రైతు ప్రయోజనాలు తాకట్టు

ABN , First Publish Date - 2022-04-15T06:01:39+05:30 IST

ఈ రైతు పేరు రామయ్య. డోన మండలంలోని మల్లెంపల్లె గ్రామం.

రైతు ప్రయోజనాలు తాకట్టు

  1.  వ్యాపారులకు గోదాములు ధారాదత్తం 
  2.  నిలిచిన ప్లాంట్ల పూర్తికి ప్రభుత్వ నిర్ణయం
  3.  పంట ఉత్పత్తుల నిల్వలపై తీవ్ర ప్రభావం
  4.  అన్నదాతలపై పెరగనున్న అద్దె భారం 
  5.  ఆందోళనలో రైతాంగం


- కర్నూలు(అగ్రికల్చర్‌) 

ఈ రైతు పేరు రామయ్య. డోన మండలంలోని మల్లెంపల్లె గ్రామం. ఖరీఫ్‌లో తనకున్న ఐదెకరాల పొలంలో దాదాపు రూ.లక్ష ఖర్చు పెట్టి కంది సాగు చేశాడు. పది క్వింటాళ్ల దిగుబడి రాగా కర్నూలు మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చాడు. అయితే నాణ్యతగా లేదని, రూ.4,500 నుంచి రూ.5 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెప్పారు. గిట్టుబాటు ధర క్వింటానికి రూ.6,300 పొందాలంటే మరో రెండు మూడు నెలలు ఆగాల్సి ఉందని అధికారులు చెప్పారు. అంతదాకా మార్కెట్‌ యార్డులోని గోదాముల్లో దాచుకుందామనుకుంటే వాటిని వ్యాపారులకు ఇచ్చే ఏర్పాట్లలో ఉన్నామని, ఇవ్వడం కుదరని తెలిపారు. దీంతో చేసేదేమీ లేక చెప్పిన ధరకు విక్రయించి ఉసూరుమంటూ వెనుదిరిగాడు.


మార్కెట్‌ యార్డులను వ్యాపారులకు ధారాదత్తం చేసే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు మార్చి 31న మార్కెటింగ్‌ శాఖ మార్కెట్‌ కమిటీ యార్డుల్లో ఖాళీగా ఉన్న కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్లు, గోదాములను అద్దెకు ఇచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి దాకా తక్కువ అద్దెకే గోదాముల్లో సరుకు నిలువ చేసుకున్న రైతులకు ఇకమీదట ఆ పరిస్థితి ఉండదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగిస్తే తక్కువ అద్దెకే పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని, వ్యాపారుల చేతిలో తమ పరిస్థితి ఏంటని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మార్కెట్‌ కమిటీ యార్డుల్లో గోదాములు, కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో రైతులు తక్కువ అద్దెకు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంతేగాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం అమల్లోకి తెచ్చి గోదాముల్లో నిల్వ చేసుకున్న పంట ఉత్పత్తులపై మూడు నెలల పాటు వడ్డీ లేకుండా రుణం తీసుకునే అవకాశం కల్పించింది. ఆ తర్వాత పావలా వడ్డీ చెల్లిస్తూ ఎక్కువ ధర వచ్చినప్పుడు పంట ఉత్పత్తులను అమ్ముకుని మార్కెట్‌ కమిటీలో తీసుకున్న రుణాన్ని తీర్చేలా నిర్ణయించింది. 

నిధులు కేటాయించని ప్రభుత్వం

 రైతుబంధు పథకానికి 2014-15లో రూ.2.14 కోట్లు, 2015-16 సంవత్సరంలో రూ.3.03 కోట్లు, 2016-17 సంవత్సరంలో రూ.7 కోట్లు, 2017-18లో రూ.6కోట్లు, 2018-19 సంవత్సరంలో రూ.6.9 కోట్లు, 2019-20 సంవత్సరంలో రూ.3.27 కోట్లు కేటాయించారు. 2020-21 అదే విధంగా 2021-22 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఈ రైతుబంధు పథకానికి కేటాయించలేదు. దీనిని బట్టి చూస్తే ఇకపై రైతుబంధు పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్లుగా తెలిసిపోతోంది. 

 అసలు విషయమిదే..

రాష్ట్ర వ్యాప్తంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కోల్డు స్టోరేజీ ప్లాంట్ల నిర్మాణాలు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసేందుకు లీజుకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులు ఎవరైనా సొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ కోల్డు స్టోరేజీ ప్లాంట్లను పూర్తి చేసి ఆ తర్వాత లీజుకు తీసుకోవచ్చు. పంట ఉత్పత్తులను నిల్వ చేయడం ద్వారా లభించే అద్దె డబ్బులతో తాము ఖర్చు చేసిన మొత్తాన్ని రాబట్టుకోవచ్చని ప్రభుత్వం వ్యాపారులకు స్పష్టం చేసింది. 

వైసీపీ అధికారంలోకి రాగానే..

జిల్లాలో 15 మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో దాదాపు 90లక్షల మెట్రిక్‌ టన్నుల నిలువ సామర్థ్యం ఉన్న 70 గోదాములు ఏర్పాటు చేశారు. ఈ గోదాముల్లో రైతుబంధు పథకాన్ని అమలు చేసి రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించాలి. అయితే  వైసీపీ ప్రభుత్వం ఈ గోదాములను కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్లను వ్యాపారులకు ధారాదత్తం చేసే చర్యలకు పూనుకుంది.

వ్యాపారుల చేతుల్లోకి గోదాములు

గోదాములను అద్దెకు ఇచ్చేందు కోసం మార్కెటింగ్‌ శాఖ జిల్లా స్థాయిలో అధికారుల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. మార్కెటింగ్‌ శాఖ జేడీ, ఏడీఎంతోపాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఆయా మార్కెట్‌ కమిటీల సెక్రటరీల ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటవుతుంది. ఈ కమిటీ ద్వారా ఎక్కువ ధరకు ఎవరైతే అద్దె చెల్లిస్తామని టెండరులో పాల్గొంటారో ఆ వ్యాపారులకు గోదాములు, కోల్డ్‌స్టోరేజీ ప్లాంట్లు దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. 

నిధులు ఇవ్వక నిలిచిపోయిన కోల్డు స్టోరేజీ ప్లాంటు 

గత టీడీపీ ప్రభుత్వంలో కర్నూలు మార్కెట్‌ యార్డులో దాదాపు రూ.5 కోట్లతో కోల్డ్‌ స్టోరేజీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటిదాకా 50 శాతం పని పూర్తయింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ కోల్డ్‌ స్టోరేజీ ప్లాంటుకు కేటాయించిన నిధులను దారి మళ్లించడంతో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ప్రస్తుతం కాంట్రాక్టరుకు రూ.1.50 కోట్ల దాకా చెల్లించాల్సి ఉండడంతో పనులను నిలిపివేసి వెళ్లిపోయాడు. 

ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకు ఇచ్చేందుకు ఏర్పాట్లు 

మార్కెట్‌ కమిటీల్లో ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాపారులు ముందుకు వస్తే వాటికి టెండరు నిర్వహిస్తాం. జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేశాం. ఈ విధానం వల్ల రైతులకు ఏమీ నష్టం జరగదు. ప్రభుత్వ పర్యవేక్షణలోనే వ్యాపారులు గోదాములను నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు వారు అద్దె వసూలు చేయాల్సి ఉంటుంది. 

- సత్యనారాయణ చౌదరి, ఏడీఎం


ప్రభుత్వ ఆధ్వర్యంలోనే గోదాములు నిర్వహించాలి

గోదాములు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది. ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. కర్నూలు యార్డులో నిర్మిస్తున్న కోల్డ్‌ స్టోరేజీ ప్లాంటును త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలి. ఈ ప్లాంటుతోపాటు గోదాములను మార్కెటింగ్‌ శాఖ అధికారులే ప్రత్యక్షంగా నిర్వహించాలి. వ్యాపారులకు ఇవ్వడాన్ని అడ్డుకుంటాం.

- రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి

Updated Date - 2022-04-15T06:01:39+05:30 IST