వైద్య కళాశాల ఏర్పాటుకు కసరత్తు

ABN , First Publish Date - 2022-08-14T05:56:00+05:30 IST

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరీంనగర్‌ వైద్య కళాశాలలో బోధన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అత్యంత వేగంగా కసరత్తును ప్రారంభించింది.

వైద్య కళాశాల ఏర్పాటుకు కసరత్తు

- కొత్తపల్లి విత్తన కేంద్రం స్థలం ఖరారు 

- సీఎం కేసీఆర్‌తో పనుల ప్రారంభోత్సవానికి నిర్ణయం 

- వచ్చే ఏడాది నుంచి 100 మంది విద్యార్థులకు అడ్మిషన్లు 

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరీంనగర్‌ వైద్య కళాశాలలో బోధన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అత్యంత వేగంగా కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం రెండు నెలల్లో టెండర్‌ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెండర్లు ఖరారు కాగానే ఏడాదిలోగా కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు తీసుకోవాలని భావిస్తున్నారు.  ఈ కళాశాల ఏర్పాటుతో రాష్ట్రంలో అదనంగా మరో వంద మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిసింది. త్వరలోనే టెండర్‌ ప్రక్రియను పూర్తిచేసి తీగెల వంతెన, టీఆర్‌ఎస్‌ భవన ప్రారంభోత్సవం, వైద్య కళాశాల నిర్మాణ పనులకు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రితో ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్‌ భావిస్తున్నారు. ఈ మేకు అసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ప్రారంభించేందుకు పనులను వేగవంతం చేశారు. 

- నలు దిశలా విస్తరిస్తున్న నగరం

కళాశాల ఏర్పాటు కోసం ఎల్‌ఎండీ సమీపంలోని శాతవాహన యూనివర్సిటీ పాత పీజీ సెంటర్‌ స్థలాన్ని, కొత్తపల్లి సమీపంలోని ప్రభుత్వ విత్తన శుద్ధి కేంద్రం స్థలాన్ని పరిశీలనలోకి తీసుకున్నారు. చివరకు కొత్తపల్లి సమీపంలోనే వైద్య కళాశాలను నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ ధ్రువీకరించారు. కరీంనగర్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పట్టణాన్ని నలువైపులా విస్తరించేలా కొత్తపల్లి వద్ద వైద్య కళాశాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నది. శాతవాహన పీజీ సెంటర్‌ సమీపంలో ఐటీ టవర్‌ నిర్మాణం, బీసీ స్టడీ సర్కిల్‌, స్పోర్స్ట్‌ స్కూల్‌, ఉజ్వల పార్కు, మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల, ఐటీఐ కళాశాలలు ఉండడంతో ఆ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందింది. మానేరు రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తూ అందులో భాగంగానే తీగలవంతెన నిర్మించారు. దీంతో మానేరు డ్యాం నుంచి ఇటు పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు కలిసే వరకు రెండు వైపులా నగరం విస్తరించనున్నది. హైదరాబాద్‌, వరంగల్‌ వైపు దారిలో తిమ్మాపూర్‌ వరకు పలు ఇంజనీరింగ్‌ కళాశాలు, విద్యా సంస్థలు నెలకొల్పడంతో ఇప్పటికే ఆ ప్రాంతమంతా విద్యాలయాలతో సందడిగా మారింది. వేములవాడ వైపు కరీంనగర్‌ డెయిరీ, వ్యవసాయ పరిశోధన క్షేత్రం ఉండగా వీటికి సమీపంలోనే టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. కరీంనగర్‌ నుంచి వేములవాడ వరకు ఆలయాలు, మిడ్‌మానేరుతో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశమున్నది. మంచిర్యాల వైపు వెళ్లే దారిలో రైల్వే స్టేషన్‌తోపాటు ప్రతిమ మెడికల్‌ కళాశాల ఉండడంతో ఆ రహదారి ఇప్పటికే బీజీగా మారిపోయింది.  గోదావరిఖనివైపు వెళ్లే మార్గంలో చల్మెడ మెడికల్‌ కళాశాల ఉండడంతో అటువైపు వేగంగా నగరం విస్తరిస్తోంది. దీనితో జగిత్యాల వైపు ఉన్న కొత్తపల్లి రోడ్డులో నగరం విస్తరించేలా చూడాలనే భావనతో కొత్తపల్లికి సమీపంలో మెడికల్‌ కళాశాల నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో నగరం అన్నివైపులా విస్తరించే అవకాశాలు కలుగుతాయి. ఇప్పటికే జగిత్యాల రోడ్డుకు ఇరువైపులా 20 కిలో మీటర్ల వరకు వ్యవసాయ భూములు వ్యాపార, వాణిజ్యవర్గాలకు చెందిన వారు, డాక్టర్లు, రియల్టర్లు కొనుగోలు చేశారు. పలు విద్యాసంస్థలుకూడా ఈ రోడ్డువైపు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మరింత పెరిగే అవకాశమున్నది. నివాస సముదాయాలు, అపార్టుమెంట్లు కూడా పెరిగే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. వైద్య కళాశాల భవన నిర్మాణంతోపాటు దానికి అనుబంధంగా  జిల్లా ఆసుపత్రిని టీచింగ్‌ ఆసుపత్రిగా అభివృద్ధి పరుచనున్నారు. ఏకకాలంలో ఈ రెండు నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా టెండర్‌ ప్రక్రియను చేపట్టి రెండునెలల్లోగానే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-08-14T05:56:00+05:30 IST