Yeddyurappa's decision...concerns seniors: యడియూరప్ప నిర్ణయం... సీనియర్లకు కలవరం

ABN , First Publish Date - 2022-07-26T18:36:53+05:30 IST

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు...’ బీజేపీ ముఖ్యనేత యడియూరప్ప(Yeddyurappa) ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాలని తీసుకున్న

Yeddyurappa's decision...concerns seniors: యడియూరప్ప నిర్ణయం... సీనియర్లకు కలవరం

- డైలామాలో బీజేపీ కీలక నేతల భవిష్యత్తు 

- 75 ఏళ్లు దాటిన వారికి టికెట్లపై సందేహం 

- కొందరు మంత్రులు, మాజీలదీ అదే పరిస్థితి


బెంగళూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు...’ బీజేపీ ముఖ్యనేత యడియూరప్ప(Yeddyurappa) ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాలని తీసుకున్న నిర్ణయం ఎంతోమంది సీనియర్‌ నేతలకు కలవరం పుట్టిస్తోంది. దక్షిణభారత్‌లోనే బీజేపీ(Bjp) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శక్తివంతమైన యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించడంతో సాధారణంగా వివిధ హోదాల్లో కొనసాగినవారు తమ భవిష్యత్తు ఏమిటనే డైలామాలో పడ్డారు. రాష్ట్రంలో మరో పది నెలల్లో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. ఆ తర్వాత ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఇలా బీజేపీలో 75 ఏళ్లు పైబడిన పలువురికి టికెట్లు దక్కవనే గందరగోళం ఏర్పడింది. యడియూరప్ప తరహాలో మరోసారి తమకూ అవకాశం ఉంటుందని సీనియర్లు భావించారు. కానీ యడియూరప్ప లాంటి కీలక నేత విషయంలోనే పార్టీ ఆలోచించని పక్షంలో మిగిలిన వారి పరిస్థితి ఏమవుతుందోననే గుసగుసలు జోరందుకున్నాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలనుకున్న ఉమేశ్‌కత్తి, మాజీ మంత్రి ఈశ్వరప్ప, జలవనరులశాఖ మంత్రి గోవింద కారజోళ, వసతి శాఖ మంత్రి సోమణ్ణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మాధుస్వామి, మాజీ మంత్రి సురేశ్‌కుమార్‌, జీహెచ్‌ తిప్పారెడ్డి, ఎస్‌ఏ రవీంద్రనాథ్‌తోపాటు పలువురికి టికెట్లు దక్కవనే చర్చలు పార్టీలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీలు బీఎన్‌ బచ్చేగౌడ, రమేశ్‌ జిగజిణగి, పీసీ గద్దిగౌడర్‌, జీఎం సిద్దేశ్వర్‌తోపాటు మరింతమంది ఇదే జాబితాలో ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ శక్తివంతమయ్యేందుకు యడియూరప్పతోపాటు దివంగత కేంద్రమంత్రి అనంతకుమార్‌, ఈశ్వరప్ప ప్రముఖులే. శివమొగ్గ స్థానం నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఈశ్వరప్పకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనిపిస్తోంది. కాంట్రాక్టర్‌ సంతోష్‏పాటిల్‌(Santosh patil) ఆత్మహత్య వివాదంలో ఈశ్వరప్ప(Eshwarappa) మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒక ఆరోపణకే మంత్రి పదవికి దూరం చేసినవారు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇ స్తారా..? అనేది కీలకమవుతోంది. ఇక జనతా పరివార్‌ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన గోవింద కారజోళ 2018లోనే ఇవే చివరి ఎన్నికలని ప్రకటించారు. కానీ ఇటీవల 2023 ఎన్నికల్లో ముథోళ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రస్తావించినా టికెట్‌ దక్కడం అసాధ్యమనిపిస్తోంది. వసతి శాఖ మంత్రి సోమణ్ణ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. కానీ టికెట్‌ ఇవ్వడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేకున్నా, సురేశ్‌కుమార్‌ను మంత్రి పదవి నుంచి తప్పించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కూడా అసాధ్యమనిపిస్తోంది. 75 ఏళ్లు దాటకపోయినా రాజాజినగర్‌ నుంచి మరొకరిని రంగంలోకి దించేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. చామరాజనర్‌ నుంచి ఎంపీ శ్రీనివాసప్రసాద్‌కు కేంద్ర కేబినెట్‌లో ఙఅవకాశం ఇస్తామన్నా వయసురీత్యా దేశమంతటా సంచరించలేనని, పదవికి న్యాయం చేయడం సాధ్యం కాదని సున్నితంగా తిరస్కరించారు. ఆయన మరోసారి పోటీ చేసే అవకాశం లేకపోగా టికెట్‌ కూడా అసాధ్యమే అనిపిస్తోంది. వయసు పైబడిన వారందరిని తప్పించి ద్వితీయ శ్రేణి నాయకులను క్రియాశీలకంలోకి తీసుకురావాలనే బీజేపీ అగ్రనేతల అభిప్రాయాలకు యడియూరప్ప మార్గదర్శకులయ్యారు. 



Updated Date - 2022-07-26T18:36:53+05:30 IST