శ్రీలంకలో కిలో చక్కెర రూ.200

ABN , First Publish Date - 2021-09-06T07:42:30+05:30 IST

శ్రీలంకలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. బియ్యం, పంచదార, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, కిరోసిన్‌, పాల పౌడరు వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ధరలు రెండింతలు పెరిగాయి...

శ్రీలంకలో కిలో చక్కెర రూ.200

  • బియ్యం, కిరోసిన్‌, పాలపౌడరు ధరలూ రెండింతలు
  • కిరాణా షాపుల ముందు ప్రజల పెద్ద సంఖ్యలో బారులు
  • ఆహార అత్యవసర పరిస్థితి ప్రకటించిన అధ్యక్షుడు రాజపక్సే 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: శ్రీలంకలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. బియ్యం, పంచదార, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, కిరోసిన్‌, పాల పౌడరు వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ధరలు రెండింతలు పెరిగాయి. చక్కెర కిలో రూ.200 అయింది. మున్ముందు సరుకులు దొరక్కపోతే ఎలా అన్న ఆందోళనతో ప్రజలు, కిరాణాషాపులకు పోటెత్తుతున్నారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో ఆ దేశాధ్యక్షుడు గోటాబాయా రాజపక్సే ఆహార అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నిత్యావసర వస్తువులను నిల్వచేసిన వారిపట్ల పట్ల కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే జరిమానాను మరింత పెంచారు. శ్రీలంక ఆర్థిక పరిస్థితిని కరోనా కకావికలం చేసింది. అక్కడ కొవిడ్‌తో రోజుకు 200 దాకా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారి ఫలితంగానే 2020లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 3.6శాతం మేర మందగించింది. ఆ దేశానికి విదేశీ మారక నిల్వల ఆర్జన పరంగా అత్యంత ప్రధానమైనది పర్యాటక రంగం. ఆ దేశ జీడీపీలో 5శాతం వాటా ఈ రంగానిదే. 2019లో ఈస్టర్‌ రోజున ఆత్మాహుతి దాడుల కారణంగా 250 మంది మరణించడంతో పర్యాటక రంగానికి తీవ్ర విఘాతం కలిగింది. తర్వాత పరిస్థితులు మెరుగుపడి నెమ్మదిగా విదేశీ పర్యాటకుల రాక పెరుగుతున్నంతలోనే కొవిడ్‌తో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇక దిగుమతుల పరంగా ఏడాదికి 400 మిలియన్‌ డాలర్లు పొదుపు చేయాలనే ఉద్దేశంతో గత ఏప్రిల్‌లో పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. రసాయనిక ఎరువుల బదులు సేంద్రియ ఎరువులు వాడాలని రైతులను ప్రోత్సహించింది. కానీ, పంట దిగుబడులు పెద్దగా రాలేదు. ఏటా లంకలో 300 మిలియన్‌ కేజీల తేయాకు పంట ఉత్పత్తి జరిగితే అది సగానికి పడిపోయింది. ఎగుమతుల పరంగా శ్రీలంక వార్షిక ఆదాయంలో టీ ఉత్పత్తుల వాటా 10శాతం. ఆ రకంగా టీ ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. సేంద్రియ ఎరువుల వ్యూహం బెడిసికొట్టడంతో మిగతా పంటల ఉత్పత్తులూ తీవ్ర స్థాయిలో పడిపోవడమూ ఆహార సంక్షోభానికి దారితీసింది. ప్రైవేటు బ్యాంకుల్లో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీయడంతోనూ శ్రీలంకకు ఈ పరిస్థితి దాపురించింది. ఈ ఏడాది అమెరికా డాలర్‌తో శ్రీలంక కరెన్సీ 7.5శాతం పడిపోవడం కూడా ఆ దేశాన్ని ఆర్థికంగా కష్టాల్లోకి నెట్టింది. 


Updated Date - 2021-09-06T07:42:30+05:30 IST