Abn logo
Feb 24 2021 @ 00:36AM

పుదుచ్చేరి పరిణామం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు పుదుచ్చేరిలో మూడువేలకోట్ల రూపాయలు విలువచేసే కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. జాతీయరహదారి విస్తరణ, జిప్‌మెర్‌ మెడికల్‌ కాలేజీ కొత్త భవనం, సాగరమాల పథకం కింద ఒక చిన్నపోర్టు, క్రీడారంగానికి సంబంధించిన అధునాతన సదుపాయాలు ఇత్యాదివి ఇందులో ఉన్నాయి. ఫ్రెంచ్‌ పాలనా కాలం నాటి పునరుద్ధరించిన భవనం ఒకదానిని కూడా ప్రధాని ప్రారంభించబోతున్నారు. నూటయాభైయేళ్ళనాటి ఈ భవనం 2014లో భారీవర్షాలకు కుప్పకూలితే, ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్రప్రభుత్వం చేపట్టిన పునరుద్ధరణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. పక్షం రోజుల క్రితం దీని ఆరంభోత్సవానికి సంబంధిత ప్రాజెక్టు అధికారులు ముఖ్యమంత్రిని చీఫ్‌


గెస్టుగా పిలిచినందుకు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ ఆగ్రహించారు. ఆ కార్యక్రమాన్ని రద్దుచేయించడంతోపాటు, ఇకపై కేంద్రప్రభుత్వం వాటా లేశమాత్రం ఉన్నా సదరు ప్రాజెక్టుల ఆరంభోత్సవాలకు తనను మాత్రమే పిలవాలనీ లేనిపక్షంలో శిక్ష తప్పదని అధికారులను హెచ్చరించారు. ఇప్పుడు వేదికమీద నారాయణసామి, కిరణ్‌బేడీ ఇద్దరూ లేకుండా నరేంద్రమోదీ రిబ్బను కత్తిరిస్తున్నారు.


నారాయణసామి రాజీనామా లేఖని నిజానికి కిరణ్‌బేడీ అందుకొని ఉంటే సముచితంగా ఉండేది. ఐదేళ్ళ ఆమె కృషి ఫలితం ఈ పరిణామం. ఎమ్మెల్యేల వలసల వెనుకా, ఆఖరిఘట్టంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు జ్ఞానోదయం కలగడం వెనుకా ఆమె పాత్ర కానీ, కుట్రలు గానీ లేవనిపించేందుకు బేడీని కేంద్రం హడావుడిగా పంపించేసింది. సంఖ్యాబలం ఏమాత్రం లేకుండా చేసిన తరువాతే విపక్షపార్టీల ప్రభుత్వాలకు సభా విశ్వాసాన్ని చూరగొనే అవకాశం దక్కడం సహజం. సోమవారం సభలో సత్తా రుజువుచేసుకోవాల్సిందిగా కొత్త గవర్నరు ఇలా అవకాశం ఇచ్చారో లేదో నారాయణసామి చివరి రెండు వికెట్లూ కోల్పోయారు. కాంగ్రెస్‌, డిఎంకెలనుంచి చెరొక ఎమ్మెల్యే ఆదివారం రాజీనామా చేయడంతో మర్నాడు ఆయన ఓటింగ్‌కు ముందే రాజీనామా చేయవలసివచ్చింది. ప్రజాస్వామ్యాన్ని హత్యచేశారంటూ నారాయణసామి ఒకపక్క ఆక్రోశిస్తున్నా, పుదుచ్చేరిలో జరుగుతున్నదేమిటో తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని స్థితి. 19మంది ఎమ్మెల్యేలతో ఆయన ఈ మధ్యవరకూ బలంగానే ఉండేవారు. గత ఏడాది ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేమీద అనర్హతవేటుపడినా వచ్చిన నష్టమేమీ లేకపోయింది. కానీ, నెలరోజుల్లో పరిస్థితి తారుమారైంది. కిరణ్‌బేడీ దాష్టీకానికి వ్యతిరేకంగా నెలరోజులుగా సాగుతున్న నిరసనల్లోనూ, దీక్షల్లోనూ ముఖ్యమంత్రి పక్కనే కూర్చున్న మంత్రులతో సహా కొందరు ఎమ్మెల్యేలు నారాయణసామిని వదిలిపెట్టిపోయారు. కొందరు నేరుగా బీజేపీలో చేరారు, కొందరు తమసేవలకు గుర్తింపు రాలేదని వాపోయారు, చివరకు సంఖ్యాబలం పన్నెండుకు జారి నారాయణసామి అధికారం కోల్పోయారు. కాంగ్రెస్ పక్షాన నిలవడం వల్ల తమకు రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనం ఉండదనీ, బలమైన మోదీ అమిత్‌షా ద్వయం పక్కన చేరితే అంతా బాగుంటుందని వీరంతా భావించి వుంటారు. కొద్దినెలల్లో ఎన్నికలకు పోబోతున్న పుదుచ్చేరిలో కాంగ్రెస్‌తో పోల్చితే ఇప్పుడు బీజేపీపక్షానే ఎక్కువమంది రాజకీయ యోధులున్నారనీ, మోదీ రేపటి పర్యటనతో బీజేపీలో మరింత ఉత్సాహం రగులుతుందనీ అంటున్నారు. 


దక్షిణభారతదేశంలో కాంగ్రెస్‌కు మిగిలిన ఆ కొద్దిపాటి భూమినీ బీజేపీ ఇలా హస్తగతం చేసుకుంది. ఏడాది కాలంలో బీజేపీ ఈ రీతిన సాధించిన రెండో విజయం ఇది. గత ఏడాది దేశంలోకి కరోనా ప్రవేశిస్తున్న కాలంలో 22మంది ఎమ్మెల్యేల నిష్క్రమణ ద్వారా మధ్యప్రదేశ్‌లో కమలనాథ్‌ ప్రభుత్వం కూలింది. జ్యోతిరాదిత్య సింధియా బృహత్తర పాత్ర పోషించారు. ఆ తరువాత రాజస్థాన్‌లో సైతం సచిన్‌పైలట్‌ ఆయుధంగా అటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది కానీ, అశోక్‌ గెహ్లాట్‌ ఎత్తుగడలముందు అది నిలవలేకపోయింది. గవర్నర్ల ద్వారా విపక్ష ప్రభుత్వాలను ఇరుకునపెట్టడం, పాలనాపరమైన సమస్యలు సృష్టించడం, నయానోభయానో ఎమ్మెల్యేలను లొంగదీసుకోవడం, అంతిమంగా ప్రభుత్వాలను కుప్పకూల్చడం ఒక క్రమపద్ధతిన జరుగుతోంది. మేము భిన్నం అని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు మరింత నిర్దయగా రాజ్యాంగనియమాలను కాలరాయడం విషాదం.

Advertisement
Advertisement
Advertisement