మైనింగ్ పేరుతో గిరిజనులపై దాడి చేస్తున్నారు: నక్కా ఆనంద్ బాబు

ABN , First Publish Date - 2021-08-09T23:55:20+05:30 IST

గుంటూరు: వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ పేరుతో గిరిజనులపై దాడి జరుగుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు.

మైనింగ్ పేరుతో గిరిజనులపై దాడి చేస్తున్నారు: నక్కా ఆనంద్ బాబు

గుంటూరు: వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ పేరుతో గిరిజనులపై దాడి జరుగుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీడీపీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిపుత్రిక కళ్యాణ పథకాన్ని రద్దు చేసి గిరిజన యువతులను.. సీఎం జగన్ మోసం చేశారన్నారు. సాంఘిక శాఖా మంత్రిగా గిరిజనుల భాష, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు తన వంతు కృషి చేశానని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా.. ఎన్నడూ లేని విధంగా ఏపీలో గిరిజన జాతులపై మూకుమ్మడి దాడి జరుగుతోందని ఆరోపించారు. మోసపూరిత వాగ్దానాలతో గిరిజనుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన జగన్.. నేడు కులాలు, మతాలే లేవని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రత్యేక అధికారాలు ఇస్తే.. వాటిని కాలరాస్తున్నారని మండిపడ్డారు. పాడేరులో ఆదివాసి దినోత్సవం రోజున గిరిజనుల పెన్షన్ వయసును 50 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించి.. దానిని అమలు చేసిన ఘనత మాజీ సీఎం చంద్రబాబు నాయుడిది అని గుర్తు చేశారు. కొండ ప్రాంతాలకు సైతం ఐదు కేజీల సిలిండర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే గిరి గోరుముద్దలు, గిరిపుత్రికా కళ్యాణం వంటి పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల సంక్షేమానికి కేవలం రూ.6,000 కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్రం విడిపోయాక టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు దాదాపు రూ.15,000 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. గిరిజనులను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ధారు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-09T23:55:20+05:30 IST