ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పురుగుల మందు డబ్బాతో రైతు ఆత్మహత్యా యత్నం
విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
చిన్నశంకరంపేట, జనవరి 28: విద్యుత్ సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతు పురుగుల మందు డబ్యాతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలోని సూరారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని వ్యవసాయ పొలాల వద్ద రెండు నెలల నుంచి తరచూ ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోవడంతో పంటల సాగు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేసినా ఫలితం లేదన్నారు. విద్యుత్ సమస్యతో సాగు చేసేందుకు దుక్కులు దున్నలేదని విద్యుత్ అధికారులకు పలుమార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని రైతులు మండిపడ్డారు. వరి నాట్లు వేసేందుకు సమయం గడిచిపోతున్నదని మనస్థాపానికి గురైనా రైతులు బోండ్ల నర్సింహులు, దిగంబర్, లక్ష్మణ్, నాగులు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యా యత్నం చేయగా తోటి రైతులు పురుగుల మందు డబ్బాను తొలగించారు. వెంటనే నూతన ట్రాన్స్‌ఫార్మర్ బిగించి విద్యుత్ సమస్యలను తీర్చాలని అధికారులను రైతులు కోరుతున్నారు.