అంతా మా ఇష్టం!

ABN , First Publish Date - 2022-06-09T05:18:25+05:30 IST

పాలకుల అనాలోచిత చర్యలు..వచ్చిరాని ప్లానింగ్‌, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అంతా మా ఇష్టం!
అసంపూర్తిగా కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులు


  • డ్రైనేజీ ఉండగానే మరో డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం
  • పాత డ్రైనేజీ బాగానే ఉన్నా  దాని వెంబడి కొత్తది ఏర్పాటు
  • రోడ్డుకు లెవల్‌కు రాగానే  ఆగిపోయిన పనులు 
  • పాత డ్రైనేజీ ధ్వంసం... రోడ్డుపైకి మురుగు
  • దుర్గంధంతో నెల రోజులుగా జనాల ఇబ్బందులు
  • పట్టించుకోని అధికారులు 

పాలకుల అనాలోచిత చర్యలు..వచ్చిరాని  ప్లానింగ్‌,  అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో  కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.  ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది.  పాత లైను బాగానే ఉన్నా  దాని పక్కనే  కొత్తగా  డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. సగానికి  కొత్త పైపులైన్‌ వేయగానే రోడ్డుకు  సమాంతరం కావడంతో అర్ధాంతరంగా  పనులను నిలిపి వేశారు. అంతేకాకుండా పలు చోట్ల  పాత పైపులైన్‌ పగిలి మురుగంతా రోడ్డుపై పారడంతో వీధులు కంపుకొడుతున్నాయి. అవగాహన లేమి,  అవసరం లేకున్నా పనులు చేపట్టి ప్రజాథనం వృథా చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. 

ఘట్‌కేసర్‌, జూన్‌8: మున్సిపల్‌  అధికారుల అనాలోచిత చర్యలతో లక్షల రూపాయాల ప్రజాధనం వృథా అవుతుంది. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో రూ.15లక్షలతో చేపట్టిన  డ్రైనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. సహకార సంఘం చైర్మన్‌ సింగిరెడ్డిరాంరెడ్డి, నివాసం నుంచి హైదారాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి వరకు  అండర్‌డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. జాతీయ రహదారి వైపు ఎత్తు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు, అక్కడి నుంచి కేవలం 50 మీటర్ల దూరం రాగానే డ్రైనేజీ రోడ్డు లెవల్‌కు చేరడంతో పనులను అర్ధాంతరంగా నిలిపి వేశారు. దీనికి తోడు దాదాపు నాలుగు అడుగుల మేర సిమెంట్‌ రోడ్డును పగులగొట్టారు. మున్సిపల్‌ ఇంజనీర్‌ లెవల్‌ చూడకుండా డ్రైనేజీ నిర్మాణ పనులు ఎలా చేపడతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వేసిన డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లు సైతం నాసిరకంగా నిర్మించడంతో ముట్టుకుంటే కూలిపోతున్నాయి. అధికారులు పర్యవేక్షణ కరువవడంతో కాంట్రాకర్ట్‌ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నాడు. 

డ్రైనేజీ ఉండగానే మరొకటి.. 

 మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులోని టీచర్స్‌  కాలనీలో ప్రస్తుతం  అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఉంది. కానీ భవిష్యత్‌ అవసరాల కోసమని రూ.15లక్షలతో ఫీట్‌ సామర్ధ్యం గల పైపులతో కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కనీస అవగాహన  లేకుండా పనులు చేపట్టడంతో ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితి నెలకొన్నది. కాంట్రాక్టర్‌ చేసే పనులను పర్యవేక్షించే నాథుడే లేకుండా పోయారు.  అసలు అక్కడ డ్రైనేజీ అంత అత్యవసరం కాదని కాలనీ వాసులు వాపోతున్నారు. 

బాగానే ఉన్నా  డ్రైనేజీని పగుల గొట్టారు

కొత్త డ్రైనేజీ సంగతేమోగాని పాత డ్రైనేజీ పగులగొట్టడంతో మురుగు నీరంతా రోడ్డుపైకి వస్తోంది.  డ్రైనేజీ నిర్మాణం కోసం ఎక్స్‌కవేటర్‌తో తవ్వకాలు చేస్తుండగా పాత పైపులైన్‌ పగిలి పోయింది. దీంతో మురుగు నీరంతా ఇళ్లమధ్యన పారుతుండటంతో పరిసరాలు  కంపుకొడుతున్నాయి.  నెల రోజల నుంచి దుర్గంధంతో నరకం అనుభవిస్తున్నామని టీచర్స్‌ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారుల, ప్రజాప్రతినిధులు తీరు విచిత్రంగా ఉందని ఎవరు చెప్పిన వినిపించుకోకుండా పనులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చేసిన పని ఎందుకూ పనిరాకుండా పోయింది.

తప్పులను కప్పిపుచ్చుకోవడానికి..

చేసిన పొరపాట్లను కప్పి పుచ్చుకోవడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంత అదనపు బడ్జెట్‌ను కేటాయిస్తే సరిపోతుందని మాట్లడటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరో రూ.15 లక్షలు కేటాయిస్తే తప్ప మురుగు కిందికి పోని పరిస్థితి నెలకొంది.  ఇకనైనా మున్సిపల్‌ విభాగం ఉన్నతాధికారులు స్పందించి లేవల్‌ చూడకుండ అనాలోచితంగా పనులు చేపట్టి ప్రజాధనం వృథా చేస్తున్నారు. దీనికి కారణమైన అధికారుల, కాంట్రాక్టర్‌, ప్రజాప్రతినిధులపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారుల అనాలోచిత చర్య 

మున్సిపల్‌ అధికారులు కనీసం లేవల్‌ చూడకుండా డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడం అందరికి అశ్చర్యం కలిగిస్తుంది. అధికారులు, కాంట్రాక్టర్‌ అంత మాఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పనులు చేపట్టకముందే నీరుపైకి ఎలాపోతుందని చెప్పిన వినకుండా పనులు  ప్రారంభించారు. ఇప్పటి వరకు చేసిన పనంత వృథా అయ్యింది.

                                                           - పల్లె శివకృష్ణ, టీచర్స్‌ కాలనీ, ఘట్‌కేసర్‌ 

రోడ్డుపై మురుగంతా..

కొత్త డ్రైనేజీ పనుల కోసం పాత డ్రైనేజీ పైపులను పగులగొట్టారు. దీంతో మురుగంతా రోడ్డుపై పారుతోంది. డ్రైనేజీ పగినచోట గుంత తవ్వి మరమ్మతులు మరిచారు. గుంతనిండి మురుగు రోడ్డుపై పారుతుండంటంతో తీవ్ర దుర్వాసన వస్తోంది.  నెలరోజులు గడుస్తున్నా కనీస చర్యలు చేపట్టడం లేదు.

                                         - బోనకుర్తి అనంద్‌, స్థానికుడు  టీచర్స్‌ కాలనీ, ఘట్‌కేసర్‌

లెవల్‌  కలవడంలేదు 

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్‌ కాలనీలో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీకి లెవల్‌ కలవడం లేదు. దానిని  సరి చేయడానికి మరికొంత బడ్జెట్‌ అవసరం. ఇన్‌చార్జి ఏఈగా ఉన్నందున పూర్తి సమయం కేటాయించలేక పోతున్నా. సమస్యను పాలకవర్గం దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

                                            - నరేష్‌ కుమార్‌, ఇన్‌చార్జి ఏఈ, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం

టీచర్‌కాలనీలో డ్రైనేజీ నిర్మాణం సమస్యపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈవిషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నెలకొన్న మురుగు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. పగిలిన పాత పైపులు మరమ్మతులు చేపట్టి మురుగునీరు బయటకు రాకుండా చూస్తాం.

                                                      - వసంత,  మున్సిపల్‌ కమిషనర్‌, ఘట్‌కేసర్‌

Updated Date - 2022-06-09T05:18:25+05:30 IST