బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-25T05:53:42+05:30 IST

బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత

బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత

హైదరాబాద్‌లో బ్రెయిన్‌స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ తుదిశ్వాస

సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

బూర్గంపాడు, ఏప్రిల్‌ 24: భద్రాద్రి జిల్లా బూర్గంపాడు (పునర్విభజనకు ముందు) నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కుంజా భిక్షం(65) శనివారం రాత్రి హైదారాబాదులోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. బూర్గంపాడు ఆసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న సమయంలో సీపీఐ  తరపున 1989, 1999 సంవత్సరాల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆశ్వాపురంలోని హెవీవాటర్‌ ప్లాంట్‌లో కార్మికుడిగా పనిచేసే సమయంలో కుంజా భిక్షం సీపీఐ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున 1989లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా 46,179ఓట్లు సాధించి గెలుపొందారు. అదే విధంగా 1994లో మరోసారి సీపీఐ తరపున పోటీ చేసి 56,946ఓట్లు సాధించి గెలుపొందారు. అనంతరం సీపీఐలో తలెత్తిన విభేదాల వల్ల ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అప్పుడే ఎమ్మెల్యేగా ఉన్న భిక్షంను సీపీఐ సస్పెండ్‌ చేసింది. ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం కుంజా భిక్షంకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో హైదారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుముశారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి

సీపీఐ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గెలుపొందిన కుంజా భిక్షం ఆ పార్టీని వీడిన తర్వాత పలు పార్టీలలో చేరారు. తొలుత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన తరువాత వైఎస్‌ఆర్‌సీపీకి మారారు. ఆ తరువాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అక్కడా ఇమడలేక మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  కుంజా భిక్షం ఒకసారి జడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి చెందారు. స్వతంత్ర ఆభ్యర్థిగా పినపాక ఆసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలయ్యారు.  

Updated Date - 2021-04-25T05:53:42+05:30 IST