ఉత్సాహంగా కనుమ సంబరాలు

ABN , First Publish Date - 2022-01-17T05:06:12+05:30 IST

మండల వ్యాప్తంగా ఉత్సాహంగా కనుమ సంబరాలను ఆదివారం నిర్వహించారు.

ఉత్సాహంగా కనుమ సంబరాలు
ఒంటిమిట్టలో గొబ్బెమ్మ ఊరేగింపు

ఒంటిమిట్ట, జనవరి 16 : మండల వ్యాప్తంగా ఉత్సాహంగా కనుమ సంబరాలను ఆదివారం నిర్వహించారు. వీధివీధినా వాడవాడలా గొబ్బెమ్మలతో చెక్కభజన, కోలాటాలతో చిన్నాపెద్దా తేడా లేకుండా పెద్ద ఎత్తున మహిళలు సంబరాలు నిర్వహించారు. గొబ్బెమ్మల వెంట పెద్ద ఎత్తున బాణాసంచా, చిన్నారుల నృత్యాలతో సంబరాలు నిర్వహించారు. కనుమ ఆదివారం రావడంతో పెద్ద ఎత్తున  మాంసపు దుకాణాల వద్ద జనం బారులు తీరారు. 

కోదండరామాలయంలో : ఏకశిలా నగిరి కోదండరామాలయంలో సంక్రాంతి పురస్కరించుకొని ఆదివారం కనుమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను శ్రీ సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయాలతో రామాలయంలో అర్చకులు స్వామి వారికి పూజలు నిర్వహించి అనంతరం అంతరాలయంలో ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. కరోనా నేపధ్యంలో కనుమ ఉత్సవాలను రామాలయానికి పరిమితం చేశారు. 

 

సంబేపల్లెలో...


సంబేపల్లె, జనవరి 16: మండల వ్యాప్తంగా కనుమ ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. పలు గ్రామాలలో ప్రజలు చిట్లాకుప్పలకు నిప్పంటించి పశువులను చిట్లాకుప్ప చుట్టూ తిప్పారు. కాటమరాజు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరాయనల్లగంగమ్మ ఆలయంలో ఆలయ ఛైర్మన్‌ మునగా మురళీస్వామి ఆధ్వర్యంలో  గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విదంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో చిట్లాకుప్పలు వేసి కాటమరాజు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశువులను ముస్తాబు చేసి చిట్లాకుప్ప వద్ద బెదిరించారు. 

 

చిన్నమండెంలో...

చిన్నమండెం, జనవరి 16: మండల వ్యాప్తంగా  కనుమ పండుగను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పశువులను అలంకరించి, చిట్లాకుప్ప వద్ద కాటమరాజుకు  పూజలు నిర్వహించారు. అనంతరం చిట్లాకుప్ప వద్ద పశువులను బెదిరించారు. దేవగుడిపల్లె గ్రామం కురవపల్లె వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై చిట్లాకుప్ప వద్ద కనుమ ఉత్సవాలను తిలకించారు. 


గాలివీడులో...


గాలివీడు, జనవరి 16: సంకాంత్రి సంబరాలలో భాగంగా ఆదివారం కనుమ రోజు కాటమరాజు ఆలయం వరకు పశువులను బాజాభజంత్రీలతో టపాసులు పేలుస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. కాటమరాజు ఆలయం ఎదుట పేర్చిన చిట్లాకుప్పకు నిప్పంటించారు. దీంతో చిట్లాకుప్ప చుట్టూ తిరిగిన పశువులు చెల్లాచెదురుగా.. పరిగెత్తుతూ ఇళ్ళకు చేరుకున్నాయి. ఈ వేడుకును చూడడానికి చిన్నాపెద్ద పెద్దఎత్తున తరలివచ్చారు.  

Updated Date - 2022-01-17T05:06:12+05:30 IST