వేతనాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే బొల్లినేని

ABN , First Publish Date - 2022-06-23T04:02:58+05:30 IST

పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఎద్దేవా చేశారు.

వేతనాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే బొల్లినేని
ఉదయగిరిలో పేరుకుపోయిన చెత్తను పరిశీలిస్తున్న బొల్లినేని

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 22: పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఎద్దేవా చేశారు. బుధవారం స్థానిక పంచాయతీ బస్టాండ్‌ సెంటర్‌లో పేరుకుపోయిన చెత్తను టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీధులను శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోతే వారి కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన సొంత నిధులు రూ.6 లక్షలు కార్మికులకు వేతనాల కింద చెల్లించానన్నారు. అధికారులు స్పందించి వారికి వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందన్నారు. నియోజకవర్గంలో సహజ సంపదలను అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారన్నారు. అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందన్నారు. ఎక్కడికెళ్లినా జగన్‌కు ఓటేసి తప్పు చేశామని, ఇక జీవితంలో ఆ తప్పు మళ్లీ చేయమని ప్రజలు వాపోతున్నారన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ఇటీవల తేనే సేకరణకు వెళ్లి మృతి చెందిన దుర్గంపల్లికి చెందిన వెంగయ్య, రమేష్‌ల కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారి కుటుంబాలకు బొల్లినేని, చెంచలబాబుయాదవ్‌ ఆర్థికసాయం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పీ.చెంచలబాబుయాదవ్‌, నాయకులు బయ్యన్న, అబ్బయ్యనాయుడు, బొజ్జా నరసింహులు, గడ్డం వెంకటేశ్వర్లు, శ్రీకుర్తి రవీంద్రబాబు, గడ్డం నాయుడు, యేదుపాటి రామయ్య, మాబాషా, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.    


Updated Date - 2022-06-23T04:02:58+05:30 IST