కుంటిసాకులతో సమర్థించుకోవడం ఏ రక్షకతంత్రం? TET ప్రత్యేకం!

ABN , First Publish Date - 2022-05-21T21:29:10+05:30 IST

వ్యక్తి తన కోపాలను, ఉద్వేగాలను వాటికి కారణమైన వారిపై కాకుండా, తనకంటే తక్కువస్థాయి, వ్యక్తులపై, వస్తువులపై చూపడమే విస్తాపనం. ఉదాహరణకు ప్రధానోపాధ్యాయునిపై ఉన్న కోపాన్ని, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులపై చూపడం.

కుంటిసాకులతో సమర్థించుకోవడం ఏ రక్షకతంత్రం? TET ప్రత్యేకం!

వ్యక్తి తన కోపాలను, ఉద్వేగాలను వాటికి కారణమైన వారిపై కాకుండా, తనకంటే తక్కువస్థాయి, వ్యక్తులపై, వస్తువులపై చూపడమే విస్తాపనం. ఉదాహరణకు ప్రధానోపాధ్యాయునిపై ఉన్న కోపాన్ని, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులపై చూపడం.


రక్షక తంత్రాలు

రక్షక తంత్రాలు అనే భావనను ప్రవేశపెట్టింది- సిగ్మండ్‌ ఫ్రాయిండ్‌(ఆస్ట్రియా)

  • వ్యక్తి అహాన్ని(ఇగో) వ్యాకులత నుంచి, అపరాధ భావన నుంచి, అగౌరవం నుంచి కాపాడే చేతన, అచేతన ప్రవర్తనను రక్షక తంత్రాలు అంటారు.
  • రక్షక తంత్రాలు మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా తోడ్పడుతుంది.

కొన్ని రక్షక తంత్రాలు


దమనం

  • బాధాకరమైన విషయాలను కావాలని మరిచిపోవడం.
  • ఇది ప్రాథమిక రక్షక తంత్రం. దీనికున్న పేర్లు 1) ప్రేరేపిత విస్మృతి 2) ఉద్దేశపూర్వక విస్మృతి 3) బలవంతపు మలిమరుపు
  • ఉదా: పదో తరగతి ఫెయిల్‌ అయిన జ్యోతి, కావాలని ఆ విషయాన్ని మర్చిపోవడం


ప్రక్షేపణం

వ్యక్తి తనలోని ప్రేరకాలను, లోపాలను ఇతరులపైకి నెట్టివేయడం

సామెతలు: 1) ఆడలేక మద్దెల ఓడు 

2) పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చన

ఉదా: పరీక్ష ఎందుకు తప్పావు అంటే, మాస్టార్‌ సరిగా పాఠం చెప్పలేదు అని కృష్ణవేణి పేర్కొనడం.


హేతుకీకరణ/ హేతువాద వితరణ

వ్యక్తి తన వైఫల్యాలను కుంటిసాకులతో సమర్థించుకోవడం.

సామెత: అందని ద్రాక్షపళ్లు పుల్లన.

ఉదా: పిల్లవాడిని చావబాదిన ఉపాధ్యాయుడు, ఆ పిల్లవాడి మంచికోసమే అలా చేశాను అని చెప్పడం.


విస్తాపనం

వ్యక్తి తన కోపాలను, ఉద్వేగాలను వాటికి కారణమైన వారిపై కాకుండా, తనకంటే తక్కువస్థాయి, వ్యక్తులపై, వస్తువులపై చూపడం.

సామెత: అత్త మీద కోపం దుత్త మీద చూపడటం.

ఉదా: ప్రధానోపాధ్యాయునిపై ఉన్న కోపాన్ని, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులపై చూపడం.


ప్రతిగమనం

కుంఠనానికి గురైన వ్యక్తి, పెద్దవారు అయినప్పటికీ చిన్నపిల్లల వలె ప్రవర్తించడం.

ఉదా: ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, సురేష్‌ చిన్నపిల్లవాడి వలే ఏడవడం.


ప్రతిచర్యా నిర్మిత/ ప్రేరకం తారుమారు

తన మనసులోని కోరికకు పూర్తిగా భిన్నమెన  కోరికను బయటకు చెప్పడం.

సామెత: అతి వినయం ధూర్త లక్షణం.

ఉదా: ఒక ఉపాధ్యాయునికి హెచ్‌ఎం అంటే ఇష్టంలేదు, కానీ వేదికపై ఆ హెచ్‌ఎం అంటే నాకెంతో ఇష్టం అని చెప్పడం.


పరిహారం

ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో రంగంలో రాణించడం.

ఉదా: చదువులో రాణించలేని కిషోర్‌, ఆటల్లో రాణించడం.


తదాత్మీకరణం

ఇతరులు సాధించిన విజయాలను తానే సాధించినట్లు తృప్తి చెందడం.

సామెత: చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం.

ఉదా: కొడుకు ఉపాధ్యాయుడు అయితే తానే ఉపాధ్యాయుడు అయినట్లు తండ్రి సంతోషపడటం.


ఉదాత్తీకరణం

కోరికలను, ఉద్వేగాలను, సంఘసమ్మతమైన పద్ధతుల్లో వ్యక్తీకరించి తృప్తిపొందడం.

ఉద్వేగపూరిత ఆలోచలను నిర్మాణాత్మక క్రియలో కేంద్రీకరించడం.

ఉదా: భగ్నప్రేమికుడు అయిన సాగర్‌, తన ప్రేయసి మీద కవితలు రాసి గొప్ప భావకవిగా పేరుపొందడం.


స్వైరకల్పన

నిజ జీవితంలో సాధించలేని వాటిని, సాధించినట్లు ఊహించుకోవడం.

పగటి కలలు కనడం

సామెత: గాలిలో మేడలు కట్టడం

ఉదా: శరీర ఆకృతి సరిగాలేని రాణి, మిస్‌వరల్డ్‌ అయినట్లు ఊహించుకోవడం 


ఉపసంహరణ

సామర్థ్యం లేని వ్యక్తి పోటీ నుంచి తప్పుకోవడం.

ఉదా: సరిగా పరీక్షలకు సంసిద్ధం కాని నవీన్‌, టెట్‌ పరీక్ష రాయకుండా తప్పించుకోవడం.


వాస్తవ నిరాకరణ

అంగీకరించడానికి ఇష్టంలేని వాస్తవాలను ఒప్పుకోకపోవడం.

ఉదా: నీవు అహంకారివి అని అంటే, అది వాస్తవమే అయినప్పటికీ, ప్రవీణ్‌ నేను అహంకకారిని కాదు అని నిరాకరించడం.


మాదిరి ప్రశ్నలు

1. వీధిరౌడీగా పేరుగాంచిన మైక్‌టైసన్‌ ప్రముఖ బాక్సర్‌గా మారడం. 

(సమాధానం: 4)

1) హేతుకీకరణం 2) పరిహారం 

3) తదాత్మీకరణం 4) ఉదాత్తీకరణం

2. పదో తరగతి ఫెయిల్‌ అయిన సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ రారాజుగా మారడంలో అతను ఉపయోగించుకున్న రక్షక తంత్రం. 

(సమాధానం: 2)

1) హేతుకీకరణం 2) పరిహారం 

3) తదాత్మీకరణం 4) ఉదాత్తీకరణం

3. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం (సమాధానం: 3)

1) హేతుకీకరణం 2) పరిహారం 

3) తదాత్మీకరణం 4) ఉదాత్తీకరణం

4. ప్రాథమిక రక్షకతంత్రం. (సమాధానం: 1)

1) దమనం 2) ప్రక్షేపణం 

3) హేతుకీకరణం 4) విస్తాపన

5. వైఫల్యాలను కుంటిసాకులతో సమర్థించుకోవడం ఏ రక్షకతంత్రం 

(సమాధానం: 3)

1) దమనం 2) ప్రక్షేపణం 

3) హేతుకీకరణం 4) విస్తాపనం


-ఎ.వెంకటస్వామి

సీనియర్‌ ఫ్యాకల్టీ



Updated Date - 2022-05-21T21:29:10+05:30 IST