భయోత్పాతంతో భక్తిని అణచివేయలేరు : మోదీ

ABN , First Publish Date - 2021-08-20T19:58:57+05:30 IST

మత పర్యాటక రంగాన్ని పటిష్టపరచవలసిన అవసరం ఉందని

భయోత్పాతంతో భక్తిని అణచివేయలేరు : మోదీ

న్యూఢిల్లీ : మత పర్యాటక రంగాన్ని పటిష్టపరచవలసిన అవసరం ఉందని, దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన గతం గురించి తెలుసుకునే అవకాశం కూడా యువతకు దొరుకుతుందని చెప్పారు. ఉగ్రవాదం, భయోత్పాతం ద్వారా భక్తిని అణగదొక్కడం సాధ్యం కాదన్నారు. మనం గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌లో వివిధ ప్రాజెక్టులకు శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన శంకుస్థాపనలు చేశారు. 


సోమ్‌నాథ్ ప్రొమెనేడ్, సోమ్‌నాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పార్వతీ దేవి దేవాలయం, పాత (జునా) సోమ్‌నాథ్ దేవాలయ ప్రాంగణ పునర్నిర్మాణం ప్రాజెక్టులకు మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేశారు. 


అనంతరం మోదీ మాట్లాడుతూ, సోమనాథ్ దేవాలయం నవ భారతానికి చిహ్నమని తెలిపారు. గడచిన వందల సంవత్సరాల్లో ఈ దేవాలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. దీని ఉనికిని అంతం చేయడానికి చేయని ప్రయత్నం లేదన్నారు. దీనిని పతనం చేయడానికి ప్రయత్నం జరిగిన ప్రతిసారీ ఇది తిరిగి లేచి నిలబడిందన్నారు. దీనిని సాధ్యం చేసిన సోమనాథ్ ట్రస్ట్ సభ్యులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోమనాధుని భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-08-20T19:58:57+05:30 IST