ఫార్మాసిటీ రహదారిపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-05-23T05:09:07+05:30 IST

మీర్‌ఖాన్‌పేట నుంచి యాచారం మండల కేంద్రం వరకు

ఫార్మాసిటీ రహదారిపై ఉత్కంఠ
నందివనపర్తి, మేడిపల్లి గ్రామాల మధ్య అర్ధాతరంగా వదిలేసిన రహదారి

  • అర్ధాంతరంగా నిలిచిన పనులు
  • ఎకరానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్‌
  • అంబేద్కర్‌ విగ్రహం వద్ద రోడ్డు వెడల్పు చేస్తే ఉపాధి కోల్పోతామంటున్న వ్యాపారులు
  • తిరుమలేషుని గుట్ట వద్ద ప్రధాన జంక్షన్‌ ఏర్పాటు మేలంటున్న స్థానికులు


యాచారం,  మే 22 :  మీర్‌ఖాన్‌పేట నుంచి యాచారం మండల కేంద్రం వరకు వేసే నాలుగు లేన్ల రహదారిపై మండలంలో రోజుకో తీరుగా ప్రచారం జరుగుతుంది. అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రధాన జంక్షన్‌ ఏర్పాటు చేస్తారని కొందరు అంటుంటే.. తిరుమలేషుని గుట్టకింది భాగాన ఏర్పాటు చేస్తారని మరికొందరు అంటున్నారు. దీంతో స్థానిక వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ దుకాణాలు కూలుస్తారోనని ఆందోళన చెందుతున్నారు. 

యాచారం మండల కేంద్రం వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులు పడకేసినాయి. ఏడాదిన్నర క్రితం మీర్‌ఖాన్‌పేట సమీపంలో బీటిరోడ్డు పక్కన మట్టి రోడ్డు కొంతమేర వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. మండలంలోని నజ్దిక్‌సింగారం నుంచి యాచారం మండల కేంద్రం వరకు నూతనంగా రోడ్డు వేయడానికి, ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరించడం కోసం అధికారులు భూసేకరణ చేయడానికి పలుమార్లు  రైతులకు నోటీసులు జారీ చేశారు. నేడు ఎకరం భూమివిలువ రూ.రెండు కోట్ల పైమాటే ఉంది. ప్రభుత్వం ఎకరం భూమికి కనీసం రూ.50లక్షలు ఇస్తేనే రహదారి విస్తరణకు భూమి ఇస్తామని నజ్దిక్‌సింగారం, నందివనపర్తి, యాచారం, మేడిపల్లి గ్రామాల రైతులు చెబుతున్నారు.  భూసేకరణలో భాగంగా నందివనపర్తి, మేడిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 15 మంది రైతులు పూర్తిగా భూములు కోల్పోతున్నారు. నేడు యాచారం మండలంలో గజం ప్లాటు ధర రూ.15వేల నుంచి రూ.30 వేల వరకు ఉందని, దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిహారం చెల్లించాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.  కందుకూరు మండలంలోని బేగరికంచ సమీపంలో రహదారి కోసం భూములు ఇచ్చిన రైతులకు కూడా 121 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.  


యాచారంలో  దుకాణాల పరిస్థితేంటి..?

అంబేద్కర్‌ విగ్రహ సమీపంలో నాలుగులేన్ల రోడ్డు వేస్తే యాచారం మండల కేంద్రంలో 30 దుకాణాల వరకు కనుమరుగయ్యే అవకాశం ఉంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా దుకాణాలను కూలిస్తే వారంతా ఉపాధి లేక వీధినపడనున్నారు. మండల కేంద్రంలో బట్టలు, హార్డ్‌వేర్‌, సిమెంట్‌, చెప్పులు, పండ్లు, కూరగాయల వ్యాపారం ద్వారా పలువురు జీవనం సాగిస్తున్నారు. రహదారి విస్తరణలో దుకాణాలు కూలిస్తే తాము బతికేదెలా అని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అంబేద్కర్‌ విగ్రహం నుంచి కాకుండా వ్యవసాయ భూముల మీదుగా నూతనంగా రహదారి వేస్తే బాగుంటుందని వ్యాపారులు కోరుతున్నారు. అదేవిధంగా తిరుమలేషుని ఆలయం గుట్ట కింద ఫార్మాసిటీ రహదారి ప్రధాన జంక్షన్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అలా చేయడం వల్ల నేడున్న దుకాణాదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్థానికులు చెబుతున్నారు. 


ఎకరాకు రూ.50లక్షల పరిహారమివ్వాలి

రోడ్డుకోసం తీసుకుంటున్న భూములకు ఎకరాకు రూ.50లక్షల పరిహారమివ్వాలి. ఇదే భూమిని ప్రైవేటుకు అమ్ముకుంటే ఎకరాకు రూ.కోటి 30లక్షల డబ్బు వస్తుంది. రోడ్డు కోసం భూమి ఇచ్చి మేం ఏం చేసి బతకాలో అధికారులే సమాధానం చెప్పాలి. పట్టా భూమిని బలవంతంగా తీసుకుంటామంటే మేం చూస్తూ ఊరుకునేది లేదు. రైతులు కోరినంత పరిహారం ఇవ్వాల్సిందే. 

- కె.జోగిరెడ్డి, రైతు నందివనపర్తి


ప్రభుత్వ నిబంధనల మేరకే పరిహారమందజేస్తాం

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రైతులకు పరిహారం అందజేస్తాం. ఎకరాకు రూ.50లక్షల పరిహారం ఇవ్వడం కుదరదు. అంతమొత్తంలో పరిహారం ఇవ్వాలని రైతులు కోరడం సమంజసం కాదు. రైతులు కూడా ఆలోచన చేయాలి. రోడ్లు వేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందనే విషయం గుర్తుంచుకోవాలి.

- వెంకటాచారి, ఆర్‌డీవో, ఇబ్రహీంపట్నం



Updated Date - 2022-05-23T05:09:07+05:30 IST