కొనేదెట్టా.. తినేదెట్టా..?

ABN , First Publish Date - 2020-03-30T10:13:01+05:30 IST

సప్లై చైన్‌ విధానంలో మార్పులు చోటు..

కొనేదెట్టా.. తినేదెట్టా..?

నిత్యావసర సరుకుల ధరలు పైపైకి

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌  రూ.95 నుంచి రూ.110కి చేరిక

మినపగుళ్లు రూ. 100 నుంచి రూ. 115కు పెంపు

ప్రతీ సరుకు కేజీకి రూ. 10 నుంచి రూ. 20 వరకు హెచ్చు 


గుంటూరు(ఆంధ్రజ్యోతి): సప్లై చైన్‌ విధానంలో మార్పులు చోటు చేసుకొంటుండటంతో నిత్యావసర సరుకుల ధరలు జిల్లాలో క్రమక్రమంగా పెరుగుతున్నాయి. హోల్‌సేల్‌ దుకాణాల నుంచి రిటైల్‌ షాపులకు సక్రమంగా సరుకులు సరఫరా జరగకపోతుండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు కేజీకి రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.ప్రధానంగా సరుకు రవాణా చేసే లారీలు, ఆటోలు సక్రమంగా కదలకపోతుండటంతో ప్రజల డిమాండ్‌కు తగినట్లుగా షాపుల్లో సరుకులు ఉండటం లేదు. చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఇష్టపడుతెన్న కొర్రలు, సామలు, అరికెలు, వరిగలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాలు ప్రస్తుతం మార్కెట్‌లో బూతద్దంపెట్టి వెదకాల్సిన పరిస్థితి నెలకొన్నది.


కేజీ రూ.70కి దొరికిన కొర్రలు నేడు రూ.90 పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బియ్యం 25 కేజీల బస్తాలోనూ రూ.50 పెరుగుదల చోటు చేసుకొన్నది. మినపగుళ్లు కేజీకి రూ.15 చొప్పున ధర పెరిగింది. వేరుశనగ గుళ్లు, కందిపప్పు ధరలు కూడా కేజీకి రూ.10 చొప్పున పెరిగాయి. రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర రూ.95 నుంచి రూ.110కి చేరుకొన్నది. అరటికాయలు డజను రూ.40, చక్కెర కేళి రూ.80 నుంచి రూ.100కి విక్రయిస్తున్నారు. నిమ్మకాయలు వారం క్రితం వరకు డజన్‌ రూ.20కి దొరకగా నేడు కేవలం మూ డు, నాలుగు మాత్రమే చేతిలో పెడుతున్నారు. పుచ్చకాయ సైజుని బట్టి రూ.30 నుంచి రూ.150 వరకు విక్రయిస్తోన్నారు. ధరల పర్యవేక్షణ చేసే అధికారి కరువయ్యారు. ఈ విషయంలో పౌరసరఫరాలు, మార్కెటింగ్‌, వాణిజ్య శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడింది.

Updated Date - 2020-03-30T10:13:01+05:30 IST