స్మగ్లర్ల బరితెగింపు
ABN , First Publish Date - 2021-07-02T07:36:09+05:30 IST
కరోనా కాటేస్తున్నా..
రెండుచోట్ల భారీగా ఎర్రచందనం పట్టివేత
వాహనాలు, దుంగలు కలిపి రూ.12.25 కోట్లు
ఏడుగురు నిందితుల అరెస్టు
తిరుక్షేత్రంలో గంజాయి ‘గుప్పు’
రెండు ఘటనల్లో పట్టుబడిన రూ.15.6 లక్షల సరుకు
రిమాండుకు ఏడుగురు అక్రమార్కులు
కరోనా కాటేస్తున్నా స్మగ్లర్లు వెనకడుగు వేయడంలేదు. లాక్‌డౌన్ వేళ ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను డంప్‌కు చేర్చుకుంటున్నారు. కాస్త వాహనాలు కదలగానే అదనుచూసి తమిళనాడుకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఇంకొందరు అప్పుడప్పుడు కొన్ని దుంగలను తరలిస్తూ తమిళనాడులో నిల్వ చేశారు. ఇలా జిల్లా, తమిళనాడులోని డంపుల గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్సు అధికారులు.. పోలీసులు రూ.12.25 కోట్ల దుంగలను పట్టుకున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో గంజాయి విక్రయాలకు అక్రమార్కులు తెగబడుతున్నారు. తనపల్లె క్రాస్ వద్ద బుధవారం తనిఖీల్లోను.. నగరంలో గురువారం రూ.15.6 లక్షల గంజాయిని పోలీసులు పట్టుకుని, ఏడుగురిని అరెస్టు చేశారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనం, గంజాయి పట్టుబడటం ఇదే ప్రథమం.
తిరుపతి: వేర్వేరుచోట్ల రూ.15.60 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో గురువారం అర్బన్ జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ ఆరీఫుల్లా మీడియాకు వివరాలు తెలిపారు. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో తిరుచానూరు, ఈస్ట్ పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. తనపల్లె క్రాస్ వద్ద బుధవారం ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో ఓ కారును ఆపారు. తనిఖీ చేయగా, 36 బండిళ్ల గంజాయి కనిపించింది. ఆ వాహనంలోని ఆరుగురు పరారవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటాడి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారయ్యారు. పట్టుబడ్డ వారిలో.. కేవీపల్లె మండలం కురవ వడ్డిపల్లెకు చెందిన లేట్ ముత్యాలయ్య కుమారుడు కోటకొండ వెంకటరమణ (50), ఆయన భార్య కోటకొండ కాంతమ్మ, ఇదే గ్రామనికి చెందిన లక్ష్మయ్య కుమారుడు సోంపల్లి రమణ (24), పీలేరు రెడ్డిరెడ్డి కాలనీకి చెందిన ఒ. వెంకటరమణ కుమారుడు ఒరుసు గుణశేఖర్ (29) ఉన్నారు.
పరారైన వారిలో.. తమిళనాడు రాష్ట్రం తీర్థం గ్రామానికి చెందిన పుల్లమ్మ అలియాస్ శాంతమ్మ, నర్సీపట్నంకు చెందిన తోట బాబు ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని, దీన్ని నర్సీపట్నం నుంచి నిందితులు తీసుకొచ్చినట్లు ఏఎస్పీ తెలిపారు. గుణశేఖర్ పాత నిందితుడని, దొంగతనం కేసుల్లో జైలుశిక్ష కూడా అనుభవించి ఉన్నట్టు చెప్పారు. పరారైన వారిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. పెద్దమొత్తంలో గంజాయిని పట్టుకున్న ఈస్ట్ సీఐ శివప్రసాద్‌రెడ్డి, తిరుచానూరు సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు రామకృష్ణారెడ్డి, దీపిక, తదితరులను ఆయన అభినందించారు.
తిరుపతిలో..
తిరుపతిలోనూ 8.8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో అర్బన్ జిల్లా నేర విభాగం అదనపు ఎస్పీ మునిరామయ్య మీడియాకు వివరాలు తెలిపారు. ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్న టాస్క్‌ఫోర్స్ బృందాలకు అందిన సమాచారంతో వెస్ట్ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులిచ్చిన సమాచారంతో 8.8 కిలోల గంజాయి బండిళ్లతో ఉన్న ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీరు ముగ్గురూ విశాఖపట్నానికి చెందిన సరమండ ప్రవీణ్‌కుమార్ (26), కురిడే కృష్ణబాబు (26) కాపు షణ్ముఖ సాయితేజ (27)లుగా గుర్తించారు. వైజాగ్ పాడేరు కొండ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయిని కొని, తిరుపతిలో విక్రయించడానికి తీసుకొచ్చినట్లు తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5.60 లక్షలు ఉంటుందని ఏఎస్పీ పేర్కొన్నారు. గంజాయిని పట్టుకున్న డీఎస్పీలు నరసప్ప, మురళీధర్, సీఐలు చల్లనిదొర, రవీంద్రనాథ్ తదితర సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. ఎస్పీ వీరందరికీ రివార్డు ప్రకటించినట్టు చెప్పారు.
తమిళనాట ‘ఎర్ర’ నిల్వలు
చిత్తూరు: తమిళనాడులో నిల్వ ఉంచిన భారీ ఎర్రచందనాన్ని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వాహనాలతో కలిపి వీటి విలువ రూ.10.25 కోట్లు ఉంటుంది. ఈ వివరాలను వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్ గురువారం విలేకరులకు వెల్లడించారు. గుడిపాల మండలంలోని గొల్లమడుగు శ్యాండ్ చెక్‌పోస్టు వద్ద బుధవారం రాత్రి డీఎస్పీ సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ ప్రసాద్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. చిత్తూరు నుంచి వేలూరు వైపు వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపినా డ్రైవర్ వేగంగా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని తిరుపతి కొర్లగుంటకు చెందిన పి.నాగరాజు, తమిళనాడు రాష్ట్రం తిరవణ్ణామలై జిల్లాకు చెందిన ఎ.రామరాజు, జి.ప్రభు, ఎస్.విజయ్‌కుమార్, ఎ.సంపత్, కె.అప్పాస్వామి, కె.దొరరాజ్‌లను అరెస్టు చేశారు.
వారిని విచారించగా తమిళనాడు రాష్ట్రం కాంచిపురం జిల్లా శ్రీపెరంబదూర్ సమీపంలో ఎర్రచందనం నిల్వ చేసినట్లు తెలిసింది. వెస్ట్ సర్కిల్ సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ విక్రమ్, పీపీఆర్ ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్, స్పెషల్ పార్టీ పోలీసులు శ్రీపెరంబదూర్ సమీపంలో వలర్‌పురం వద్ద ఉన్న సెబాయ్ జాయ్ రిట్రీట్ సెంటర్‌పై దాడులు చేశారు. అక్కడ నిల్వచేసిన 10 టన్నుల (353 దుంగలు) ఎర్రచందనం, ఒక మినీవ్యాను, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.10.25 కోట్లు. పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్‌ఈబీ ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఐదు టన్నుల ‘ఎర్ర’ డంప్ గుర్తింపు
రూ.2 కోట్ల దుంగల స్వాధీనం
తిరుపతి: సదాశివకోనలో ఐదు టన్నుల ఎర్రచందనం డంప్‌ను గుర్తించి, రూ.2కోట్ల విలువైన 348 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలోని ఎర్రచందనం రక్షకదళ కార్యాలయ ప్రాంగణంలో గురువారం డీఎస్పీ మురళీధర్ మీడియాకు వివరాలు తెలిపారు. కొంతకాలంగా తిరుపతి పరిసర అటవీప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల కిందట వచ్చిన సమాచారంతో ఏర్పేడు, వడమాలపేట, పుత్తూరు అటవీ ప్రాంతాల్లో ఆర్‌ఐ భాస్కర్, సీఐ వెంకటరవి నేతృత్వంలో ఎస్‌లు సురేష్, విశ్వనాథ్ బృందం కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారు జామున సదాశివకోన అటవీమార్గంలో ఎర్రచందనం డంప్‌ను గుర్తించారు. అందులో 348 దుంగలుండగా, వీటి బరువు ఐదు టన్నుల వరకు ఉండవచ్చని డీఎస్పీ తెలిపారు. మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ.2కోట్ల ఉంటుందని పేర్కొన్నారు.
లాక్‌డౌన్ సమయంలో దుంగలను స్మగ్లర్లు సేకరించి, తమిళనాడుకు తరలించడానికి సిద్ధం చేసుకుని ఉండవచ్చన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాగే స్మగ్లర్లకు వాహనాలను సమకూర్చేవారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. డంప్‌ను గుర్తించిన సిబ్బందిని డీఐజీ అభినందించినట్లు తెలిపారు. సీఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సీఐలు చంద్రశేఖర్, ఎఫ్‌ఆర్‌వో ప్రసాద్, ఆర్‌ఎ్‌సఐ, లింగాధర్ తదితరులు పాల్గొన్నారు.
