ఊరూరా ధాన్యం కొనుగోలు...

ABN , First Publish Date - 2020-04-02T10:53:23+05:30 IST

రబీ సీజన్‌లో రైతు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటన మేరకు

ఊరూరా ధాన్యం కొనుగోలు...

రెవెన్యూ గ్రామాల ప్రాతిపదికన కేంద్రాల ఏర్పాటు  

ఉమ్మడి జిల్లాలో రబీలో 3లక్షల హెక్టార్లలో వరి సాగు   

20.4లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా


యాదాద్రి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌లో రైతు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటన మేరకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం అందుకు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన రైతాంగానికి ఊరటనిచ్చింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు దృష్టిసారించారు. కేంద్రాలు ఏర్పాటు చేసే గ్రామాలు, ఐకేపీ, పీఏసీఎ్‌సలకు కేటాయింపులతో పాటు గొనే సంచులు, తూకం, లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు అవసరమైన హమాలీలు తదితర ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో భౌతికదూరం పాటించేలా వసతులు కల్పించనున్నారు. అదేవిధంగా కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు సంబంధిత శాఖలు, రైస్‌ మిల్లర్లు, పీఏసీఎస్‌, ఐకేపీ ప్రతినిధులతో ఉన్నతాధికారులు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.


 రెవెన్యూ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు

భౌతిక దూరం పాటిస్తున్న నేపథ్యంలో రైతులకు సమీపంలోనే ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరి సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనా మేరకు ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. ప్రతి పంచాయతీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ కొనుగోలు కేంద్రాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 1332 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలో 421 పంచాయతీలు, ఆరు మునిసిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 321 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం యాదాద్రి జిల్లాలో 277 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా అదనంగా మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.


20.4లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి

ఉమ్మడి జిల్లాలో రబీలో సాధారణానికి మించి వరి సాగువిస్తీర్ణం పెరిగింది. మొత్తం 20.4లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో ఈ రబీ సీజన్‌లో వరి సాధారణానికి మించి రెట్టింపు సాగు అయింది. జిల్లాలోని 17 మండలాల్లో 1లక్ష 98ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైంది. 1లక్ష 8వేల 895మంది వరి రైతుల నుంచి 3లక్షల 94వేల 318 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.   

      

పంట పండింది

గోదావరి జలాలు కరువు నేలల్లో సిరులు కురిపించాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లికి నాలుగు నెలల నుంచి శ్రీరాంసాగర్‌ ద్వారా గోదావరి జలాలు విడుదల చేసి చెరువులు, కుంటలు నింపడంతో రెట్టింపు స్థాయిలో రైతులు వరి సాగు చేశారు. దీంతో వరి ధాన్యం చేతికి వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలలో గోదావరి జలాల రాకతో చెరువులు, కుంటలు నిండాయి. దీంతో 47,885 ఎకరాల ఆయకట్టు కింద ఉన్న భూముల్లో రైతులు 95శాతం సాగు చేసి వరి పండించారు.


అర్వపల్లి మండలంలో 17 పంచాయతీల్లో 11వేల ఎకరాల్లో ఎన్నడూ లేని విధంగా వరి సాగైంది. అధికారుల అంచనా ప్రకారం 28మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రానుంది. అందుకు అనుగుణంగా ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు టోకెన్‌ విధానం ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక అవసరాలు, మిల్లర్ల కొనుగోలు ను మినహాయిస్తే 3.55లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాకు రూ.1835 చొప్పున కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, పీఏసీఎస్‌ కొ నుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు ఒక లక్ష గన్నీ బ్యాగులు అవసరమని ప్రతిపాదించా రు.


ప్రస్తుతం జిల్లాలో 25.10లక్షల గన్నీ బ్యాగులు సి ద్ధంగా ఉన్నాయి. అవసరాల మేరకు ఇంకా 74.10 లక్ష ల గన్నీ బ్యాగులు సమకూర్చేందుకు అధికారులు స న్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో వరికోతల ఆధారంగా వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు టోకెన్లు అందజేయనున్నారు. టోకెన్ల ఆధారంగా సూచించిన రోజులోనే సమీపంలో కేటాయించిన కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం విక్రయించాల్సి ఉంటుంది. యాదాద్రా జిల్లాలో వరి కోతలు, ధాన్యం దిగుబడి జరిగే ప్రాంతాల్లో ఈనెల 7వ తేదీ నుంచి ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స న్నాహాలు పూర్తి చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 3వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తేమశాతం, నాణ్యత ప్రమాణాల మేరకు ధాన్యం తీసుకురావాలని, రైతులు పట్టాదారు పాసు పుస్తకంతో పాటు బ్యాంక్‌ ఖాతా వివరాలు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.


మిల్లర్లు సన్నద్ధం కావాలి : యాదాద్రి ఏసీ రమేష్‌

ధాన్యం సేకరణకు మిల్లర్లు సన్నద్ధం కావాలని యాదాద్రి అదనపు కలెక్టర్‌ జి.ర మేష్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పౌరసరఫరా ల, మిల్లర్లతో సమావేశమై ధాన్యం సేకరణపై చర్చించారు. రబీలో భారీగా ధాన్యం రానున్నందున ప్రభు త్వ ఆదేశాల మేరకు మిల్లర్లు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సకాలంలో అందజేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఖిమ్యానాయక్‌, పౌరసరఫరాల డీఎం గోపికృష్ణ, ఏఎ్‌సవో బ్రహ్మారావు పాల్గొన్నారు.   


ఇబ్బందులు లేకుండా కొనుగోలు :  యాదాద్రి వ్యవసాయ అధికారి అనురాధ 

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ గ్రామాల వారీగా వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలని వ్యవసాయ శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా అధికారి అనురాధ కోరారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 276 రెవెన్యూ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని కల్లాల వద్ద ఆరబెట్టుకొని తేమ, తాలు, మట్టి పెల్లలు లేకుండా కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. 


ఏ-గ్రేడ్‌ ధాన్యానికి రూ.1835, బీ-గ్రేడ్‌ ధాన్యానికి రూ.1815గా ప్రభుత్వం కనీస మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దన్నారు. ఈ నెల 7 నుంచి 15వ తేదీలోపు గ్రామాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు.



Updated Date - 2020-04-02T10:53:23+05:30 IST