అగ్రికల్చర్‌లో అగ్రస్థానం

ABN , First Publish Date - 2022-08-07T06:10:38+05:30 IST

వ్యవసాయ రంగ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడానికి ఆ శాఖ ఆధ్వర్యంలో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు. ప్రతీ రైతుకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు చేపట్టారు.

అగ్రికల్చర్‌లో అగ్రస్థానం
పంటలను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్‌(ఫైల్‌)

పలు విభాగాల్లో జిల్లా నంబర్‌వన్‌  

క్రాప్‌ బుకింగ్‌, పీఎం కిసాన్‌,  రైతుబీమాలో ముందంజ

57.03 పాయింట్లు  సాధించిన వ్యవసాయశాఖ  

23 నుంచి  మొదటి స్థానంలోకి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 6 : వ్యవసాయ రంగ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడానికి ఆ శాఖ ఆధ్వర్యంలో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు. ప్రతీ రైతుకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు రైతుల శ్రేయస్సు కోసం కృషి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ విధానాలను ఆచరించే విషయంలో పోటీతత్వాన్ని కూడా అమలు చేశారు. ఈ పోటీలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానాన్ని దక్కించుకొని ముందంజలో ఉంది. 


క్రాప్‌ బుకింగ్‌లో టాప్‌

సిద్దిపేట జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. ఇదే స్థాయిలో సర్వే నంబర్లు కూడా ఉన్నాయి. ఇందులో దాదాపు 6 నుంచి 7లక్షల ఎకరాల్లో రకరకాల పంటలు సాగు చేస్తారు. కూరగాయలు, మామిడి, బత్తాయి, నిమ్మ ఇతర తోటలు కాకుండా 5 లక్షల ఎకరాల పైచిలుకు వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటసాగు ఉంటుంది. ఈ వానకాలం సాగుకు సంబంధించి నెల రోజులుగా ఏవోలు, ఏఈవోలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఏ రైతు ఏ పంటను సాగు చేస్తున్నారో అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆగస్టు నెల వరకు వ్యవసాయశాఖ 40 పాయింట్లను ఈ క్రాప్‌ బుకింగ్‌ కోసం నిర్ధేశించగా సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ 11.12 పాయింట్లు సాధించింది. 7.85 పాయింట్లతో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉండగా 1.14 పాయింట్లతో ఆసిఫాబాద్‌ జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. 


పీఎం కిసాన్‌.. రైతుబీమాలోనూ

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద ప్రతీ ఏటా పెట్టుబడి సాయం అందుతున్నది. ఇందులో చాలా మంది రైతుల పేర్లు లేవు. అంతేగాకుండా ప్రస్తుతం సాయం పొందుతున్న రైతుల వివరాలు కూడా అస్పష్టతతో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతీరైతు నుంచి ఈకేవైసీ ధృవీకరణ చేపట్టాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనికి 30 పాయింట్లు కేటాయించగా సిద్దిపేట జిల్లా 19.10 పాయింట్లు సాధించింది. అదేవిధంగా 2022 సంవత్సరానికి సంబంధించి రైతు బీమా నమోదు కోసం కూడా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. వ్యవసాయ పట్టా పాస్‌బుక్‌ ఉన్న రైతులందరూ భీమా చేయించుకునేలా ప్రొత్సహించారు. దీనికి 30 పాయింట్లకు గాను 26.81 పాయింట్లు జిల్లా వ్యవసాయశాఖ పొందింది. నూటికి నూరుశాతం దిశగా ప్రయత్నిస్తున్నారు. 


23వ స్థానం నుంచి మొదటికి..

గత మార్చి నెలలో ఇదే విభాగాల్లో సిద్దిపేట జిల్లా 23వ స్థానంలో ఉంది. ఆతర్వాత ప్రత్యేక దృష్టి సారించి ఒక్కొక్క స్థానం ఎగబాకుతూ ఆగస్టు నెలలో మొదటిస్థానానికి చేరడం విశేషం. గత నెలలో కుండపోత వర్షాలతో కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ ఆతర్వాత మళ్లీ శ్రమించారు. డీఏవో శివప్రసాద్‌ సైతం ప్రతీరోజు ఒక్కో మండలంలో పర్యటిస్తూ అక్కడి అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆ ఫలితంగానే మెరుగైన ర్యాంకులను జిల్లా దక్కించుకుంది.


టీంవర్క్‌తోనే సాధ్యమైంది

క్రాప్‌ బుకింగ్‌, పీఎం కిసాన్‌ ఈకేవైసీ, రైతుబీమా అంశాల్లో అగ్రస్థానం దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, కార్యాలయ సిబ్బంది చాలా అప్రమత్తంగా వ్యవహరించారు. టార్గెట్‌ చేరుకోవడానికి అన్ని విధాలుగా శ్రమించాం. ఇదే స్ఫూర్తిని ప్రతీ నెల కొనసాగిస్తాం. రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే ఈ అంశాలపైనా రోజువారీ సమీక్షలు నిర్వహించడం వల్ల సత్ఫలితాలు వచ్చాయి.  

- శివప్రసాదర్‌, డీఏవో, సిద్దిపేట

Updated Date - 2022-08-07T06:10:38+05:30 IST