దోషి 52 ఏళ్ల లీసా.. గర్భిణి హత్య, పొట్ట కోసి శిశువు బయటకు
ఘటన జరిగిన పదహారేళ్లకు శిక్ష
వాషింగ్టన్, జనవరి 13: అమెరికాలో డెబ్బై ఏళ్ల తర్వాత ఓ మహిళా ఖైదీకి మరణ శిక్ష అమలైంది. ఇండియానా రాష్ట్రంలోని టెరే హౌతేలో ఓ హత్య కేసులో దోషి అయిన లీసా మాంట్‌గో మేరీ(52)కు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చారు. మంగళవారం అర్ధరాత్రి 1:30 నిమిషాలకు(భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12గంటలకు) మరణ శిక్షను అమలు చేశారు. అమెరికాలో ఓ మహిళా ఖైదీకి మరణ శిక్ష అమలు కావడం 1953 తర్వాత ఇదే తొలిసారి. 2004లో ఇండియానాకు చెందిన కుక్కలను పోషించే బాబీ జో స్టిన్నెట్(23) అనే మహిళను లీసా హత్య చేసినట్లు కోర్టులు నిర్ధారించాయి. ఘటన జరిగినప్పుడు స్టిన్నెట్ గర్భిణి. ఆమెను లీసా గొంతు నులిమి హత్యచేసింది.
అనంతరం పదునైన కత్తితో స్టిన్నెట్ గర్భాన్ని కోసి శిశువును బయటకు తీసింది. ఈ ఘటనలో ఆ శిశువు కూడా మృతిచెందింది. 2007లో లీసాకు ఇండియానా కోర్టు మరణశిక్ష విధించింది. ఆమె క్షమాభిక్ష పిటిషన్‌ను అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తిరస్కరించారు. లీసా మానసిక సమస్యలతో బాధపడుతోందని, మానసిక స్థితిని అంచనా వేసేందుకు సమయం ఇవ్వాలని దోషి తరపు వారు కోరినా.. కోర్టు తోసిపుచ్చింది. తుది నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టుకు వదిలేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే లీసా మరణ శిక్ష అమలుకు సుప్రీం అనుమతినిచ్చింది.