కొబ్బరి డీలా

ABN , First Publish Date - 2022-08-07T05:21:45+05:30 IST

ఉద్దానం కొబ్బరి మార్కెట్‌కు శ్రావణ మాసం అచ్చిరాలేదు. సాధారణంగా ఏటా శ్రావణమాసానికి 15 రోజుల ముందు నుంచే కొబ్బరికాయల ధరలు ఆశాజనకంగా ఉండేవి. ఇతర రాష్ట్రాలకు జోరుగా ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు బాగా తగ్గాయి. మరోవైపు ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉద్దానం కొబ్బరి ధర పెరగలేదు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఊపందుకోలేదు. దీంతో కొబ్బరి రైతులు డీలా పడుతున్నారు.

కొబ్బరి డీలా
సన్యాసిపుట్టుగ తోటలో నిల్వ ఉన్న కొబ్బరికాయలు

పండుగల వేళ పతనమవుతున్న ధరలు
తెగుళ్ల ప్రభావంతో తగ్గిన దిగుబడులు
ఆందోళనలో ఉద్దానం రైతులు
(సోంపేట /ఇచ్ఛాపురం రూరల్‌)

ఉద్దానం కొబ్బరి మార్కెట్‌కు శ్రావణ మాసం అచ్చిరాలేదు. సాధారణంగా ఏటా శ్రావణమాసానికి 15 రోజుల ముందు నుంచే కొబ్బరికాయల ధరలు ఆశాజనకంగా ఉండేవి. ఇతర రాష్ట్రాలకు జోరుగా ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు బాగా తగ్గాయి. మరోవైపు  ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉద్దానం కొబ్బరి ధర పెరగలేదు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఊపందుకోలేదు. దీంతో కొబ్బరి రైతులు డీలా పడుతున్నారు.
--------------
పండుగల వేళ.. ఉద్దానం కొబ్బరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొబ్బరిపంటకు సరైన ధర లేక.. ఎగుమతులు లేక రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో సుమారు 12.4వేల హెక్టార్లలో కొబ్బరి చెట్లు సాగవుతున్నాయి.కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల పరిఽధిలో అధికంగా కొబ్బరి సాగు చేస్తున్నారు. ఉద్దానం కొబ్బరికి నాణ్యత, పరిమాణం రీత్యా మంచి డిమాండ్‌ ఉంది. కేవలం వర్షాధారంపై ఆధారపడి సాగుచేసే ఈ పంటకు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఒడిశాలోనూ మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు కొబ్బరికాయలు ఎగుమతి అయ్యేవి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. వరుస పండుగలతో ఉద్దానం మార్కెట్‌ కళకళలాడేది. ఈ ఏడాది మాత్రం పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కొబ్బరికాయల నాణ్యత, పరిమాణం ఉద్దానంతో పోల్చితే కాస్త బాగానే ఉన్నాయి. ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. ఆ జిల్లాల్లో కాయలను కొనుగోలు చేసేందుకు ఆయా రాష్ట్రాల వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉద్దానం కొబ్బరి ఎగుమతులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. శ్రావణమాసం, వినాయకచవితి, దసరా వంటి పర్వదినాలు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉద్దానం రైతులు కొబ్బరికాయలను నిల్వ చేశారు. మంచి ధర వస్తుందని వ్యాపారులు ఆశించారు. కానీ, శ్రావణమాసం ప్రారంభమై.. రెండు వారాలైనా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఎగుమతులు లేక రైతులు, వ్యాపారులు నిరాశ చెందుతున్నారు. గతంలో ఉద్దానం నుంచి ఆయా రాష్ట్రాలకు రోజూ సుమారు 25 లారీలతో కొబ్బరికాయలు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు కేవలం పది లారీల సరుకు మాత్రమే ఎగుమతి అవుతోందని రైతులు వాపోతున్నారు.

వెంటాడుతున్న తెగుళ్ల బెడద
 1999లో వచ్చిన పెనుతుఫాన్‌ తరువాత వరుసగా ప్రకృతి వైపరీత్యాలతో ఉద్దానం కొబ్బరికి తెగుళ్ల తాకిడి పెరిగింది. దీంతో దిగుబడి తగ్గుతోంది. వరుస తుఫాన్లతో రైతులు కోలుకోలేకపోతున్నారు. గతంలో ఎకరాల తోటలో రెండు నెలలకు 600 కాయలు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 200 కాయలుకూడా దిగుబడి రావడంలేదు. నాలుగేళ్ల కిందట తితలీ తుఫాన్‌ ప్రభావంతో కొబ్బరి చెట్లన్నీ నేలకొరిగాయి. దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఇక ధరల విషయానికి వస్తే గతంలో వెయ్యి కాయలు రూ.20వేల వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.12వేలకు దాటడం గగనమవుతోంది. ప్రధానంగా కంచిలి.. కొబ్బరి మార్కెట్‌కు పేరుగాంచింది. ప్రస్తుతం ఎగుమతులు లేక ఈ మార్కెట్‌ సైతం వెలవెలబోతోంది. ఒడిశా వ్యాపారులు సైతం ముఖం చాటేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని కొబ్బరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిగుబడులు తగ్గాయి
కొబ్బరి పంటపై తుఫాన్‌ల ప్రభావం, తెల్లదోమ, ఎర్రనళ్లి వంటి తెగుళ్లు కారణంగా దిగుబడులు తగ్గుముఖం పడుతున్నాయి. పండగల సమయంలో ఏటా ధరలు పెరిగి, గిరాకీ ఉండేది. ప్రస్తుతం శ్రావణమాసం, వినాయక చవితి ఉన్నా కొబ్బరి కాయల ధరలేక రైతులకు నష్టం వాటిల్లుతోంది.
- సీహెచ్‌ గోపాల్‌, కొబ్బరి రైతు, బూర్జపాడు

రైతులకు నిరాశే
కొబ్బరికాయలకు శ్రావణమాసం, వినాయక చవితి, దసరా పండగల్లో ధరలు పెరిగేవి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గడంతో కొబ్బరి రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ ప్రాంతంలో కొబ్బరి ఆదారిత పరిశ్రమలు నెలకొల్పితే రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
- నీలాపు గోపి, కొబ్బరి రైతు సంఘం అధ్యక్షులు, సన్యాసిపుట్టుగ.

 

Updated Date - 2022-08-07T05:21:45+05:30 IST