విస్తరణ వ్యూహం

ABN , First Publish Date - 2022-07-03T04:58:10+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాపై కన్నేసిన బీజేపీ ప్రతీ సందర్భాన్ని ఇక్కడ పార్టీ విస్తరణకు అనుగుణంగా మలుచుకుంటోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రకటిస్తోన్న ఆ పార్టీ నాయకులు పాలమూరులోనూ మెజార్టీ స్థానాలపై దృష్టి సారించి పావులు కదుపుతున్నారు.

విస్తరణ వ్యూహం
మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రిని సందర్శించిన ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీరథ్‌ సింగ్‌రావత్‌

2019 నుంచే మొదలైన కార్యాచరణ 

కీలక నాయకులకు జాతీయ బాధ్యతలతో సంకేతాలు

బండి పాదయాత్రతో సమస్యలపై పోరాడుతామని స్పష్టీకరణ

తాజాగా నియోజకవర్గాల్లో జాతీయ స్థాయి నాయకుల రెండు రోజుల పర్యటనలు 

నియోజకవర్గాల్లో పార్టీ, నాయకుల పరిస్థితిపై పూర్తి ఆరా 

మోదీ సభకు లక్షమందిని సమీకరించే సన్నాహాలు


ఉమ్మడి పాలమూరు జిల్లాపై కన్నేసిన బీజేపీ  ప్రతీ సందర్భాన్ని ఇక్కడ పార్టీ విస్తరణకు అనుగుణంగా మలుచుకుంటోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రకటిస్తోన్న ఆ పార్టీ నాయకులు పాలమూరులోనూ మెజార్టీ స్థానాలపై దృష్టి సారించి పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్‌కు కంచుకోటలా మారిన జిల్లాలో ఆపార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన రాజకీయ ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాతీయ స్థాయి కీలక నాయకులు పర్యటించి క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. దాంతో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నట్లు, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. 

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


పాలమూరులో బీజేపీ పాగా వేయాలనే వ్యూహం 2019 లోక్‌సభ ఎన్నికల నుంచే మొదలైంది. ఆ సమయంలోనే కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, టీఆర్‌ఎస్‌ నుంచి అప్పటి ఆ పార్టీ లోక్‌సభా పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డితో పాటు వారి అనుచరులను అధిక సంఖ్యలో తమవైపు తిప్పుకొంది. ఆ ఎన్నికల్లో డీకే అరుణను పాలమూరు ఎంపీగా బరిలోకి దించడం ద్వారా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బలమైన పోటీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో నామమాత్రపు ప్రదర్శనకే పరిమితమైనా తిరిగి ఏడాదిన్నర నుంచి ఉమ్మడి జిల్లాలో పార్టీ విస్తరణకు వేగం పెంచింది. క్షేత్రస్థాయిలో బలపడేందుకు వీలుగా మండల, జిల్లా కార్యవర్గాలు క్రియాశీలకంగా పనిచేసేలా చేయడంతోపాటు,  అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించే నాయకులను ప్రోత్సహిస్తుండడంతో స్థానికంగా రాజకీయ వేడి మొదలైంది. ప్రజల్లో పట్టున్న ద్వితీయ, గ్రామ స్థాయి నాయకులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను పార్టీలోకి తీసుకోవడంతో పాటు వారికి కీలక పదవులు ఇస్తూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాందోళనలు నిర్వహిస్తు వస్తున్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ నిర్వహించిన పాదయాత్ర కూడా ఇక్కడ విజయవంతంగానే కొనసాగింది. ఆ సందర్భంగా గుర్తించిన స్థానిక సమస్యలపై పోరాడుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా స్థానిక సమస్యలు, సాగునీటి పథకాలు, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై ఉమ్మడి జిల్లా కీలక నాయకులతో పాటు, నియోజకవర్గ స్థాయి నాయకులు నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ప్రజల్లో చర్చ జరుగుతోందని, వారు పార్టీ పట్ల ఆకర్షితులు అవుతు న్నారనేందుకు ఇదే సంకేతమని ఆ పార్టీ కీలక నాయకులు వ్యాఖ్యాని స్తున్నారు.


జాతీయ సమావేశాల నేపథ్యంలో..

జాతీయ కార్యవర్గ సమా వేశాల నేపథ్యంలో గత రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజ క వర్గాలకు పార్టీ మాజీ సీఎంలు, మాజీ కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి క్రియాశీలక నాయకులు పర్యటించారు. పార్టీ పరిస్థితిని అంచనావేయడంతో పాటు, పురోగతికి అవసరమైన సూచనలు క్యాడర్‌కు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడున్న లోటుపాట్లు, తేవాల్సిన మార్పులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనా నియోజకవర్గాల వారీగా జాతీయ నాయకత్వానికి నేరుగా నివేదించనుండడంతో ఇకపై ఇక్కడ నేరుగా పోరుకు సిద్ధమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. 


జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానం

తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవసరమైన కీలక ప్రాంతంగా పాల మూరును బీజేపీ ఎంచుకోవడంతో పార్టీకి చెందిన ఈ ప్రాంత నాయకులకు జాతీయ స్థాయిలోనూ కీలక పదవులు దక్కాయి. గత ప్రభు త్వాల్లో మంత్రిగా పనిచేసిన అను భవమున్న డీకే అరుణకు పార్టీ జాతీయ ఉపాధ్య క్షురాలిగా, టీఆర్‌ ఎస్‌ నుంచి గత లోక్‌ సభలో సభాపక్ష నేతగా వ్యవహరించిన ఏపీ జితేందర్‌రెడ్డికి పార్టీ జాతీయ కార్య వర్గ సభ్యునిగా బాధ్య తలిచ్చారు. ఆ ఇద్దరు బీజేపీలో క్రియా శీలకంగా వ్యవహరిస్తుండడంతో పాటు, ఆ పార్టీ ఎదుర్కొన్న ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థుల గెలుపునకు పనిచేశారు. అదేవిఽధంగా పాలమూరులోనూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బంగారుశృతికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ఉపాధ్యక్షుడిగా, గత కార్యవర్గంలో కోశాధికారిగా పని చేసిన బి.శాంతికుమార్‌ను తిరిగి అదే పదవిలో కొనసాగిస్తూ అవకాశమిచ్చారు. వీరితో పాటు నూతన జిల్లాల వారీగా కార్యవర్గాలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి నియోజకవర్గ స్థాయి నాయకులకు అవకాశాలివ్వడం, మోర్చాల్లోనూ, ఏబీవీపీలో సైతం అదే స్థాయిల్లో ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్త వాతావరణం సృష్టించారు. ఈ నాయకగణమంతా పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 


కీలక నాయకుల కార్యక్రమాలపై ఆరా

పాలమూరులో పర్యటించే ప్రతీ జాతీయ నాయకుడు ఇక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు పార్టీకి నివేదిస్తుండడంతో పాటు పార్టీ విస్తరణకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దాంతో ఇక్కడి నాయకుల్లోనూ కదలిక కనిపిస్తోంది. తాజాగా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఇక్కడ పర్యటించిన జాతీయ స్థాయి కీలక నాయకులు కూడా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని పూర్తిగా అంచనా వేశారని, నాయకుల పని తీరు, కార్యక్రమాల నిర్వహణ,  కలిసొచ్చే అంశాలేంటి?, స్థానికంగా ప్రజల్లో కదలికకు తీసుకోవాల్సిన అంశాలు?, ఇతర పార్టీల్లో ఉన్నా ప్రజల్లో ఆదరణ ఉండి, బీజేపీలోకి వచ్చే అవకాశమున్న నాయకులెవరు?, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల్లో టిక్కెట్‌ ఆశించే నాయకులు ఎవరు?, ఎవరికి ఛాన్స్‌ ఇస్తే ఎలా ఉంటుందనే అంశాలపై నేరుగా కాకుండా ఒక ప్రత్యేక పద్ధతిలో ఆరా తీశారు. ఈ నివేదికలే భవిష్యత్‌లో క్రియాశీలకమవుతాయనే చర్చ పార్టీలో సాగుతోంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యమని ప్రకటిస్తోన్న బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాల ద్వారా ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.


మోదీ సభకు లక్ష మంది లక్ష్యం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే బహిరంగ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి లక్ష మందిని సమీకరించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. జిల్లా, మండల, గ్రామ కార్యవర్గాలతో పాటు, పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనిచేస్తోన్న క్రియాశీలక నాయకులకు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు. వీరంతా ఇప్పటికే సభకు వెళ్లేవారి కోసం అవసరమైన బస్సులు, కార్లు, లారీలను సిద్ధం చేశారు. లక్షకు మించి జనసమీకరణ జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అంటున్నారు. ఈ సభను  విజయవంతం చేయడం ద్వారా తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేననే సంకేతాలిస్తామని తెలిపారు.

Updated Date - 2022-07-03T04:58:10+05:30 IST