Anand Mahindra Agniveer tweet: ‘నాకు ఏ ఉద్యోగం ఇవ్వబోతున్నారు’..? ఆనంద్ మహీంద్రాను ఈ ప్రశ్న ఎవరడిగారో తెలుసా..?

ABN , First Publish Date - 2022-06-24T00:05:32+05:30 IST

‘అగ్నిపథ్’పై ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ప్రకటనపై ప్రశ్నల పరంపర..

Anand Mahindra Agniveer tweet: ‘నాకు ఏ ఉద్యోగం ఇవ్వబోతున్నారు’..? ఆనంద్ మహీంద్రాను ఈ ప్రశ్న ఎవరడిగారో తెలుసా..?

‘అగ్నిపథ్’పై ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ప్రకటనపై ప్రశ్నల పరంపర కొనసాగుతోంది. ఆర్మీలో నాలుగేళ్లు పనిచేసిన అనంతరం అగ్నివీరులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌పై తాజాగా ఆర్మీ మాజీ ఉద్యోగి స్పందించారు. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రాణాలకు తెగించి 185 మందిని కాపాడిన Ex-Marine Commando Force (MARCOS) Personnel ప్రవీణ్ కుమార్ టియోటియా ఆనంద్ మహీంద్రాను అదే ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 15 ఏళ్ల పాటు సైన్యంలో సేవలందించిన తాను ఇప్పటికీ నిరుద్యోగిగానే మిగిలిపోయానని ఆనంద్ మహీంద్రాకు గుర్తుచేశారు. 26/11 తాజ్ పేలుళ్ల ఘటనలో ప్రాణాలకు తెగించి గౌతమ్ అదానీతో పాటు 185 మంది ప్రాణాలను కాపాడానని, మహీంద్రా గ్రూప్‌లో తనకు ఏ ఉద్యోగం ఇవ్వబోతున్నారని ప్రవీణ్ కుమార్ ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. తన లాంటి చాలా మంది 15 ఏళ్ల సర్వీస్ తర్వాత కూడా ఇప్పటికీ నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారని, మీరు వాళ్లకు చేసిందేమీ లేదని ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి ఈ మాజీ ఆర్మీ ఉద్యోగి ట్వీట్ చేశారు. అగ్నివీరులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.



ఇన్నాళ్లూ ఆర్మీలో సేవలందించిన మాజీ ఉద్యోగుల్లో ఎంతమందికి మహీంద్రా గ్రూప్‌లో ఉద్యోగాలు కల్పించారని ఆయనను నెటిజన్లు నిలదీసిన పరిస్థితి ఉంది. నాలుగేళ్లు సైన్యంలో సేవలందించి వచ్చాక అగ్నివీరులకు మీ సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలిస్తారా అని మహీంద్రాను ఎద్దేవా చేస్తున్న వారూ లేకపోలేదు. తాజాగా ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ టియోటియా కూడా ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై స్పందించడంతో విమర్శల వేడి మరింత పెరిగింది. తాజ్ హోటల్ పేలుళ్ల ఘటనలో ఉగ్రవాదుల చేతుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రవీణ్ కుమార్ టియోటియా ఉగ్రమూకతో పోరాడారు. ఒకే గదిలో నలుగురు ఉగ్రవాదులు ఉండగా.. వారి బారి నుంచి ప్రాణాలకు తెగించి మరీ వారితో పోరాడి 185 మందిని ప్రవీణ్ కుమార్ కాపాడారు. తమ తుది శ్వాస వరకూ దేశ రక్షణ కోసం పాటు పడేందుకు సిద్ధపడిన సైనికుల్లో ప్రవీణ్ కుమార్ టియోటియా ఒకరు. ఇండియన్ నేవీలోని స్పెషల్ ఫోర్స్ విభాగమైన MARCOSలో Commandoగా ఆయన సేవలందించారు.

Updated Date - 2022-06-24T00:05:32+05:30 IST