ముంచుకొస్తున్న ఉప్పెన

ABN , First Publish Date - 2022-07-17T04:46:21+05:30 IST

ముంచుకొస్తున్న ఉప్పెన

ముంచుకొస్తున్న ఉప్పెన
ఇటీవల డొంకూరు వద్ద కోతకు గురైన సముద్ర తీరం

రెండురోజులుగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. మందస మండలం దున్నూరు, గెడ్డూరు వద్ద అలలు ఉధృతి బాగా పెరిగింది. అలలు ఇసుక తెన్నెలు దాటి ముందుకు వచ్చాయి. దీంతో తీరానికి సుమారు 500 మీటర్ల దూరంలో మత్స్యకారులు బోటులు భద్రపరిచారు. అందుకే వర్షాకాలం వచ్చిందంటే చాలు.. సిక్కోలు తీరం వణుకుతుంది. ఎప్పుడు ఏ తుఫాన్‌ వస్తుందో.. ఎలాంటి నష్టం కలిగిస్తుందోననే భయం.. మత్స్యకారులను తీరప్రాంత ప్రజలను వెంటాడుతుంది. ఏటా జిల్లాకు వీటి తాకిడి పెరుగుతూ వస్తోంది. అధికశాతం తుఫాన్‌లు జిల్లాలో లేదా సరిహద్దులోనే తీరం దాటుతున్నాయి. ఫలితంగా తీవ్రనష్టం మిగుల్చుతున్నాయి. ఏటా పంట బాగా పండినా చివరికి అకాల వర్షాలు, తుఫాన్ల దాటికి రైతులు నిలువునా నష్టపోతున్నారు. 


- కోతకు గురవుతున్న తీరప్రాంతం

- జిల్లాపై తుఫాన్ల ప్రభావం

- ఆందోళనలో తీరప్రాంత వాసులు 

(ఇచ్ఛాపురం రూరల్‌ /హరిపురం) 

సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరప్రాంతం కోతకు గురవుతోంది. దీంతో తీరప్రాంత వాసులు, మత్స్యకారుల్లో అలజడి రేగుతోంది. మరోవైపు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి రణస్థలం మండలం వరకు 11 మండలాల పరిధిలో 196 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల పరిధిలోని జీడి, కొబ్బరి, మామిడి, పనస తదితర ఉద్యాన పంటలు ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. ఏ తుఫాన్‌ వచ్చినా తొలుత నష్టపోయేది ఈ రైతులే. హుద్‌హుద్‌, తితలీ తుఫాన్‌లు పెద్ద విధ్వంసం సృష్టించాయి. ప్రస్తుతం రెండు రోజులుగా ఉప్పెనలాంటి అలలు ముంచుకొస్తుండటంతో ఇసుకతెన్నెలు కనుమరుగవుతున్నాయి. ఇచ్ఛాపురం మండలం డొంకూరు, మందస మండలంలో గెడ్డూరు, రట్టి, గంగువాడ తదితర తీరప్రాంతాలు కోతకు గురయ్యాయి. సువిశాలమైన తీరప్రాంతంలో కాస్త నడిచి వెళ్లేందుకు కూడా దారిలేని దుస్థితి నెలకొంది. తీరప్రాంత రక్షణ కోసం నాటిన సరుగుడు వనాలు వేళ్లతో పెకిలించివేస్తున్నాయి. దీంతో.. మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. సముద్రం సుమారు 100 మీటర్ల మేర ముందుకురావడంతో తీరప్రాంత గ్రామాలకు ముప్పు తప్పదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉద్దానంలోని మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు మండలాల్లో తీరప్రాంతం నిత్యం కోతకు గురవుతోంది. తీరానికి, సముద్రానికి కిలోమీటరు దూరం ఉంటుంది. కాగా.. 2010నుంచి వరుసగా వచ్చిన లైలా, నీలం, ఫైలిన్‌, హెలెన్‌, హుద్‌హుద్‌ వంటి అతి భయంకర మైన తుఫాన్‌ల తాకిడితో సుమారు 750 మీటర్లు భూభాగం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇలాగే కొనసాగితే మరి కొద్దికాలంలో తీరగ్రామాలు కనుమరగయ్యే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 


అతలాకుతలం..

జిల్లాలో సగటున నాలుగేళ్లకోసారి ఒక పెను తుఫాన్‌ వచ్చి.. జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. 

- 1999లో వచ్చిన సూపర్‌ సైక్లోన్‌ ఉద్దాన ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఒడిశాలో తీరం దాటినా జిల్లాలో పది లక్షలకుపైగా చెట్లు నేలకూలాయి. వేలాది ఎకరాల జీడి, మామిడి తోటలు నేలమట్టమయ్యాయి. 

- 2013లో దూసికొచ్చిన తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో 120 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు ఉద్దానంలో 10 లక్షలు మేర కొబ్బరి చెట్లు నాశనమయ్యాయి. 

- 2014లో వచ్చిన హుద్‌హుద్‌ తుఫాన్‌ తీవ్రతతో జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది.

- 2018లో తిత్లీ తుఫాన్‌.. గత వందేళ్లలోనే అతి పెద్ద ప్రకృతి విపత్తుగా గుర్తించారు. ఇది వజ్రపుకొత్తూరు మండలంలో తీరందాటి 16 లక్షల కొబ్బరి చెట్లను నేలకూల్చింది. తుఫాన్‌లు మిగిల్చిన నష్టం నుంచి కోలుకునేందుకు రైతులకు నాలుగైదేళ్లు పడుతోంది. 


ఆక్వా సాగుతో తీరం ధ్వంసం

ఓ పక్క తుఫాన్లు విరుచుకుపడుతుంటే అదే స్థాయిలో మానవ తప్పిదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 11 మండలాల్లో విస్తరించిన తీరప్రాంతంలో సుమారు 1,240 హెక్టార్లలో మడ అడవులుగా సరుగుడు వనాలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ చెట్లు గొడ్డలివేటుకు బలవుతున్నాయి. కొంతమంది అక్రమార్కులు వీటిని తొలగించి.. కొబ్బరి, జీడి మొక్కలు పెంచి ఆక్రమణకు పాల్పడుతున్నారు. మరికొంతమంది తీరప్రాంతాన్ని ఆక్రమించి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, సంతబొమ్మాళి, పోలాకి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో చేపలు, రొయ్యల చెరువులు తీరం వెంబడి ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినా జిల్లా అధికారులు వీటిని అరికట్టలేకపోతున్నారు. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నిబంధనల ప్రకారం తీరప్రాంతం నుంచి 500 మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. చేపలు, రొయ్యలు చెరువులు వంటివి నిర్మించకూడదు. తీరప్రాంతం పొడవునా భూభాగం వైపుగా కనీసం 2 కి.మీ విస్తీర్ణంలో మడ అడవులు, సరుగుడు తోటలు పెంచాలి. తుఫాన్ల సమయంలో భూభాగం వైపు దూసుకొచ్చే గాలుల తీవ్రతను ఈ చెట్లు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. కలప, వంటచెరకు, ఆక్రమణల పేరుతో చెట్లు నరికేస్తున్నారు. దీంతో సముద్రం పొంగి పరవళ్లు తొక్కుతోంది. అలల ధాటికి తీరం మొత్తం కోతకు గురవుతోంది. 

 

మడ అడవులే ప్రత్యామ్నాయం: 

భౌగోళికంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా తుఫాన్లు జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో తీరం దాటుతున్నాయి. ఆ సమయంలో అవి కలిగిస్తున్న నష్టాల్ని తగ్గించాలంటే తీరం వెంబడి రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవుల పెంపకమే మనకున్న ఏకైక ప్రత్యామ్నాయం. మడ అడవుల వల్ల తుఫాను గాలుల తీవ్రత 40 నుంచి 50 శాతం వరకు తగ్గే అవకాశముంది. భవిష్యత్‌లోనూ మరిన్ని తుఫాన్లు ఇక్కడే తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టనివారణపై దృష్టి సారించాలి. 

- జె.జగన్నాధరావు, భూ విజ్ఞాన శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, ఆమదాలవలస

Updated Date - 2022-07-17T04:46:21+05:30 IST