హైదరాబాద్: మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్త్ రఫ్ చేసిన దగ్గర నుంచి హుజురాబాద్ రాజకీయాలు ఆసక్తి రేపాయి. ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్‌రావు అన్నీ తానై వ్యవహరించారు. ఈటల ఓటమే టార్గెట్‌గా వ్యూహాలు రచించారు. అయితే ఈటల కూడా ముందు నుంచి హరీష్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కదిలారు. దీంతో ఇద్దరి మద్య మాటల తూటాలు కూడా పేలాయి. హుజురాబాద్‌లో విజయం సాధించాక కూడా ఈటల ఏ మాత్రం తగ్గడంలేదు. ఉపఎన్నికలో తనను టార్గెట్ చేసిన హరీష్‌రావుపై దూకుడు పెంచారు.
సీఎం కేసీఆర్‌కు హరీష్‌రావుకు హుజురాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారంటూ ఈటల అన్నారు. ట్రబుల్ షూటర్ పేరిట ఎక్కడపడితే అక్కడ ఎన్నికల ఇన్చార్జ్‌గా వెళ్లిన హరీష్‌రావు తప్పుడు హామీలు ఇచ్చారని ఈటల మండిపడ్డారు. అహంకారమనే ముల్లును హుజురాబాద్ ప్రజలు విరిచేశారని చెప్పారు. దళిత బంద్‌ను సిద్ధిపేట, గజ్వేల్‌లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేటలో కూడా దళిత గర్జన పెట్టే రోజు వస్తుందని, ఆ గర్జనకు తానే నాయకత్వం వహిస్తానని చెప్పారు. టీఆర్ఎస్ కుట్రలు చూసి సభ్య సమాజం తలదించుకుంటోందని ఈటల రాజేందర్ ఆరోపించారు.