Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సహజ వనరుల దోపిడీ

twitter-iconwatsapp-iconfb-icon
సహజ వనరుల దోపిడీచందూర్‌లో జోరుగా మొరం తవ్వకాలు

జిల్లాలో ఏళ్ల తరబడి ఇసుక, మట్టి, మొరం అక్రమ తవ్వకాలు

కోట్ల రూపాయల విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు

అడ్డుకోని అధికారులు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు 

స్థానిక నేతలు, కిందిస్థాయి సిబ్బంది సహకారంతో పనులు

పెద్దల హస్తం ఉండడంతో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న స్థానికులు

ప్రధాన కార్యదర్శి లేఖతోనైనా.. జిల్లా అధికారులు చర్యలు చేపట్టేనా?!

జిల్లావ్యాప్తంగా మొత్తం 60కి పైగా ఇటుక బట్టీల నిర్వహణ

నిజామాబాద్‌, మే 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి):నిజామాబాద్‌, మే 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో సహజవనరులైన ఇసుక, మట్టి, మొరం తవ్వకాలు ఏళ్ల తరబడి జరుగుతున్నా.. పట్టించుకున్నవారు లేరు.. ఆపేవారూ అసలే లేరు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతరుల అండ ఉండడంతో మండలస్థాయి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారు కంట్రోల్‌ చేయకపోవడంతోనే ఇసుక, మట్టి, మొరం తవ్వకాలు ఎక్కువగా చేస్తున్నారు. విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేస్తూ కోట్ల రూపాయల సంపదను పక్కదారి పట్టిస్తున్నారు. చివరకు రాష్ట్ర మైనింగ్‌శాఖ, ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాల ని జిల్లా అధికారులను కోరినా స్పందన మాత్రం లేదు. ఇటుక బట్టీల నుంచి ఇసుక తవ్వకాల వరకు అంతా నేతల కనుసన్నల్లో రింగ్‌ అయి నడుస్తుండడంతో ఫిర్యాదు చేసేందుకు కూడా గ్రామాల్లో జంకుతున్నారు. సహజవనరులను ధ్వంసం చేసినా పట్టించుకోవడం లేదు. 

యథేచ్ఛగా తవ్వకాలు

జిల్లాలోని వాగులు, చెరువులు, కుంటలు, గుట్టలు నుంచి ఇసుక, మొరం, మట్టి తవ్వకాలు  యథేచ్ఛగా జరుగుతున్నాయి. వీటి లో కొన్ని ప్రభుత్వ అవసరాల కోసం కొద్దిమొత్తంలో అనుమతులు ఇచ్చినా.. మిగి తా తవ్వకాలు మాత్రం ఎలాంటి అ నుమతులు లేకుండానే చేస్తున్నారు. పొక్లెయినర్‌లు, జేసీబీలు పెట్టి తవ్వకాలు చేస్తూ టిప్పర్‌లు, లారీ లు, ట్రాక్టర్‌ల ద్వారా ఇతర ప్రాం తాలకు తరలిస్తున్నారు. మండలాల వారీగా స్థానిక నేతల ప్రా పకాన్ని సంపాదించి ఇష్టం వచ్చిన రీతిలో కొనసాగిస్తున్నారు. కిందిస్థాయిలో రెవెన్యూ, రవాణా, ట్రాన్స్‌కో, పోలీస్‌, మైనింగ్‌, కార్మిక శాఖలతో పాటు ఇతర అధికారులు సహకరించడంతో  ఈ దోపిడీ కొనసాగుతోంది. ఈ దందాను ఎలాం టి భయం లేకుండా రాత్రులు, పగలు అనే తేడా లేకుండా జోరుగా తవ్వకాలు చేస్తున్నారు. అక్రమంగా తరలింపులను యథేచ్ఛగా  కొనసాగిస్తున్నారు.

వాగులు, వంకల్లో దందా

జిల్లాలో డిచ్‌పల్లి, మోపా ల్‌, ఇందల్‌వాయి, సిరికొండ, నిజామాబాద్‌ రూరల్‌, నం దిపేట, ఎడపల్లి, బోధన్‌, వర్ని, మోస్రా, రుద్రూర్‌, కోటగిరి, వేల్పూర్‌, బాల్కొండ, ముప్కాల్‌, కమ్మర్‌పల్లి, మాక్లూర్‌, ఆర్మూర్‌తో పాటు ఇతర మండలాల్లో ఈ తవ్వకాలను కొనసాగిస్తున్నారు. మంజీరా, కప్పలవాగు, పెద్దవాగు, పూలాంగ్‌ వాగులతో పాటు ఇతర వాగులు, వంకట్లో ఇసుక తవ్వకాలను జోరుగా చేస్తున్నారు. ఆయా మండలాల పరిధిలో గల చిన్నకుంటలు, చెరువుల్లో, అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టలు, ప్రభుత్వ భూముల్లో ఈ తవ్వకాలను కొనసాగిస్తున్నారు. మట్టి, మొరం తవ్వి ఇష్టారీతిన అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలో నడుస్తున్న 60కి పైగా ఇటుక బట్టీలకు ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ అక్రమ మట్టి సరఫరా కొనసాగిస్తున్నారు. సంబంధిత శాఖల అనుమతులు తీసుకోకుండానే పనులు కొనసాగిస్తున్నారు. నెలనెలా మామూళ్లను ఇస్తూ వీటి తవ్వకాలను చేస్తున్నారు. ప్రకృతి సహజ సంపదను దోచుకుంటున్నారు.

అనుమతి తప్పనిసరి

జిల్లాలో ఎక్కడ ఇసుక, మొరం, మట్టి తవ్వకాలు చేసినా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. మైనింగ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌తో పాటు ఇతర శాఖల అనుమతి తీసుకున్న తర్వాతనే పనులు మొదలుపెట్టాలి. అక్కడ దొరికే ఇసుక, మొరం, మట్టిని పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత మొత్తంలో తవ్వుకునేందుకు కేటాయింపులను చేస్తారు. ఆ కేటాయింపులకు అ నుగుణంగా ఎకరం లేదా రెండు ఎకరాల పరిధిలో అనుమతి ఇచ్చిన మేరకు త వ్వకాలు చేపట్టాలి. నీటి నిల్వలు, చెరువులు, కుంటల్లో ఎలాంటి తవ్వకాలను చేపట్టవద్దు. కేవలం రైతులు పొలాల్లో నల్లమట్టిని వేసుకునేందుకు మాత్రమే అనుమతులు ఇస్తారు. చెరువుల్లో మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వరు. జిల్లాలో ఏ శాఖ ద్వారా అనుమతులు ఇచ్చినా.. దానికి అనుగుణంగా ఫీజులు చెల్లించాలి. జీఎస్టీని ప్రభుత్వానికి జమ చేయాలి. ఇలా చేస్తున్న సంస్థలు జిల్లా లో పదిలోపే ఉన్నాయి. మిగతా ఏ ఇటుక బట్టీలు గాని, అక్రమంగా ఇసుక, మొరం తవ్వకాలు చేసేవారు గాని అనుమతి తీసుకోవడం లేదు. స్థానిక నేతల సహకారంతో పనులను కానిస్తున్నారు. వీరిలో కొంతమంది నేతలు కూడా ఉండడంతో మండలస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదు. ఎక్కడైనా సీజ్‌ చేసినా పైనుంచి ఒత్తిళ్లు రావడంతో ఆవైపు పోవడంలేదు. నగర కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీల పరిధిలో భారీగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని చెరువులు, గుట్టలు ఆనవాళ్లు లేకుండానేపోవడం గమనార్హం.

చీఫ్‌ సెక్రెటరీ నివేదిక

రాష్ట్రంలోని నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల పరిధిలో జరుగుతున్న అక్రమ మట్టి, మొరం తవ్వకాలు, ఇటుక బట్టీల నిర్వహణపై మైనింగ్‌ విజిలెన్స్‌ వింగ్‌ చీఫ్‌ సెక్రెటరీ నివేధించింది. ఏయే మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎవరెవరు నిర్వహిస్తున్నారు? వారికి ఏయే శాఖల అధికారులు సహకరిస్తున్నారు? నెలకు వారికి ఎంతమొత్తంలో మామూళ్లు ముడుతున్నాయి? శాఖల వారిగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల రూపేన ఎంత గండిపడింది? వీరికి అనుమతులు లేకుండా తవ్వకాలు చేసినా ఇటుకబట్టీల నిర్వహణ చేసిన స్థానికంగా ఎవరెవరు సహకరిస్తున్నారు? వంటి వివరాలను పొందుపర్చారు. ఆయా జిల్లాల పరిధిలో చర్యలు తీసుకుని పన్నులు వచ్చేవిధంగా చూడాలని ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ జిల్లాల పరిధిలో పెద్దఎత్తున ఎలాంటి అనుమతులు లేకుండా స్థానిక నేతల సహాయంతో ఈ దందా కొనసాగుతుండడంతో ఆయా జిల్లాల కలెక్టర్‌లకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా శాఖల అధికారుల వివరాలతో పాటు ఎవరెవరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్నారో? వారి వివరాలు, ఫోన్‌ నెంబర్‌లతో సహా ఆయా జిల్లా కలెక్టర్‌లకు ప్రధాన కార్యదర్శి ఈనెల 3వ వారంలో పంపించారు. చర్యలు తీసుకోవడం తో పాటు అనుమతులు ఆధారంగానే నడిచేవిధంగా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అక్రమ తవ్వకాలపైన ఉక్కుపాదం మోపాలని కోరారు. ప్రభు త్వం నుంచి నేరుగా లేఖలు, వివరాలతో సహా రావడంతో చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

కానరాని తనిఖీలు

జిల్లాలో ఈ దందా ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ప్రతీ మండలం పరిధిలో ఈ తవ్వకాలు, ఇటుకబట్టీల నిర్వహణ కొనసాగుతోంది. ఏ అధికారి గ్రామ పర్యటనకు వెళ్లినా.. వారి ముందు నుంచే వాహనాలు వెళ్తున్నా.. ఆ గ్రామం పరిధిలో ఇటుకబట్టీల నిర్వహణ కొనసాగుతున్నా.. తనిఖీలు జరుపకపోవడం విడ్డూరం. కనీసం పట్టించుకునేవారూ లేరు. స్థానిక నాయకత్వంతో ఉన్న సంబంధాల ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. జిల్లాలోని అన్ని మండలాల పరిధి లో అధికారులు దృష్టిసారిస్తే అనుమతులు లేకుండా తవ్వకాలతో పాటు ఇటుకబట్టీల నిర్వహణ ఆగిపోయే అవకాశం ఉంది. ప్రధాన కార్యదర్శి లేఖకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడితే, కిందిస్థాయి అధికారులపైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదుతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తే తవ్వకాలు ఆగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఎలాంటి చర్యలు అధికారులు చేపడతారో? వారం రోజుల్లోపే తేలే అవకాశం ఉంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.