నకిలీ విపత్తు

ABN , First Publish Date - 2020-05-26T05:42:41+05:30 IST

జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతోంది. యేటా నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారు

నకిలీ విపత్తు

జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా 

పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి 

దళారులతో గ్రామాల్లో విక్రయం

అప్రమత్తమైన పోలీసు శాఖ 


బెల్లంపల్లి, మే 25 : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతోంది. యేటా నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారు. రైతులు గుర్తు పట్టకుండా ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలు వాడితే దిగుబడి బాగా వస్తుందని, కలుపు,  పురుగుల దాడి ఉండదని అంటగడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలువురు రైతులు ఈ విత్తనాలను కొనుగోలు చేశారు. ఓ వైపు నకిలీ విత్తనాలు, గ్లైపోసెట్‌పై పోలీసులు దృష్టి సారించి దాడులు చేస్తున్నప్పటికీ జిల్లాలో చాపకింద నీరులా నకిలీ పత్తి విత్తనాల దందా సాగుతోంది. 


పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి 

నకిలీ పత్తి విత్తనాలను, గ్లైఫోసెట్‌(గడ్డిమందు) ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి జిల్లాకు దిగుమతి చేస్తున్నారు. పలువురు దళారులు, వ్యాపారులు గుంటూరు, విజయవాడ, నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు కొని ఎవరికి అనుమానం రాకుండా  దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ లూజ్‌ నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి జిల్లాలో ఏదో ఒక కంపెనీ పేరుతో కవర్లలో ప్యాకింగ్‌ చేసి 450 గ్రాముల ప్యాకెట్‌ను రైతు అవసరాన్ని బట్టి రూ. 1200 నుంచి 1500ల వరకు విక్రయిస్తున్నారు. బీటీ 3  పేరుతో ఫెర్టిలైజర్‌ షాపుల యాజమానులు, ధళారులను ఏజెంట్లుగా నియమించి గ్రామాల్లో విక్రయిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. రెండు రోజుల క్రితం బెల్లంపల్లిలో రూ. 25 లక్షల విలువ గల నకిలీ విత్తనాలు కర్నూలు నుంచి లక్షెట్టిపేటకు ట్రాన్స్‌పోర్టులో దిగుమతి కావడం గమనార్హం. 


జోరుగా దళారీ దందా 

జిల్లాలోని పలు గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఎరువులు, విత్తనాల దందా చేస్తున్నారు. సన్నకారు రైతులను టార్గెట్‌ చేస్తూ ఈ నకిలీ విత్తనాలను, నిషేధిత గ్లైఫోసెట్‌ను విక్రయిస్తున్నారు.  నిషేధిత విత్తనాలతో వాటిల్లే నష్టాలపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించలేకపోతున్నారు. 


నకిలీ విత్తనాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి 

వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు, నిషేధిత గ్లైఫోసెట్‌పై పోలీసులు దృష్టి సారించారు. గడిచిన 5 నెలల్లో 9 కేసులు నమోదు కాగా,  నకిలీ పత్తి విత్తనాలు అమ్మే 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 60 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 


నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేస్తాం - డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి 

నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం. గ్రామంలో నకిలీ విత్తనాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని  అవగాహన కల్పిస్తున్నాం.  గతంలో ఎవరెవరు నకిలీ పత్తి విత్తనాలు అమ్మారో వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. వారి గోదాంలను, ఇండ్లలో ఎప్పటికప్పుడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిషేధిత గ్లైఫోసెట్‌(గడ్డిమందు)ను రైతులు ఎట్టిపరిస్థితుల్లో వాడరాదు. ఈ మందు వాడితే ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశాలున్నాయి. అందుకే ప్రభుత్వం దీన్ని నిషేధించింది. 

Updated Date - 2020-05-26T05:42:41+05:30 IST