ప్రభుత్వ భూమికే ఎసరు

ABN , First Publish Date - 2020-08-03T10:46:12+05:30 IST

నెల్లూరులో కొందరు అక్రమార్కులు బరితెగించారు. ఏకంగా ప్రభుత్వ భూమికే ఎసరుపెట్టారు.

ప్రభుత్వ భూమికే ఎసరు

విక్రయానికి సన్నాహాలు

వెంకటేశ్వరపురంలో రెండెకరాలపై అక్రమార్కుల కన్ను

కోర్టులో కేసు ఉన్నా లేఅవుట్‌ వేసేందుకు సన్నద్ధం

భూమి విలువ రూ.3 కోట్ల పైమాటే..

అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

సూత్రధారులు అధికార పార్టీ నేతలు ?


నెల్లూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరులో కొందరు అక్రమార్కులు బరితెగించారు. ఏకంగా ప్రభుత్వ భూమికే ఎసరుపెట్టారు. రూ.కోట్ల విలువైన భూమిని లేఅవుట్‌ వేసి ప్లాట్లుగా అమ్మేసేందుకు భారీ కుట్ర పన్నారు. ఓ వైపు ఈ భూమిపై వివాదం నెలకొనడంతో కేసు కోర్టులో నడుస్తోంది. ఈ భూమిపై ప్రస్తుతం స్టేటస్‌కో కొనసాగుతోంది. అయినా అధికారులంటే లెక్కలేకుండా.. కోర్టులంటే గౌరవం లేకుండా ప్రభుత్వ భూమిని కాజేసేందుకు సన్నాహాలు చేశారు. 


అడ్డుకున్న అధికారులు

అక్రమార్కులు కొంతమేర భూమిని చదును చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకొని ఆ భూమిలో ప్రభుత్వ స్థలం అని తెలిపేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే దాన్ని చించేసి మళ్లీ తమ పనులు చేసుకు నేందుకు అక్రమార్కులు ప్రయత్నించారు. కానీ ఈ దఫా రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకొని మళ్లీ బోర్డు ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు. అయినా స్థాని క రెవెన్యూ అధికారులపై సదరు అక్రమార్కులు బెదిరిం పులకు దిగడం సంచలనంగా మారింది. ఈ భారీ స్కెచ్‌కు వెనుకున్నది అధికార పార్టీ నేతలేనన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఈ వ్యవహారం జరిగినదంతా నెల్లూరులోని వెంకటే శ్వరపురంలో..!. ఆ భూమి విలువ సుమారు రూ.3 కోట్లు పైమాటే..!. ఓ వైపు ఇళ్లు.. మరో వైపు జాతీయ రహదారి.. ఇంకోవైపు పెన్నానది.. వీటి మధ్యనున్న భూములు ఎంతో విలువైనవి. 


వివాదాస్పదంగా రెండు ఎకరాలు

టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇక్కడ ఎన్టీఆర్‌ అపార్ట్‌మెం ట్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. అందుకోసం ప్రభుత్వ భూమి కాకుండా మరో 40 ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ భూములను భూసేకరణ ద్వారా తీసుకున్నారు. అప్పటి ధర ప్రకారం ఎకరాకు  రూ.30 లక్షల వరకు పరిహారం ఇచ్చారు. అందులో రెండెకరాల భూమిలో వివాదం ఏర్పడింది. సీజేఎఫ్‌ఎస్‌ భూమి ఉన్నది ఒకరి పేరుపైనయితే అనుభవంలో ఉన్నది మరొకరు. ఈ పరిహారం ఎవరికి చెందాలన్న వ్యవహారం హైకోర్టుకు చేరింది. అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. అప్పటికే ఆ భూమిని సేకరించి ఏపీటిడ్కోకు రెవెన్యూ అధికా రులు అప్పగించారు. కోర్టులో కేసు తేలిన తర్వాత అర్హులకు పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నారు. 


ఇళ్ల స్థలాలు ఇచ్చే దిశగా..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్లకు బదులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అప్పటి వరకూ వెంకటేశ్వరపురంలో 4800 ఇళ్లు పూర్తవగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకొన్ని మొదలు కావాల్సి ఉంది. వీటన్నిం టిని రద్దు చేసి ఆ స్థలంలో పేదలకు లేఅవుట్‌ వేసి ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అపార్ట్‌మెంట్లకు పోను మిగిలిన భూమితో పాటు పక్కనే మరికొంత కొనుగోలు చేసి లేఅవుట్‌ వేశారు. అయితే కోర్టులో ఉన్న రెండెకరాల జోలికి మాత్రం రెవెన్యూ అధికారులు వెళ్లలేదు. ప్రభుత్వం వేసిన లేఅవుట్‌ను ఆనుకొనే ఈ భూమి ఉంది. అప్పటికే ఏపీటిడ్కో ఆధీనంలో ఉ న్న భూమిని రెవెన్యూ అధికారులు తమ పరిధిలోకి తీసుకు న్నారు.


ఇప్పుడు ప్రభుత్వ భూమిగా ఉన్న ఆ రెండెకరాలపై స్థానికంగా ఉండే కొందరు అధికార పార్టీ నేతలు భారీ స్కెచ్‌ వేశారు. ఎక్కడా విషయం బయటకు రాకుండా కొందరు గ్రూ పుగా ఏర్పడి ప్రభుత్వ భూ మిని అమ్మేసేందుకు కుట్రలు ప న్నారు. గత ప్రభుత్వంలోనే భూసేకరణ ద్వారా ఈ రెండెకరాల భూమి ప్రభుత్వ భూమిగా మారినా ఎవరైతే కోర్టుకు వెళ్లారో వారితో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకొని తక్కువ మొత్తం వారికిచ్చి ఈ భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రయత్నాలు జరిగాయి. ఈ రెండెకరాల ప్రభుత్వ భూమిలో లేఅవుట్‌ వేసి విక్రయించాలని భావించారు. కొంత భూమిని కూడా చదును చేసి లేఅవుట్‌గా మార్చే ప్రయత్నం చేశారు. 


 దొంగ డాక్యుమెంట్లు సృష్టించి..

జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్లాట్లు అంకణం రూ. 50 వేలు, లోపలికి వెళ్లే కొద్దీ రూ.30 వేల వరకు ధరలు నిర్ణ యించారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లను అమా యకులకు కట్టబట్టేందుకు కుట్రలు జరిగాయి.  కొందరు స్థానికులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మొదట అర్బన్‌ తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు ఈ భూమి వద్దకు వెళ్లి ఎవరూ వెళ్లరాదని, ప్రభుత్వ భూమిలో ఎలాంటి పనులు చేయకూడదని ఆదేశించి ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు.


ఆ తర్వాత కొందరు దాన్ని చించేశారు. మళ్లీ లేఅవుట్‌ పనులు మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు జరగడంతో ఆర్డీవో దృష్టికి విషయం వెళ్లింది. ఆ తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో మరోసారి ఆ భూమిలో బోర్డు ఏర్పాటు చేశారు. కాగా కొందరు అధికార పార్టీ నేతలు రెవె న్యూ అధికారులపై పెద్ద స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయ త్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ భూమి కావడం, అందులోనూ స్టేటస్‌ కో కొనసాగు తుండడంతో అధికారులు తలొగ్గడం లేదని తెలుస్తోంది. మొత్తంగా ఈ భారీ స్కెచ్‌ బయటపడడంతో ఇప్పుడు నెల్లూరులో చర్చనీయాంశంగా మారింది. 


మా దృష్టికి రాగానే అడ్డుకున్నాం ..హుస్సేన్‌ సాహెబ్‌, నెల్లూరు ఆర్డీవో

వెంకటేశ్వరపురంలోని రెండెకరాల భూమిపై ప్రస్తుతం  స్టేటస్‌ కో కొనసాగుతోంది. ఈ కారణంగానే ఆ భూమిలో పేదల ఇళ్లకు సంబంధించి లేఅవుట్‌ వేయలేదు. అయితే కొం దరు ఆ భూమిలో లేఅవుట్‌ వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మా దృష్టికి రాగానే అడ్డుకున్నాం. భూమిలోకి  ఎవరూ అడుగుపెట్టకుండా బోర్డు ఏర్పాటు చేశాం.


Updated Date - 2020-08-03T10:46:12+05:30 IST