ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-04-30T04:44:22+05:30 IST

టీఆర్‌ఎస్‌ తన 2018 ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రూ.లక్ష పంట రుణమాఫీ అందరికీ కాక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎదురుచూపులు


  • అందరికీ  మాఫీ కానిరూ.50వేలలోపు రుణాలు
  • రెండో విడతలో 6,435 మందికి వర్తింపజేసేదెప్పుడో!

టీఆర్‌ఎస్‌ తన 2018 ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రూ.లక్ష పంట రుణమాఫీ అందరికీ కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. విడతల వారీగా ఏటా 25వేలు పెంచుకుంటూ నాలుగేళ్లలో అందరి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎన్నికలు పూర్తయి నాలుగేళ్లు కావస్తున్నా రూ.50వేల రుణం తీసుకున్న వారికి కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేయలేదు. మరి లక్ష వరకు ఎప్పుడు మాఫీ చేస్తారని రైతులు కళ్లలో వత్తులేసుకొని చూస్తున్నారు.

వికారాబాద్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పంట రుణమాఫీ రెండో విడతలో రైతులందరికీ వర్తించలేదు. కొందరి రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ కాగా.. మరికొందరికి వేయలేదు, రెండో విడత రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. 2018, డిసెంబరు 10 కంటే ముందు జిల్లాలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఎన్నికల హామీగా ప్రకటించారు. జిల్లాలో పంట రుణ మాఫీకి 1,59,618మంది రైతులను అర్హులుగా గుర్తించారు. తొలి విడత కింద రూ.25వేలలోపు 10,807మంది రైతుల రూ.16.24కోట్లు మాఫీ చేశారు. రెండో విడత రూ.50వేలలోపు రుణం తీసుకున్న 27,628మంది రైతుల రూ.90.16కోట్ల అప్పులు మాఫీ చేయాల్సి ఉంది. 2021 ఆగస్టు 15న రూ.50వేలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 16 నుంచి 31వ తేదీలోగా నగదు బదిలీ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జిల్లాలో 27,628 మంది రైతులకు పంట రుణమాఫీకి రూ.90.16కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సి ఉండగా, గతేడాది ఇప్పటి వరకు 21,193 మంది రైతులకు రూ.78.41కోట్లు బదిలీ చేశారు. 25,001 నుంచి రూ.35వేల వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ ప్రక్రియ పూర్తికాగా, 50 వేలలోపు వారిలో మరో 6435 మంది రైతులకు ఇంకా రుణమాఫీ నగదు బదిలీ చేయాల్సి ఉంది. 

మిగిలిన రైతులకు వర్తింపజేయండి... 

రెండో విడత పంట రుణ మాఫీకి సంబంధించిన నగదు బదిలీని కొందరికి వేసి తరువాత చెల్లింపులు నిలిపివేసింది. రెండో విడతలో మిగిలిన రైతులకు రుణమాఫీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం నగదు బదిలీ చేస్తుందనే తాము లోన్‌ రెన్యూవల్‌ చేయలేదని, దీంతో మిత్తి ఎక్కువవుతోందని వాపోతున్నారు. ఇదిలా ఉంటే రుణమాఫీ వర్తించే రైతులు రెన్యూవల్‌ చేయించుకున్నా వారికి వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే దీన్ని రైతులు నమ్మడం లేదు. ఒక వేళ అప్పు కడితే తమకు రుణమాఫీ వస్తుందో లేదో అనే అనుమానంతో వడ్డీ చెల్లించడం లేదు.

ఇప్పటి వరకు 32వేల మందికి రుణమాఫీ

లక్ష రూపాయల వరకు రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు రెండు విడతల్లో కలిపి 32వేల మంది రైతులకు రూ.94,65కోట్ల రుణ మాఫీ చేశారు. అయితే విడతల వారీగా యేటా 25వేల చొప్పున పెంచుకుంటూ చివరి సంవత్సరం వరకు లక్ష రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తోంది. అలా చూసుకున్నా ఇప్పటి వరకు రూ.50వేల లోపు రుణం తీసుకున్న రైతుల రుణం మొత్తం తీర్చి వాళ్లు కొత్తగా క్రాప్‌లోన్‌ తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే చెప్పిన దాని ప్రకారం నిధులు విడుదలకాక ఇంకా వేలాది మంది రైతులకు రుణం మాఫీ కాలేదు. రూ.50వేల లోపే పూర్తిగా కాలేదు.. మరి  లక్ష రూపాయల రుణం ఎప్పుడు మాఫీ అవుతుందోనని రైతులు దిగులుపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చాలామంది రైతులు రెన్యూవల్‌ చేసుకోలేదు. దీంతో చక్రవడ్డీ పడుతోంది. 5ఏ వేల లోపు రుణం తీసుకున్న వారు ఇంకా 6435 మంది ఉన్నారు.

మరి రూ.50వేలు పైబడి.. లక్షలోపు వారికి ఎప్పుడో?

పంట రుణమాఫీకి రైతులు 2018 ఎన్నికల పూర్తయిన నాటి నుంచీ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.50వేల లోపు వారిలో కొందరికి రుణం మాఫీ అయినా అందరికీ వర్తించలేదు. రూ.50వేల లోపువారికే నాలుగేళ్లుగా ఇంక పూర్తి కాకుండా లక్ష వరకు రుణ మాఫీకి ఇంకా ఎన్నాళ్లు పడుతుందోనని అనుకుంటున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా అప్పటి వరకైనా పూర్తిస్థాయిలో అందరికీ రుణమాఫీ వర్తించి కొత్త రుణం వస్తుందా? అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ మాటలు నమ్మి 2018 డిసెంబర్‌ నుంచి రుణాలు రెన్యూవల్‌ చేయించుకోని రైతుల లోన్‌ వడ్డీతో కలిపి డబుల్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లక్ష వరకు రుణం వెంటనే మాఫీ చేయాలని కోరుతన్నారు.

Updated Date - 2022-04-30T04:44:22+05:30 IST