అక్వాపై అదనపు భారం!

ABN , First Publish Date - 2021-10-03T04:58:42+05:30 IST

అక్వాపై అదనపు భారం!

అక్వాపై అదనపు భారం!

- ఏసీడీ బిల్లుల వసూళ్లకు ప్రభుత్వ ఆదేశం

- ఇబ్బందులు పడుతున్న సాగుదారులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఆక్వా రైతులపై అదనపు నగదు జమ (ఏసీడీ) బిల్లుల భారం పడుతోంది. ఆక్వా రైతు తాను వినియో గించే సర్వీస్‌కు ముందుగానే అదనపు సొమ్ము చెల్లించ డం ఏసీడీ (అడిషనల్‌ క్యాష్‌ డిపాజిట్‌) విధానం. రాష్ట్రంలో గతంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే దీన్ని చెల్లించేవారు. ఇప్పుడు రెండు దఫాలుగా వసూలు చేస్తు న్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా.. ఆక్వా సాగుదారులు వాణిజ్య సర్వీసు తీసుకుని పెద్ద ఎత్తున బిల్లులు చెల్లిస్తున్నారు. సన్న, చిన్న సాగుదారుల కు సైతం నెల నెలా రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు బిల్లు వస్తోంది. విస్తీర్ణం ఎక్కువ ఉన్నవారు రూ. 50 వేల వరకు బిల్లు చెల్లిస్తున్నారు. ఏసీడీ చార్జీలు చెల్లించకపోతే విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తామని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. రొయ్యల సాగుకు నిత్యం విద్యుత్తు అవసరం కావడంతో ఆర్థికంగా భారమైనా.. కొంత మంది విద్యుత్‌ బిల్లుల భారం భరిస్తున్నారు. మరికొంత మంది ఏసీడీ బిల్లులు చెల్లించలేక.. విద్యుత్తు సర్వీసు కాపాడుకోలేక సతమతమవుతున్నారు.


ట్రాన్స్‌కోకు లక్ష్యాలు..

ఏసీడీ వసూలు చేయాలని ప్రభుత్వం తమకు ఆదే శాలు జారీ చేసిందని ట్రాన్స్‌కో శాఖ సిబ్బంది చెబుతు న్నారు. జిల్లాలో ఆక్వా 235, వాణిజ్య కనెక్షన్లు (ప్రభుత్వ కార్యాలయాలు) 68 వేలు ఉన్నాయి. వీటి నుంచి రూ.7.08 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం విధించింది. ఇందులో ఆక్వా నుంచే రూ.3కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇంకా ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ. 1.18 లక్షలు, లోకల్‌ బాడీస్‌ నుంచి రూ.2.68 లక్షలు వసూలు చేయాలి. ఇప్పటి వరకు రూ.46 లక్షల వరకు వసూలు చేశారు. వసూళ్లలో వెనుకబడితే ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికల నేపథ్యంలో సిబ్బంది ఆక్వా రైతులపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. తమ కష్టానికి ఇపుడిప్పుడే తగిన ధర వస్తోందని... ఇలాంటి సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేసినా, సర్వీసు కత్తిరించిన ఇబ్బందులు పడతామని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.


ఆదేశాల మేరకే..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఏసీడీ వసూళ్లు చేస్తున్నాం. ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

-ఎల్‌.మహేంద్రనాథ్‌, విద్యుత్‌ ఎస్‌ఈ, శ్రీకాకుళం

Updated Date - 2021-10-03T04:58:42+05:30 IST