బోడె ప్రసాద్‌పై హత్యాయత్నం కేసు

ABN , First Publish Date - 2022-05-19T06:40:42+05:30 IST

బోడె ప్రసాద్‌పై హత్యాయత్నం కేసు

బోడె ప్రసాద్‌పై హత్యాయత్నం కేసు

మచిలీపట్నం/పెనుమలూరు, మే 18 (ఆంధ్రజ్యోతి) : పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై బుధవారం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పెనుమలూరు డెప్యూటీ తహసీల్దార్‌ (పీడీఎస్‌) గుమ్మడి విజయ్‌కుమార్‌పై మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. పెనుమలూరు రేషన్‌ డీలర్‌ లుక్కా అరుణ్‌బాబు రేషన్‌ షాపును మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డెప్యూటీ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల్లోని వివరాలకు, నిల్వ ఉన్న సరుకుకు సంబంధించి నివేదికను మధ్యవర్తుల సమక్షంలో నమోదు చేస్తున్నారు. ఈ విషయాన్ని రేషన్‌ డీలర్‌ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సమాచారం అందించాడు. దీంతో బోడె ప్రసాద్‌ తన అనుచరులతో కలిసి రేషన్‌షాపు వద్దకు వచ్చారు. ఆ సమయంలో అధికారులకు, మాజీ ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో డెప్యూటీ తహసీల్దార్‌ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు 352/2022 యూఎస్‌ 353, 332, 323, 506, 392, 307 ఆర్‌డబ్ల్యూ34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంగూరు పవన్‌, చిగురుపాటి శ్రీనివాసరావు, దొంతగాని పుల్లేశ్వరరావు, కొల్లిపర ప్రమోద్‌కుమార్‌, కిలారు ప్రవీణ్‌కుమార్‌, బోడె మనోజ్‌, కాపరావతు వాసు, కిలారు కిరణ్‌కుమార్‌ను బుధవారం అరెస్టు చేశారు. 

 కావాలనే బోడె పేరు చేర్చారా?

 డెప్యూటీ తహసీల్దార్‌పై దాడి సమయంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సంఘటనా స్థలానికి కొద్దిదూరంలో ఉన్నారని సంఘటనాస్థలంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. అయితే, విధుల్లో ఉన్న అధికారిపై మాజీ ఎమ్మెల్యే దాడి చేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొని, కావాలనే బోడె ప్రసాద్‌ పేరు చేర్చారనే వాదన వినిపిస్తోంది. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ చేయకుండా పోలీసులు హడావుడిగా ఆయన పేరు చేర్చారని, ఇందులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని బోడె వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-05-19T06:40:42+05:30 IST