Abn logo
Jun 5 2020 @ 04:04AM

బరితెగిస్తున్న వలంటీర్లు

కోమళ్లపూడి ఘటనతో జిల్లా ఉలికిపాటు

డెయిరీ డైరెక్టర్‌పై దాడిలో ముగ్గురు గ్రామ వలంటీర్లు!

హత్యాలకు సైతం వెనకాడరని రుజువు చేస్తున్న ఘటన

నాలుగు రోజుల క్రితం అచ్యుతాపురం మండలం నునపర్తిలో వలంటీర్‌ వేధింపులు తాళలేక మాజీ మంత్రి కారు డ్రైవర్‌ ఆత్మహత్య

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణల వెల్లువ

చర్యలు తీసుకోవడానికి అధికారుల వెనుకంజ

అత్యధికులు అధికార పార్టీ కార్యకర్తలే కావడం కారణం


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖలో కీలక విధులు నిర్వహిస్తున్న గ్రామ వలంటీర్లు... తమకు ఎదురు తిరిగిన వారిపై దాడికి కూడా వెనుకాడడం లేదన్న విషయం బుధవారం రాత్రి బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడిలో జరిగిన ఘటన తేటతెల్లం చేస్తున్నది. గ్రామస్థాయిలో చాలా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న గ్రామ వలంటీర్ల ఆగడాలు నానాటికీ మితిమీరుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.


వలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలు కావడంతో ఏం చేసినా తమకు తిరుగులేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమళ్లపూడిలో విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ సహా ముగ్గురిపై హత్యాయత్నానికి పాల్పడిన 11 మందిలో ముగ్గురు గ్రామ వలంటీర్లు కావడం ఈ సందర్భంగా గమనార్హం. వలంటీర్ల అక్రమాలను, నియంతృత్వ పోకడలను గేదెల సత్యనారాయణ ప్రశ్నించినందుకే ఆయనపై హత్యాయత్నానికి ఒడిగట్టారని స్థానికులు అంటున్నారు.


మిగిలిన వలంటీర్లు కూడా తమ పార్టీ అధికారంలో వుందన్న పొగరు, తాము ఏదీ చేసినా అధికారులు ఏమీ చేయలేరన్న ధీమాతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, ఇతర విషయాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సామాన్యులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారిని సంక్షేమ పథకాల మంజూరులో జాప్యం, వివక్ష చూపితే తాము ఎలా ప్రశ్నించగలమని వాపోతున్నారు. తమ పార్టీ అధికారంలో వుంది కాబట్టి, తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ధీమాతో వలంటీర్లు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వలంటీర్లపై ఫిర్యాదులు వచ్చినా... చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. 


నాటుసారా తయారీ 

బుచ్చెయ్యపేట మండలం ఎర్రవాయి ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో పలువురు వలంటీర్లు నాటుసారా తయారీ, అమ్మకాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు నాటుసారా తయారీ, అమ్మకాలకు పరోక్షంగా సహకరిస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఈ విషయం నియోజకవర్గ పార్టీ నాయకుని దృష్టికి రావడంతో ఆయన సదరు వలంటీర్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ఏ చర్యలను అయినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కోమళ్లపూడిలో సొంత పార్టీ నాయకుడిపైనే వలంటీర్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సదరు నాయకుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!


నాలుగు రోజుల క్రితం నునపర్తిలో...

అచ్యుతాపురం మండలం నునపర్తి గ్రామంలో గత నెల 30వ తేదీన వలంటీర్‌ జాగారపు నరసింగరావు వేధింపులు భరించలేక మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కారు డ్రైవర్‌ మాసవరపు సన్యాసినాయుడు (39) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణానికి అడ్డుపడడమే గాకుండా రూ.50 వేల రూపాయలు లంచం డిమాండ్‌ చేశాడని సన్యాసినాయుడు ఆత్మహత్య చేసుకునే ముందు వాయిస్‌ రికార్డు చేసి బంధుమిత్రులకు పంపించాడు. 


వైసీపీ నేత, వలంటీరు బెదిరింపులు

- ఇళ్ల స్థలాల జాబితాలో మరికొన్ని పేర్లు చేర్చాలని వీఆర్వోకు హుకుం

- లేదంటే ఇంటికి ఎలా వెళతావో చూస్తామంటూ హెచ్చరిక

- పోలీసులకు ఫిర్యాదు చేసిన జి.కోడూరు రెవెన్యూ అధికారి


మాకవరపాలెం: మండలంలోని జి.కోడూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వెలగా వెంకటరమణతోపాటు వలంటీరు పిళ్లా శ్రీనివాసరావు తనను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారంటూ వీఆర్‌వో జి.శ్రీనివాస్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ,బుధవారం సాయంత్రం తహసీల్దార్‌ కార్యాలయంలో ఇళ్ల పట్టాల దరఖాస్తులను తనిఖీ చేస్తుండగా వైసీపీ నాయకుడు వెంకటరమణ, వలంటీర్‌ శ్రీనివాసరావు...కొంతమందిని తీసుకువచ్చి కేకలు వేశారని, జాబితాలో మరికొన్ని పేర్లు చేర్చాలని వాగ్వాదానికి దిగారని చెప్పారు. పేర్లు చేర్చకపోతే గ్రామానికి వచ్చి ఇంటికి ఎలా వెళతావో చూస్తామని బెదిరించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించారన్నారు.

Advertisement
Advertisement
Advertisement