మరో ఆరు నెలలు

ABN , First Publish Date - 2022-08-03T06:09:53+05:30 IST

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్‌) త్రిసభ్య కమిటీల పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 30 వరకు పదవీ కాలం ఉంటుందని జీవో నెంబరు 492 ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మరో ఆరు నెలలు
త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పార్వతీపురం పీఏసీఎస్‌

   పీఏసీఎస్‌ త్రిసభ్య కమిటీల పదవీ కాలం పొడిగింపు

  సహకార ఎన్నికలకు ప్రభుత్వం వెనకడుగు

  ఆశావహుల్లో నిరాశ 

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

జిల్లాలో  ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్‌) త్రిసభ్య కమిటీల పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 30 వరకు  పదవీ కాలం ఉంటుందని జీవో నెంబరు 492 ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  సహకార సంఘ ఎన్నికల నిర్వహణకు సర్కారు వెనకడుగు వేయడంతో కొందరు ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా సహకార సంఘ ఎన్నికలను నిర్వహించి ఎన్నికైన పాలకవర్గం ద్వారా రైతులకు సేవలను అందించాల్సి ఉంది.  అసలు 2018తో అప్పటి పాలవర్గాల పదవీకాలం ముగిసింది. కానీ   సాధారణ ఎన్నికల ముందు వరకూ  వారితోనే పాలన సాగించారు.  అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన  కొంతకాలం తర్వాత  త్రీమెన్‌ కమిటీని తెర మీదకు తీసుకొచ్చారు. సమారు ఐదు నెలల పాటు ఇలానే పాలన కొనసాగించారు. అయితే సాంకేతిక కారణాలతో తిరిగి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. తిరిగి కొద్దికాలానికే త్రిమెన్‌ కమిటీని ఏర్పాచేశారు. ప్రస్తుతం అవే కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులకు పదవులను అప్పగిస్తూ.. పదవీ కాలాన్నీ పొడిగిస్తూ ఉన్నారు.  

మార్పులకు అవకాశం

 జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తంగా 43 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఇందులో సాలూరు నియోజవర్గంలోని చెముడు పీఏసీఎస్‌ మాత్రం కొన్నేళ్లుగా అధికారుల ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఇది మినహా మిగిలిన 42 పీఏసీఎస్‌ల్లో  35 పీఏసీఎస్‌ల్లో ప్రస్తుతం త్రిసభ్య కమిటీలనే కొనసాగించాలని ఆయా నియోజకవర్గాలు ఎమ్మెల్యేల సిఫారసుల మేరకు  రంగం సిద్ధమైంది.  మిగిలిన 7 పీఏసీఎస్‌లకు సంబంధించి అధ్యక్షులు, డైరెక్టర్లలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. పార్వతీపురం నియోజకవర్గంలో అంటిపేట, బూర్జి, సీతానగరం, కురుపాం నియోజకవర్గంలో బీజే పురం, చినమేరంగి, గరుగుబిల్లి, కురుపాం పీఏసీఎస్‌లకు సంబంధించి కొంతమంది అధ్యక్షులను మార్చే పరిస్థితి ఉంది. అదే విధంగా ఆయా పీఏసీఎస్‌ల్లో ఉన్న త్రిసభ్య కమిటీలకు సంబంధించి కొంతమంది డైరెక్టర్లను కూడా మార్చే అవకాశం ఉంది.  ముగ్గురు కమిటీ సభ్యుల్లో ఒకరిని అధ్యక్షులుగా నియమించనున్నారు. కొన్ని పీఏసీఎస్‌ల్లో అధ్యక్షులతో పాటు డైరెక్టర్లు మారడంతో ఏడు పీఏసీఎస్‌లకు సంబంధించి కొత్త త్రిసభ్య కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీనిపై మరికొద్ది రోజుల్లోనే తుది ఉత్తర్వులు అధికారికంగా రానున్నాయి.

కొందరికి నిరాశే.. 

 త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయక ముందే పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహిస్తారని పలువురు ఆశించారు. అయితే కారణాలు ఏమైనా ప్రభుత్వం పీఏసీఎస్‌ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తోంది.  దీంతో పీఏసీఎస్‌ అధ్యక్ష పదవితో పాటు సభ్యులుగా పోటీ చేయాలనుకున్న వారికి నిరాశే మిగులుతుంది.  అయితే ఎన్నికలు నిర్వహించకుండానే ప్రభుత్వం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాలోని పీఏసీఎస్‌ల్లో పాలన సాగిస్తోందని చెప్పొచ్చు.  మొత్తంగా పీఏసీఎస్‌లు నామినేటెడ్‌ పదవులకు కేరాఫ్‌గా మారాయి.  అధికార పార్టీకి చెందిన నాయకులనే త్రిసభ్య కమిటీ సభ్యులుగా, వారిలో ఒకరిని అధ్యక్షునిగా ఎన్నుకోవడంతో  పీఏసీఎస్‌ల్లో వారి హవా కొనసాగుతుంది. పీఏసీఎస్‌ల ద్వారా ఏ సేవలు అందించాలన్నా అధికార పార్టీ నాయకుల సిఫారసుల మేరకే జరుగుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

పదవీకాలం పొడిగింపు వాస్తవమే.. 

పీఏసీఎస్‌ల్లో త్రిసభ్య కమిటీల పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం వాస్తవమే. జిల్లాలో కొన్ని పీఏసీఎస్‌లకు సంబంధించి అధ్యక్షులు, డైరెక్టర్లు మార్పులు జరిగే అవకాశం ఉంది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రకటిస్తాం.

- సన్యాసినాయుడు, డీసీవో 


Updated Date - 2022-08-03T06:09:53+05:30 IST