జోరుగా నకిలీ విత్తనాల దందా

ABN , First Publish Date - 2021-06-22T04:47:48+05:30 IST

గ్రామాల్లో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలతోపాటు, మొక్కజొన్న, వరి నకిలీ విత్తనాలను దొంగచాటున దిగుమతి చేసుకున్న వ్యాపారులు గ్రామాల్లో నిల్వ చేస్తున్నారు. ప్రతీ ఊరికి ఇద్దరు, ముగ్గురు ఏజెంట్లను నియమించుకుని నకిలీ విత్తనాల అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

జోరుగా నకిలీ విత్తనాల దందా

గ్రామాల్లో బీటీ–3 పత్తి, మొక్కజొన్న, వరి విత్తనాల విక్రయాలు

రైతులకు అంటగడుతున్న  వ్యాపారులు

పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి

అక్కన్నపేట, జూన్‌ 21 : గ్రామాల్లో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలతోపాటు, మొక్కజొన్న, వరి నకిలీ విత్తనాలను దొంగచాటున దిగుమతి చేసుకున్న వ్యాపారులు గ్రామాల్లో నిల్వ చేస్తున్నారు. ప్రతీ ఊరికి ఇద్దరు, ముగ్గురు ఏజెంట్లను నియమించుకుని నకిలీ విత్తనాల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. హుస్నాబాద్‌ డివిజన్‌లోని అక్కన్నపేట, హుస్నాబాద్‌, కోహెడ, బెజ్జంకి, మద్దూర్‌ మండలాల్లో నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతున్నది. పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నా కట్టడి చేయలేకపోతున్నారు. స్థానికంగా విత్తన వ్యాపారం చేసే ఆర్గనైజర్లు విత్తన ఉత్పత్తి సంస్థలతో ఉన్న పరిచయాలను ఆసరాగా తీసుకుని నకిలీ విత్తనాలను తెప్పిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ఏలూరు, కర్నూలు జిల్లాల నుంచి పత్తి, మొక్కజొన్న, వరి విత్తనాలను తెప్పిస్తున్నారు. పంట దిగుబడి భారీగా వస్తుందని ఆశచూపి రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. ప్రతీ సంవత్సరం నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు పట్టుబడుతున్నా రైతులు కూడా అప్రమత్తం కావడంలేదు. గతంలో బీటీ–3 విత్తనాలతో మంచి దిగుబడులు రావడంతో రైతులు ఈ విత్తనాలను వేసేందుకే మొగ్గుచూపుతున్నారు. నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలను వాడొద్దని అధికారులు ఎంతచెప్పినా రైతులు వినడం లేదు. దీనిని ఆసరాగా తీసుకుని వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఒక్కొక్క ప్యాకెట్‌కు రూ. వెయ్యి నుంచి రూ. 1,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో నకిలీ విత్తనాలను నిల్వచేసిన దళారులు అధికారుల కళ్లుగప్పి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2021-06-22T04:47:48+05:30 IST