పురాతన చెరువు కబ్జా

ABN , First Publish Date - 2022-05-23T07:22:19+05:30 IST

ప్రభుత్వ భూములు, స్థలాలు ఆక్రమించుకుంటున్న అధికారపార్టీ నేతలకు ఓ చెరువుపై కన్ను పడింది. చెరువులోని 92.81 ఎకరాలు భూమిని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి విక్రయించినట్లు తెలుస్తోంది.

పురాతన చెరువు కబ్జా
కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో కబ్జాకు గురైన చెరువు

బరితెగింపు

విశాఖ రియల్‌ వ్యాపారికి విక్రయం!

నిర్వహణ ముసుగులో పూడ్చివేస్తున్న వైనం

మంత్రితో కుమ్మక్కైనట్లు ఆరోపణలు

ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు 


ప్రభుత్వ భూములు, స్థలాలు ఆక్రమించుకుంటున్న అధికారపార్టీ నేతలకు ఓ చెరువుపై కన్ను పడింది. చెరువులోని 92.81 ఎకరాలు భూమిని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి విక్రయించినట్లు తెలుస్తోంది. ఇందులో వైసీపీ నాయకులు 50 ఎకరాలు కొని ఓ కంపెనీకి అమ్మినట్లు సమాచారం. వారు నిర్వహణ పేరుతో చెరువును పూడ్చేందుకు పనులు మొదలు పెట్టారు. ఈ తతంగం పట్టణ సమీపంలో జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎక్సకవేటర్లు, టిప్పర్లతో మట్టి తోలి ఆక్రమిం చుకుం టున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ తతంగం వెనుక మంత్రి ఉషశ్రీచరణ్‌ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు చెరువు వద్దకు వెళ్లి ఆందోళన చేయడంతో బాగోతం బట్టబయలైంది. ఈ పనులు ఇలాగే కొనసాగితే దాదాపు 130 ఎకరాల చెరువు భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు.   


కళ్యాణదుర్గం, మే 22: పట్టణ సమీపంలో 329 సర్వే నెంబరులో సుమారు 130 ఎకరాలు చెరువు వుంది. ఈచెరువు కింద దొడగట్ట, గూబనపల్లి తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు వ్యవసాయ బోరుబావుల కింద పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈచెరువు అప్పట్లో కరణాల పేరుపై వున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్ల క్రితం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు 92.81 ఎకరాలు విక్రయించినట్లు సమాచారం. ఇందులో వైసీపీ నాయకులు సుమారు 50 ఎకరాలు కొనుగోలు చేసి ఆభాగాన్ని విశాఖ పట్నంకు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి విక్రయించినట్లు తెలిసింది. ఆరియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మంత్రి ఉషశ్రీచరణ్‌తో కుమ్మక్కై చెరువును కొనుగోలు చేసి ఓ కంపెనీకి సుమారు రూ.100 కోట్లకు పైబడి విక్రయించినట్లు ప్రచారం సాగుతోంది. అదే చెరువును నిర్వహణ నిమిత్తం ఆ కంపెనీ వారితో ఒప్పందాన్ని కుదుర్చుకుని పూడ్చివేత పనులను చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో గతకొద్ది రోజులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతూ చెరువును పూడ్చివేత పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పట్టణ నడిబొడ్డులోని రాయదుర్గం-అనంతపురం హైవేలో చెరువు పూడ్చివేత పనులు సాగుతున్నా కట్టడిచేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకునీరెత్తిన్నట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువు పూడ్చివేతపై టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు, నాయకులతో కలిసి ఆదివారం ఆందోళన చేపట్టారు. అక్కడ చేపడుతున్న పనులను అడ్డుకున్నారు. సుమారు 3 గంటల పాటు చెరువులోనే ధర్నా చేపట్టి పాలకుల, అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. చెరువు పూడ్చివేత పనులు తక్షణమే ఆపివేయాలని డిమాండ్‌ చేశారు. సొంతచెరువైనా పూడ్చడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. దర్జాగా చెరువును కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారుల మౌనంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని పురాతన చెరువును కాపాడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు మురళి, తలారి సత్యప్ప, కొల్లప్ప, శ్రీరాములు, నగే్‌షయాదవ్‌, నాగరాజు, విరుపాక్షి, రాయుడు, పోస్టుపాలన్న, రోషన, మధు, మంజు పాల్గొన్నారు.






చెరువు వద్ద ఉద్రిక్తం

పూడ్చిన స్థలంలో టీడీపీ నాయకులు 

రాత్రి వంటావార్పు

రెవెన్యూ, పోలీసుల హైడ్రామా

ఎక్స్‌కవేటర్‌, టిప్పర్లు సీజ్‌


పట్టణ సమీపంలో అత్యంత విలువైన చెరువు కబ్జాకు గురవుతోందని టీడీపీ శ్రేణులు ఆదివారం చెరువులో ఆందోళన చేపట్టారు. మంత్రి ఉష శ్రీచరణ్‌ ప్రోత్సాహంతోనే చెరువును పూడ్చే యత్నం చేస్తున్నారని నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ కబ్జాకు గురైన చెరువులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు స్పందించకపోవడంతో అక్కడే ప్లకార్డులతో బైఠాయించి రాత్రి వంటావార్పు చేపట్టారు. తహసీల్దార్‌ బ్రహ్మయ్య అక్కడికి చేరుకుని ప్రైవేట్‌ భూమిలో ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. ఆగ్రహించిన నాయకులు, రైతులు తహసీల్దార్‌ వ్యవహార శైలిని తప్పుబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువును పూడ్చివేస్తున్నా ఎందుకు స్పందించడంలేదని ఉమా తహసీల్దార్‌ను నిలదీశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వాహనాలను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మూడు టిప్పర్లు, ఒక ఎక్సకవేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో మంత్రి అనుచరులు వాహనాలను సీజ్‌ చేయనీకుండా అడ్డుపడే ప్రయత్నం చేశారు. తాము వాహనాలను అద్దెకు పెట్టామని వీటిపై అభ్యంతరం చేయడం సరికాదని మంత్రి అనుచరులు గూబనపల్లి నాగరాజు, శివశంకర్‌ తదితరులు టీడీపీ నాయకులతో వాదోపవాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ వాహనాలను తీసుకెళ్లారు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపడుతున్న స్థలానికి చేరుకున్నారు. 

Updated Date - 2022-05-23T07:22:19+05:30 IST