస్కర్‌ నాయక్‌, అతని సోదరులు శ్రీరాములునాయక్‌, గోపాల్‌నాయక్‌ మధ్య కొన్ని సంవత్సరాలుగా భూ సమస్యలు ఉన్నాయని, ఈ వివాదంపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు. అలాంటి భూములకు పట్టాదారు పాసుపుస్తకం ఎలా ఇవ్వగలమని తహసీల్దార్‌ ప్రశ్నించారు.

Updated Date - 2022-05-28T06:15:45+05:30 IST