అన్నదాతపై ఆర్థిక భారం

ABN , First Publish Date - 2022-01-10T05:09:46+05:30 IST

ఓ వైపు పెరిగిన సాగు ఖర్చులు.. మరోవైపు అధికమైన ఎరువుల ధరలు.. వెరసి అన్నదాతపై ఆర్థిక భారం పడింది.

అన్నదాతపై ఆర్థిక భారం

ఓ వైపు సాగు ఖర్చులు, మరో వైపు కూలీల ఖర్చులు

అప్పు ఇవ్వని ఎరువుల దుకాణదారులు

దిగుబడుల విక్రయంలోనూ దగా

పంటల సాగుకు రైతుల వెనుకడుగు


నెల్లూరు, (వ్యవసాయం) డిసెంబరు 9 : ఓ వైపు పెరిగిన సాగు ఖర్చులు.. మరోవైపు అధికమైన ఎరువుల ధరలు.. వెరసి అన్నదాతపై ఆర్థిక భారం పడింది. దీనికి తోడు అకాల వర్షాలు, వరదలతో  రైతులు కుదేలయ్యాడు. అన్ని కష్టాలను ఎదుర్కొని పంట పండిస్తే అమ్ముకోవడం లోనూ దగా పడుతున్నాడు. జిల్లాకు ప్రధానమైనది రబీ సీజన. ఈఏడాది మునుపెన్నడూ లేనంతగా సాగునీరు అందుబాటులో ఉంది. దీంతో అధికారుల అంచనాలకు మించి  వరిసాగు చేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. నార్లు పోసుకుని నాట్లు కూడా ప్రారంభించారు. అయితే వరదలతో ఊహించని విధంగా నష్టాలపాలయ్యారు.


పెరిగిన పెట్టుబడులు


 వరిసాగుకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఎకరా పొలం సాగుకు దాదాపు రూ.35వేల నుంచి రూ.40వేల మధ్య ఖర్చవుతోంది. గతంతో పోలిస్తే సుమారుగా రూ.10వేల అదనపు భారం పడింది. దుక్కి సిద్ధం చేసేందుకు గతంలో రూ.వెయ్యిలు కాగా, ప్రస్తుతం రూ.200లు అదనంగా పెరిగింది.  నాట్లు వేసేందుకు కూలీ ఖర్చులు బాగా పెరిగాయి. గతంలో ఎకరాకి రూ.3వేలు వరకు ఖర్చుకాగా, ప్రస్తుతం రూ.5వేలు... దూరాన్ని బట్టి రూ.6వేల వరకు ఖర్చవుతోంది. పురుగు మందులు, ఎరువుల ధరలు బాగా పెరిగాయి. పొటాష్‌ రూ.900ల నుంచి దాదాపు రూ.1700ల వరకు పెరిగింది. కాంప్లెక్సు ఎరువులు దాదాపు రూ.200లపైనే పెరిగాయి. కలుపు నివారణ మందులు.. ఇలా ఇతరత్రాల ధరలు డిమాండ్‌ను బట్టి మార్కెట్‌లో అమ్మకాలు సాగుతున్నాయి. ఆయా ఎరువులు, పురుగు మందలు కొనుగోలు ఒక ఎత్తైతే కూలీల ఖర్చులు మరింతగా పెరిగాయి. తెగుళ్లు  సోకితే మరింత అదనపు భారం. రవాణా ఖర్చులు ఇలా చూసు కుంటూ పోతే అన్నదాతపై మరింత భారం  పడుతున్నది.


అప్పు పుట్టడం లేదు..


వరదలతో నష్టపోయిన అన్నదాతకు అప్పులు పుట్టడం లేదు. గతంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ప్రైవేటు వ్యాపారులు అప్పు ఇచ్చేవారు. అయితే వారికి వ్యాపారాలు లేకపోవడంతోపాటు రైతులు వేసిన పంటల ను నమ్మి అప్పు ఇచ్చేందుకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. పంట చేతికందకపోతే కష్టం కదా..? అనే  సాకుతో అప్పు ఇవ్వడం లేదు. దీంతో రైతులు పంట సాగుకు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. పొలం పత్రాలను కదువ పెట్టి కొందరు, అధికవడ్డీలకు తీసుకొచ్చి మరికొందరు, పంటను మీకే అమ్ముతామని ఇంకొందరు అప్పులు తీసుకొచ్చి వ్యవసాయ పనులు చేపడుతున్నారు. పంట నష్టంపై పరిహారం అందిస్తామంటున్న ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా వారి ఖాతాల్లో జమ చేయలేదు. 


కొనుగోలు ప్రకటనతో కొంత ఊరట


ధాన్యం కొనుగోలు ఈసారి రైతు భరోసా కేంద్రా(ఆర్‌బీ కే)ల్లోనే చేస్తామని జిల్లా ఉన్నతాఽధికారులు చేసిన ప్రకటన రైతులకు కొంత ఊరట ఇచ్చే విషయమే. అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే. ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా గిట్టుబాటు ధర లభిస్తుంది. అయితే కొనుగోలు చేసిన ధాన్యంకు సంబంధించి నగదు లావాదేవీలు త్వరగా జరిగితేనే  ఉపయోగం ఉంటుందని పలువురు అన్నదాతలు పేర్కొం టున్నారు. ప్రైవేటు వ్యక్తులకు అమ్మితే రెండు మూడు రోజుల్లో నగదు చెల్లింపులు జరిగిపోతాయని, దీనివల్ల అప్పుల వారి నుంచి బాధలు తగ్గుతాయనేది వారి వాదన.


వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలి


గతంతో పోలిస్తే సాగు ఖర్చులు భారీగా పెరిగాయి. కూలీల డిమాండ్‌ ఉండడంతో కూలీ ఖర్చులు కూడా పెరిగాయి. ఎరువుల ధరలు కూడా పెరగడంతో పరిస్థితి   దారుణంగా ఉంది. రైతులకు ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితులు నేడున్నాయి. వరదలతో ఇప్పటికే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి. పెరిగిన ధరలకు సరిపడా గిట్టుబాటు ధర కల్పించాలి.

- ఏవీఆర్‌ నాయుడు, రైతు సంఘాల సమాఖ్య నాయకులు

Updated Date - 2022-01-10T05:09:46+05:30 IST