పల్లెజనం పలవరించిన జానపదం

ABN , First Publish Date - 2022-05-18T06:55:00+05:30 IST

పౌరాణిక పాత్రలు ఆ పల్లె వీధుల్లోకి వచ్చి క్రోధాలు చూపాయి. యుద్ధాలు చేశాయి. బలిగా మారి అశువులు బాసాయి.

పల్లెజనం పలవరించిన జానపదం
ఇరావంతుడికి భక్తజనం మొక్కులు

ఇరావంతుని బలి ఉత్సవం

 కుప్పం/గుడుపల్లె : పౌరాణిక పాత్రలు ఆ పల్లె వీధుల్లోకి వచ్చి క్రోధాలు చూపాయి. యుద్ధాలు చేశాయి. బలిగా మారి అశువులు బాసాయి. కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం యామగానిపల్లెలో జరుగతున్న ధర్మరాజుల మహాభారత ఉత్సవాల్లోని దృశ్యాలు ఇవి. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకలకు ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం హాజరవుతున్నారు. పురాణాల్లోని చిన్నాచితకా పాత్రలకు ప్రాణం పోసి, వారి వీర గాథలను చెప్పుకుని, వారికి మొక్కలు తీర్చుకుని ఉత్సవాలు చేయడం ఈ ప్రాంత పల్లెల ప్రత్యేకత. మంగళవారంనాడు ఇలావంతుడి బలి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పాండవ మధ్యముడైన  అర్జునుడికీ, నాగకన్య ఉలూచికీ జన్మించినవాడే ఇలావంతుడు. భీష్మపర్వంలో మహోగ్రరూపంలో కౌరవ సైన్యాన్ని చీల్చిచెండాడి, చివరకు ఆ యుద్ధానికే బలైపోయిన వీరుడు. యామగానిపల్లె ధర్మరాజుల ఉత్సవంలో ఇరావంతుని బలి ఘట్టానికే ఒక రోజు కేటాయించారు. బంకమట్టితో ఇరావంతుని భారీ రూపాన్ని తయారు చేశారు. పెద్ద గదతో, కిరీటంతో మహోగ్ర రూపంలో శత్రుమూకలపైకి దూకుతున్నట్లుగా ఉన్న ఈ విగ్రహం ముందు  హరికథాగానం చేశారు.  రకరకాల తినుబండారాల అంగళ్లతో యామగానిపల్లె సందడిగా మారింది.

Updated Date - 2022-05-18T06:55:00+05:30 IST