న్యూఢిల్లీ : ఇండియన్ ఫారిన్ సర్వీస్ దురహంకారపూరితమైనదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శనివారం ఘాటుగా స్పందించారు. మన దేశ విదేశాంగ విధానం ఆత్మవిశ్వాసంతో కూడినదని, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగపడేదని తెలిపారు.
బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ లండన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, యూరోపు దేశాల ఉన్నతాధికారులు తనతో మాట్లాడారని చెప్పారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (దౌత్యవేత్తలు) పూర్తిగా మారిపోయినట్లు వారు తనకు చెప్పారన్నారు. ‘‘వారు (దౌత్యాధికారులు) దురహంకారులు, వారు దేనినీ వినరు. ఇప్పుడు వారు కేవలం తమకు వస్తున్న ఆదేశాలను మాత్రమే చెప్తున్నారు’’ అని తనకు చెప్పారని తెలిపారు.
రాహుల్ వ్యాఖ్యలపై సుబ్రహ్మణ్యం జైశంకర్ ట్విటర్ వేదికగా స్పందించారు.
‘‘ఔను, Indian Foreign Service పూర్తిగా మారింది.
ఔను, వారు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారు.
ఔను, ఇతరుల వాదనలకు ప్రతివాదం చేస్తున్నారు.
కాదు. దానిని దురహంకారం అని అనరు.
దానిని ఆత్మవిశ్వాసం అంటారు.
దానిని జాతీయ ప్రయోజనాలను కాపాడటమంటారు’’ అని వివరించారు.
జైశంకర్ ప్రపంచంలో భారత దేశాన్ని పటిష్ట దేశంగా నిలపడంలో ముందు ఉంటున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. మన దేశ సమస్యలను అంతర్జాతీయ వేదికలపై స్పష్టంగా వివరిస్తున్నారని, ముఖ్యమైన సమస్యల పట్ల గట్టిగా నిలబడుతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మాటలకు, చేతలకు పొంతన లేకుండా వ్యవహరించే పాశ్చాత్య దేశాల వైఖరిని వేలెత్తి చూపడంలో ముందంజలో ఉంటున్నారని అంటున్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఆయన మనస్తత్వం వల్ల భారత దేశ పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో బలపడటానికి దోహదపడుతోందని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి