కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి

ABN , First Publish Date - 2021-06-30T04:10:23+05:30 IST

జిల్లాలో రాజకీయంగా పెను మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం కావడంతో ముఖ్యంగా ఆ పార్టీలో భారీ మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయి. రేవంత్‌రెడ్డితో సాన్నిహిత్యంగా ఉన్న పలువురు వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత బోడ జనార్దన్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి
మాజీ మంత్రి బోడ జనార్దన్‌

బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న బోడ జనార్దన్‌

రేవంత్‌తో సాన్నిహిత్యమే కారణం

చెన్నూరు నుంచి బరిలో దిగే చాన్స్‌

జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులకు అవకాశం

మంచిర్యాల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాజకీయంగా పెను మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం కావడంతో ముఖ్యంగా ఆ పార్టీలో భారీ మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయి. రేవంత్‌రెడ్డితో సాన్నిహిత్యంగా ఉన్న పలువురు వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత బోడ జనార్దన్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రేవంత్‌ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బీజేపీ నేత బోడ జనార్దన్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. రెండు, మూడు రోజుల్లో రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 1985లో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎన్టీఆర్‌ కేబినెట్‌లో 1989 వరకు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం నుంచి 2004 వరకు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన బోడ జనార్దన్‌ అనంతరం జరిగిన పరిమాణాల కారణంగా ప్రశ్నార్థకంగా మారింది. 2004లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ పొత్తు కారణంగా పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు టీఆర్‌ఎస్‌కు దక్కగా చెన్నూరు నుంచి నల్లాల ఓదెలును సీటు వరించింది. అనంతరం రేవంత్‌ రెడ్డితో కలిసి 2018లో బోడ జనార్దన్‌ ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి గ్రూప్‌నకు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెక్‌ పెట్టడంతో మళ్లీ జనార్దన్‌కు నిరాశే ఎదురైంది. 

వివేక్‌తో మనస్పర్థలే కారణమా..?

బీజేపీలో మాజీ ఎంపీ గడ్డం వివేకానంద చేరినప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య మనస్పర్థల కారణంగా బోడ జనార్దన్‌ అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వివేక్‌ బీజేపీలో క్రియాశీలం అయిన తరువాత తమకు ప్రాధాన్యం తగ్గిందని, పార్టీ కార్యకలాపాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని జనార్దన్‌తోపాటు పలువురు సీనియర్‌ నాయకులు అసమ్మతి రాగం అందుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నేతలు మంచిర్యాలలోని బోడ జనార్దన్‌ నివాసంలో భేటీ అయ్యారు. ఆ సమావేశం సందర్భంగానే బోడ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోగా, రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అప్పగించడంతో మార్గం సుగమం అయింది. 

చెన్నూరు సీటు లక్ష్యంగా

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు నిశ్చయించుకున్న బోడ జనార్దన్‌ చెన్నూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించిన భంగపడ్డ బోడ అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డికే కాంగ్రెస్‌ అధిష్టానం పగ్గాలు అప్పగించడంతో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున వివేకానంద బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుండగా, ఈసారి కూడా తనకు టికెట్‌ వచ్చే అవకాశాలు లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. రేవంత్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా 2023లో చెన్నూరు టికెట్‌ పొంది బరిలో నిలవాలని ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి కూడా చెన్నూరు నియోజకవర్గంలో బలమైన నేత లేకపోవడంతో తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. 

Updated Date - 2021-06-30T04:10:23+05:30 IST