దళితుడినని గంజాయి నోటీసులా?

ABN , First Publish Date - 2021-10-29T05:21:21+05:30 IST

గంజాయిపై మాట్లాడిన తాను దళితుడ్ని కాబట్టే పోలీసులు నోటీసులు ఇచ్చి, ఆధారాలు సేకరించాలని సోక్షన 161 కింది స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని పోలీసులు ఇంటికి వచ్చి రచ్చరచ్చ చేశారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తెలిపారు.

దళితుడినని గంజాయి నోటీసులా?
నక్కా ఆంనదబాబు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌

పోలీసులపై నక్కా ఆనందబాబు ధ్వజం

గుంటూరు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): గంజాయిపై మాట్లాడిన తాను దళితుడ్ని కాబట్టే పోలీసులు నోటీసులు ఇచ్చి, ఆధారాలు సేకరించాలని సోక్షన 161 కింది స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని పోలీసులు ఇంటికి వచ్చి రచ్చరచ్చ చేశారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ అన్నారని, ఆయన ఇంటికి అర్ధరాత్రి వెళ్లి నోటీసులిచ్చే థైర్యం పోలీసులకు ఉందా అని నిలదీశారు. దళిత నేతను కాబట్టే అలుసుగా  తీసుకున్న పోలీసులు అర్ధరాత్రి తనింటికి వచ్చారా అని ప్రశ్నించారు. దళితులంటే సీఎంకు, డీజీపీకి అలుసుగా ఉందని మండిపడ్డారు. గంజాయి సాగుతో లోకేశకు సంబంధం ఉందన్న ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంతో డీజీపీ తేల్చాలని డిమాండ్‌ చేశారు. విజయసాయికి నర్సీపట్నం సీఐ, విశాఖ పోలీసులు నోటీసులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షనేతలకు, ప్రజలకు  జీవించే హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా టిక్కెట్లపై చర్చ సిగ్గుచేటు : శ్రావణ్‌కుమార్‌

ప్రజల సమస్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించకుండా సినిమా టిక్కెట్ల అమ్మకంపై చర్చించడం సిగ్గుచేటని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వానికి డ్రగ్స్‌ రవాణా, రేషన డీలర్ల ధర్నా, ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఆందోళనలు పట్టవా అని ప్రశ్నించారు.     శారదాపీఠాధిపతిపై ఉన్న శ్రద్ధ కూడా ప్రజలపై ప్రభుత్వానికి లేదన్నారు. ఏపీ కేబినేట్‌ కిచెన కేబినెట్‌గా వ్యవహరించింది తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదని తెలిపారు.


Updated Date - 2021-10-29T05:21:21+05:30 IST