ఈశ్వరప్ప రాజీనామా!

ABN , First Publish Date - 2022-04-15T08:53:43+05:30 IST

కాంట్రాక్టర్‌ ఆత్మహత్య నేపథ్యంలో 40 శాతం కమీషన్‌ ఆరోపణలతో..

ఈశ్వరప్ప రాజీనామా!

ఎట్టకేలకు దిగివచ్చిన కర్ణాటక మంత్రి

నేడు సీఎంకు రాజీనామా లేఖ సమర్పణ


బెంగళూరు, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్‌ ఆత్మహత్య నేపథ్యంలో 40 శాతం కమీషన్‌ ఆరోపణలతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కర్ణాటక పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప ఎట్టకేలకు రాజీనామా చేసేందుకు అంగీకరించారు. కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఈశ్వరప్ప పేరును ప్రథమ నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే.  ఈశ్వరప్ప రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టడం, నలభై శాతం కమీషన్‌పై ప్రధాని మోదీ సైతం ఆరా తీయడంతో ఎట్టకేలకు ఈశ్వరప్ప దిగివచ్చారు. మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు గురువారం రాత్రి శివమొగ్గలో ఆయన ప్రకటించారు. శుక్రవారం బెంగళూరు వెళ్లి ముఖ్యమంత్రికి రాజీనామా లేఖ సమర్పిస్తానని చెప్పారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి చేస్తోందని తాను రాజీనామా చేయట్లేదని, తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదనే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రధాని, లేదా సీఎం కోరితే వెంటనే రాజీనామా చేస్తానని అంతకుముందు ఈశ్వరప్ప పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో రెండున్నరేళ్ల బీజేపీ పాలనలో తొలుత రాసలీలల సీడీ వివాదంలో రమేశ్‌ జార్కిహొళి మంత్రి పదవికి రాజీనామా చేయగా, ప్రస్తుతం 40శాతం కమీషన్‌ ఆరోపణలు, కాంట్రాక్టర్‌ ఆత్మహత్య నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్ప రాజీనామాకు సిద్ధమయ్యారు. 


సీఎం ఇల్లు ముట్టడికి కాంగ్రెస్‌ యత్నం..

కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్యకు కారకులైన మంత్రి ఈశ్వరప్పను అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఉదయం నుంచి రాత్రి దాకా ఆందోళనలు కొనసాగించింది. బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించి, సీఎం అధికారిక నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బ్యారికేడ్‌లపైకి ఎక్కి పోలీసులపై మండిపడ్డారు.   అనంతరం వారంతా విధానసౌధకు చేరుకొని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. విధానసౌధ తూర్పు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి 24 గంటల నిరంతర నిరసనకు సిద్ధమయ్యారు. కాగా, ఈశ్వరప్ప తనకుతానుగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, హైకమాండ్‌ నుంచి ఎటువంటి ఒత్తిడీ లేదని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బెంగళూరులో మీడియాకు తెలిపారు. కాంట్రాక్టర్‌ మృతిపై ప్రాథమిక నివేదిక కోసం వేచి చూస్తున్నామని, నివేదిక వచ్చాక దాన్ని బట్టే చర్యలు ఉంటాయన్నారు. కాగా, కాంట్రాక్టర్‌ ఆత్మహత్య వెనుక కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ హస్తం ఉందని మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళి ఆరోపించారు. తనపై రాసలీలల సీడీలు చేయించిన మహానాయకుడి నిర్వాకమే తాజా పరిణామాల వెనుకా ఉందన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-04-15T08:53:43+05:30 IST