కబ్జాదారుల బరితెగింపు

ABN , First Publish Date - 2021-04-17T04:51:12+05:30 IST

రెవెన్యూ శాఖ అండదండలతో అనకాపల్లిలో భూ కబ్జాదారులు చెలరేగిపోతున్నారు.

కబ్జాదారుల బరితెగింపు
గ్రామ దేవత స్థలంలో నిర్మిస్తున్న భవనం

గ్రామదేవత భూమికి కూడా ఎసరు

76 సెంట్ల ఇప్పటికే 40 సెంట్లలో అక్రమ నిర్మాణాలు

తాజాగా 16 సెంట్లు జిరాయితీగా మార్పు

ఆగమేగాలపై రికార్డులు మార్చేసిన రెవెన్యూ అధికారులు

ఆక్రమిత భూమిలో బహుళ అంతస్థుల భవనం నిర్మాణం

అధికార పార్టీకి రూ.60 లక్షలు ముడుపులు?



అనకాపల్లి-కొత్తూరు, ఏప్రిల్‌ 16: రెవెన్యూ శాఖ అండదండలతో అనకాపల్లిలో భూ కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు...పాగా వేసేస్తున్నారు. చివరకు దేవాలయాలు, గ్రామ దేవతలకు సంబంధించిన భూములను  కూడా వదలడం లేదు. మండలంలోని తుమ్మపాల రెవెన్యూ కొత్తూరు పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 624-1లో గ్రామదేవత పేరిట 76 సెంట్ల భూమి ఉంది. ఈ విషయం రికార్డుల్లో పక్కాగా నమోదైంది. కొత్తూరు ప్రధాన రహదారికి కూతవేటు దూరంలో గల ఈ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది.  ఇప్పటికే 40 సెంట్లలో అక్రమ నిర్మాణాలు జరిగిపోయాయి. రహదారిని ఆనుకొని వున్న అతి ఖరీదైన 16 సెంట్ల స్థలంపై  ఇప్పుడు అధికార పార్టీ చోటా నేతలు కన్నేశారు. హస్తగతం చేసుకోవడానికి ప్రణాళిక రచించారు. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబరులో అనకాపల్లి రెవెన్యూ అధికారుల సహకారంతో జిరాయితీగా మార్పు చేయించారు. అనంతరం ఒక బిల్డర్‌కు అమ్మేశారు. ఆయన...అక్కడ బహుళ అంతస్థుల భవన నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు పొంది పనులు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా రెవెన్యూ శాఖ పట్టించుకోకపోవడం...తాజాగా కోట్లాది రూపాయల విలువైన గ్రామ దేవత స్థలం కబ్జాకు గురైనా చూసీచూడనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖ అధికారులు కూడా కిమ్మనకపోవడంపై స్థానికంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే దేవదాయ శాఖ స్థలం జిరాయితీగా ఎలా మార్పు చేశారో, వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు ఎలా తీసుకున్నారో కూడా అంతుపట్టడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ కబ్జా వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే దీనిపై జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు. 


అధికార పార్టీ నాయకుడి వాటా రూ.60 లక్షలు..?

కొత్తూరులో ఏ స్థలం కొనుగోలు చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా అధికార పార్టీ నాయకుడికి వాటా ఇవ్వాల్సిందే. ఆయన చెప్పిన కమీషన్‌ ఇవ్వకుంటే ఆ పనులు అక్కడే నిలిచిపోతాయి. తాజాగా గ్రామదేవత భూమి కబ్జా వ్యవహారంలోనూ సదరు నాయకుడికి రూ.60 లక్షలు ముట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఆక్రమణపై తహసీల్దార్‌ను విచారణకు ఆదేశించాం

-జె.సీతారామారావు, ఆర్డీవో, అనకాపల్లి

కొత్తూరులో అమ్మవారి భూమి ఆక్రమణ విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశాను. అయితే ఈ విషయంలో దేవదాయ శాఖ అధికారులు కూడా చొరవ చూపి ముందుకు రావాలి. జాయింట్‌ ఆపరేషన్‌లో విచారణ జరిపించి వాస్తవాలు బయటకు తీయిస్తాను. ఆక్రమణలు వాస్తవమైతే తొలగింపు చర్యలు చేపడతాను.

Updated Date - 2021-04-17T04:51:12+05:30 IST