జీవీ ఆంజనేయులు
టీడీపీ నేత జీవీ ఆంజనేయులు
నరసరావుపేట టౌన్, నవంబరు 29: వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో పేదలకు శాశ్వతగృహహక్కు అంటూ జగన్మోహన్రెడ్డి అండ్‌కో భారీస్థాయిలో వసూళ్లకు సిద్ధమయ్యారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం టీడీపీకార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1983 నుంచి పేదలు నివాసం ఉంటున్న ఇళ్లకు ఇప్పుడు ఈ ప్రభుత్వం హక్కులిచ్చేదేంమిటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తెచ్చిన జీవో 82ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. వేలాది హామీలిచ్చిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నవరత్నాలంటూ పేదల జీవితాలను నాశనం చేశాడన్నారు. పన్నులు, అదనపుఛార్టీల పేరుతో ప్రజలనుంచి దోచుకుంటున్నది చాలక, ఇప్పుడు వారి ఇళ్లపై ముఖ్మమంత్రి కన్నేశాడన్నారు. వైసీపీ ప్రభుత్వపాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని, లక్షల కోట్లు జగన్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళుతోందని ఆయన ఆరోపించారు. పేదలకోసం గతంలో చంద్రబాబుప్రభుత్వం కట్టించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వారి నుంచి కూడా అదనంగా వసూలు చేయాలని సంకల్పించాడన్నారు. ఓటీఎస్ పేరుతో ప్రజనుంచి రూ.10 వేలకోట్ల వరకు కాజేయాలనుకుంటున్న వైసీపీ దోపిడీ దొంగల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు.