మాజీ ఎమ్మెల్యే ‘సానికొమ్ము’ ఇక లేరు

ABN , First Publish Date - 2021-10-15T04:48:18+05:30 IST

దర్శి మాజీ శాసనసభ్యుడు, వైసీపీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ సానికొమ్ము పిచ్చిరెడ్డి (74) గురువారం ఉదయం మృతి చెందారు. నాలుగురోజులుగా ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా చనిపోయారు.

మాజీ ఎమ్మెల్యే ‘సానికొమ్ము’ ఇక లేరు
సానికొమ్ము పిచ్చిరెడ్డి

నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు, అభిమానులు 

పొదిలి, అక్టోబరు 14 : దర్శి మాజీ శాసనసభ్యుడు, వైసీపీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ సానికొమ్ము పిచ్చిరెడ్డి (74) గురువారం ఉదయం మృతి చెందారు. నాలుగురోజులుగా ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా చనిపోయారు. కొనకనమిట్ల మండలం పేరారెడ్డిపల్లిలో 1947లో ఆయన జన్మించారు. పొదిలిలో ఆసుపత్రిని ఏర్పాటు చేసి మంచి వైద్యుడిగా గుర్తింపు పొందారు. 1985లో దర్శి శాసనసభ్యునిగా పోటీ చేసి ఓడిపోయారు. 1987లో పొదిలి ఎంపీపీగా గెలుపొందారు.1989, 99 ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  పిచ్చిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పొదిలిలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు కృషి చేశారు. పొగాకు వేలం కేంద్రం ఏర్పాటులో ఆయన కృషి ఉంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయించారు. పిచ్చిరెడ్డికి కుమారుడు శ్రీనివాసరెడ్డి, ఇద్దరు కుమార్తెలు అపర్ణ, హిమబిందు ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. విషయం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పొదిలికి చేరుకొని పిచ్చిరెడ్డి పార్థీవదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారిలో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కేవీ రమణారెడ్డి, యర్రం వెంకటరెడ్డి, పొదిలి, కంభం ఏఎంసీ చైర్మన్‌లు కోటేశ్వరి శ్రీనివాస్‌, వై.వెంకటేశ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్‌లు వైవీ భద్రారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, నేతలు గొలమారి రమణారెడ్డి, టీడీపీ నేతలు గునుపూడి భాస్కర్‌, వరికుంట్ల అనిల్‌, సామంతపూడి నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నేత షేక్‌సైదా, కాపు సంఘం నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు గుజ్జుల సంజీవరెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, టి.బాలిరెడ్డి, బంది సాహెబ్‌ ఉన్నారు. 

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పిచ్చిరెడ్డికి సన్నిహిత, బంధుత్వ సంబంధాలున్నాయి. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి వదిన కుమారుడు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు చెప్పారు.

Updated Date - 2021-10-15T04:48:18+05:30 IST