కనువిందు చేస్తున్న జలపాతాలు

ABN , First Publish Date - 2021-08-08T05:27:47+05:30 IST

అటు గోదావరి, ఇటు మానేరు నదులు.. మధ్యలో వాగులు, వంకలతో పాటు కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం కలిగి ఉన్న పెద్దపల్లి జిల్లా ప్రకృతి సోయగానికి మారుపేరుగా నిలుస్తున్నది.

కనువిందు చేస్తున్న జలపాతాలు

- జిల్లాలో పదికి పైగా జలపాతాలు 

- వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకుల రాక

- శ్రావణ మాసంలో మరింత సందడి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

అటు గోదావరి, ఇటు మానేరు నదులు.. మధ్యలో వాగులు, వంకలతో పాటు కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం కలిగి ఉన్న పెద్దపల్లి జిల్లా ప్రకృతి సోయగానికి మారుపేరుగా నిలుస్తున్నది. వర్షా కాలం వచ్చిందంటే చాలు.. ఎత్తయిన కొండలు, గుట్టల నుంచి జాలువారే జలపాతాలు కనువిందు చేస్తుంటాయి. జలపాతాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈనెల 9న శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో అనేక మంది పర్యాటకులు ఈ జలపాతాలను సందర్శించనున్నారు. వీటిని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలుగా గుర్తించినట్లయితే జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. జిల్లాలో చరిత్రకారుడు కుందారపు సతీష్‌ గుర్తించిన జలపాతాల గురించి అందిస్తున్న ప్రత్యేక కథనం..

గౌరీ గుండాల జలపాతం..

పెద్దపల్లి-మంథని రహదారిలోగల సబ్సితం గ్రామం నుంచి గట్టు సింగారం గుట్టవైపు సుమారు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే గౌరీ గుండాల జలపాతాన్ని చేరుకోవచ్చు. చుట్టూ ఎత్తయిన పచ్చని కొండలు, వాటి నడుమ తెల్లటి ముత్యాల ధారలాంటి జలపాతం 70 నుంచి 90 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ పురాతనమైన శివలింగంతో పాటు వినాయకుడు, సప్తమాత్రుకలు, మహిషాసుర మర్థిని దేవతా విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఈ జలపాతం పక్కనే పెద్ద రాతికొండకే తొలిచిన నాలుగు చారిత్రక గుహలయాలున్నాయి. ఈ జలపాతం సందర్శనకు కరీంనగర్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి అనేక మంది వస్తుంటారు.

రామునిగుండాల జలపాతం..

రామగుండం మండలం లింగాపూర్‌ సమీపంలో రామునిగుండాల జలపాతం దర్శనమిస్తుంది. రాముడు తన వనవాసం కాలంలో కొంతకాలం ఇక్కడ విడిది చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రామునిగుండాల పేరు మీదనే రామగుండం వెలిసింది. పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. రెండు గుట్టల నడుమ ఒక చీలికవంటి ఆకారంతో నీళ్లు 108 గుండాల గుండా ప్రవహించి చివరగా 40 మీటర్ల లోతులో మరో గుండంలోకి జారుతాయి. గుట్టపై భాగంలో ఇటీవలే వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు. రాముడు నడిచిన నేల పవిత్రతమైన స్థలంగా పర్యాటకులను ఆకర్శిస్తున్నది. సెలవు దినాల్లో ఇక్కడికి చాలామంది వస్తుంటారు.

రామగిరిఖిల్లా జలపాతాలు..

పెద్దపల్లి నుంచి మంథని వైపునకు వెళ్లే రహదారిలో బేగంపేట ఎక్స్‌రోడ్‌ వద్ద దిగి బేగంపేట గ్రామం నుంచి సుమారు 3 కిలోమీటర్లు కాలినడకన రామగిరి ఖిల్లాకు చేరుకోవచ్చు. ఈ ఖిల్లాపై 5 నుంచి 8 జలపాతాలున్నాయి. ముఖ్యంగా ఈ రామగిరిఖిల్లా యాత్ర చాలా సాహసోపేతమైనది. ముందుగా మొదటి దర్వాజ ప్రవేశించడానికి ముందే ఎడమ వైపుగల దారిలో వెళితే అద్భుతమైన జలపాతాన్ని చూడవచ్చు. సుమారు 70 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు కిందకు దూకుతుంటాయి. రామగిరి ఖిల్లా సందర్శించాలంటే ప్రతి ఏడాది శ్రావణ మాసమే అనువైనది. ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రావణ మాసంలో ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు వన భోజనాలకు కూడా వస్తుంటారు. 

పాండవుల లొంక జలపాతం..

పెద్దపల్లి నుంచి కాల్వశ్రీరాంపూర్‌కు వెళ్లే రహదారిలో వెన్నంపల్లి, జాఫర్‌ఖాన్‌ పేట్‌ గ్రామాల మధ్య పాండవుల లొంక జలపాతం ఉంటుంది. పాండవులు అరణ్య వాసంలో కొద్దిరోజులు ఇక్కడ నివసించారని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలను గుట్టకింది గుహలలో అనేకమైన చిత్రాలు ఉన్నాయి. అర్ధచంద్రాకారం గల గుట్ట పైభాగం నుంచి నీళ్లు సుమారు 70 మీటర్ల కిందకు పడుతాయి. ఈ జలపాతం నీటి శబ్ధంతో పాటు పర్యాటకులు చేసే ప్రతి శబ్ధం కూడా ఇక్కడ ప్రతిధ్వనిగా వినిపించడం ప్రత్యేకమని చెప్పవచ్చు. వర్షాకాలంలోనే జలపాతం సవ్వడులు కనిపిస్తాయి. ఈ జలపాత దృశ్యాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 

బుగ్గ రామలింగేశ్వర స్వామి జలపాతం..

గోదావరిఖనికి వెళ్లే రహదారిలో బసంత్‌నగర్‌ దాటిన తర్వాత ఎడమ వైపునకు గల రోడ్డులో కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎడమ వైపునకు గల గుట్ట పైకి వెళ్లాలి. అక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. దట్టమైన అడవిలో అతి ప్రాచీనమైన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, విహార యాత్రకు వచ్చి వన భోజనాల పేరిట సందడి చేస్తుంటారు. ఇక్కడ కనిపించే జలపాతం కొండపై నుంచి 50 మీటర్ల లోతులోకి నీళ్లు జారే జలపాతం కనువిందు చేస్తుంది. 

ముత్తారం ముక్తీశ్వర స్వామి జలపాతం..

పెద్దపల్లి పట్టణానికి దగ్గరలో 8 కిలోమీటర్ల దూరంలోగల గౌరెడ్డిపేట గ్రామం తర్వాతగల ముత్తారం గ్రామ చివరలో ఉన్న ముక్తీశ్వరస్వామి గుట్టపైన ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ కాకతీయుల కాలంనాటి అతి పురాతనమైన శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఆలయం పక్కనే ఒక చిన్న జలపాతం ఇక్కడి వచ్చే భక్తులను తన జల ప్రవాహంతో తన్మయత్వానికి గురిచేస్తుంది. ఈ గుట్టపై నుంచి చుట్టుపక్కల గల గ్రామాలను వీక్షిస్తే పచ్చలహారాన్ని తొడిగినట్లుగా కనిపిస్తుంది.

గుర్రాంపల్లి పులిగుండం జలపాతం..

పెద్దపల్లి నుంచి కూనారం వెళ్లే రోడ్డులో 3 కిలోమీటర్ల లోపల గుర్రాంపల్లి గ్రామం ఉంటుంది. అక్కడ గల ఒక గుట్టపై జలపాతం ఉంటుంది. దీనిని స్థానికులు పులిగుండంగా పిలుస్తారు. ఏటవాలుగా ఉన్న గుట్ట నుంచి 20 మీటర్ల లోతులో ఉన్న ఒక గుండంలో నీరు పడుతుంది. ప్రతి ఆశాఢ, శ్రావణ మాసాల్లో గ్రామ ప్రజలు ఇక్కడ ప్రత్యేకంగా భోజనాలు చేసి, ఆహ్లాదమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సందర్శకులు వస్తుంటారు.

సీతమ్మ జలపాతం..

మంథని నుంచి ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి వెళ్లే దారిలో సీతంపల్లి అనే గ్రామంలోని సీతమ్మగుట్టపైన సీతమ్మ జలపాతం ఉంది. చుట్టూ పచ్చని చెట్లతో ఈ జలపాతం పర్యాటకులను పరవశింపజేస్తుంది.

గాడుదల గండి జలపాతం..

మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ శివారులోగల అటవీప్రాంతంలో గాడుదల గండిలో జలపాతం ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఈ జలపాతం స్థానికులకు గొప్ప మధురానుభూతిని కలిగిస్తుంది.

పాండవుల గుట్ట జలపాతం..

ధర్మారం మండలం కొత్తూరు గ్రామ శివారులోగల పాండవుల గుట్టపై ఒక జలపాతం ఉంటుంది. దీనిని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి అనేక మంది వస్తుంటారు. 

Updated Date - 2021-08-08T05:27:47+05:30 IST