ఆదాయమున్నా.. అద్దె ఇవ్వరేం ?

ABN , First Publish Date - 2021-10-11T04:55:28+05:30 IST

ఆదాయమున్నా.. అద్దె ఇవ్వరేం ?

ఆదాయమున్నా.. అద్దె ఇవ్వరేం ?
ఎక్సైజ్‌శాఖా అద్దెవాహనం

ఎక్సైజ్‌శాఖలో అగమ్యగోచరంగా కిరాయి వాహనాల పరిస్థితి 

2019నుంచి నిలిచిపోయిన చెల్లింపులు

ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించలేక యజమానుల అవస్థలు 

ప్రభుత్వం నిధులివ్వడంలేదంటున్న అధికారులు 

ఖమ్మం కమాన్‌బజార్‌, అక్టోబరు 10: రాష్ట్ర ప్రభుత్వం నడిచేదే మద్యం ఆదాయం మీద అంటుంటారు. మద్యం లేకపోతే రాష్ట్ర సంక్షేమం ఆగిపోతుందంటారు. కానీ ఎక్సైజ్‌శాఖ అధికారులు తిరిగే వాహనాలకు మాత్రం అద్దెలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంటారు. నెల కాదు రెండునెలలు కాదు ఏకంగా రెండు సంవత్సరాలుగా అద్దె సొమ్ములు ఇవ్వకపోవడంతో వాహన  యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో 11అద్దె వాహనాలు నడుస్తున్నాయి. నెలకు ఒక్కో వాహనానికి ప్రభుత్వం రూ.33వేలు అద్దెగా నిర్ణయంచింది. డిజిల్‌ ఖమ్మం కూడా ప్రభుత్వమే భరిస్తుంది. డ్రైవర్‌, వాహన నిర్వహణ, ట్యాక్స్‌, పర్మిట్‌, ఇన్సురెన్స్‌ తదితర ఖర్చులు వాహన యాజమానే చేసుకుంటాడు. ఈ ఖర్చులన్నీ పోను నెలకు వాహన ఫైనాన్స్‌ వాయిదాలు కట్టేందుకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితిలేని సందర్భంలో ప్రభుత్వం రెండేళ్లుగా అద్దె సొమ్ము చెల్లించకపోవడంతో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవర్లకు వేతనాలు కూడా అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు.

కరోనా సమయంలోనూ సేవలు 

కరోనా విపత్తులోనూ వాహనాలు ఒక్కరోజు కూడా ఆగకుండా నడిపినప్పటికీ ప్రభుత్వం కనికరించటంలేదని వాహన యజమానులు పేర్కొంటున్నారు. వాహనంలో సకల సదుపాయాలు  లేకుంటే అధికారులు ఆ వాహనంలో ప్రయాణించరని, ఇలాంటి ఖర్చులతో పాటు రవాణశాఖ పన్నులకు అప్పులు తెచ్చి పెట్టాల్సి వస్తోందని యజమానులు చెబుతున్నారు. ఉపాధి కోసం ఎంచుకున్న ఈ మార్గంలో ప్రభుత్వ తీరువల్ల ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఏశాఖకు లేని ఆదాయం ఎక్సైజ్‌శాఖకు వస్తున్నప్పటికి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శిస్తున్నారు. 

పెరుగుతున్న ఫైనాన్స్‌ అవస్థలు 

కొద్ది మొత్తం చెల్లించి వాహనాన్ని తీసుకొని ప్రభుత్వ కార్యాలయానికి అద్దెకు ఇస్తే ఫైనాన్స్‌ తీరిపోయి వాహనం మిగులుతుందన్న ప్రణాళికలతో వాహనాలు కొనుగోలు చేసినవారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అసలు ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించలేని స్థితిలో వాహనాలను ఫైనాన్స్‌ కంపెనీలకు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని యజమానులు వాపోతున్నారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాహనాల అద్దెలు చెల్లించాలని కోరుకుంటున్నారు.

రెండేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం

- కర్నాటి సీతారామయ్య, వాహన యజమాని 

వాహన అద్దెలురాక రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. కరోనా లాంటి విపత్తులో కూడా సేవలు అందించాం. అయినా ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతోంది. ఆదాయం ఉన్న శాఖ అయినా మాకు అద్దెలు ఇవ్వటంలో మాత్రం ప్రభుత్వం నిర్ణక్ష్యం వహిస్తోంది. ఆదాయం వస్తుందనుకుంటే అప్పులే మిగిలుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించి అద్దెలు చెల్లించాలి.

పేరుకుపోతున్న అప్పులు 

- సుడిగాలి విజయ్‌భాస్కర్‌, వాహన యజమాని

డ్రైవర్ల జీతాలు, ఫైనాన్స్‌ కట్టలేక అప్పులు పెరిగిపోతున్నాయి. చిన్నచిన్న రిపేర్లకు కూడా వేలకు వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. తెచ్చిన అప్పులకు ఇచ్చే కిరాయికి కూడా సరిపోవడం లేదు. ఇలాంటి సమయంలో వాహనాలు నడపలేని పరిస్థితి ఉంది. ఉపాధి దొరకుతుందనుకుంటే అప్పులే మిగులుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ వాహన కిరాయిలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. 

Updated Date - 2021-10-11T04:55:28+05:30 IST