యంత్రం సాగునా..

ABN , First Publish Date - 2020-06-26T10:10:16+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రైతులకు అవసరమైన యంత్ర పనిముట్లు అందుబాటులో లేవు. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు

యంత్రం సాగునా..

గత ప్రభుత్వంలో రాయితీతో పరికరాలు

ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో అద్దెకు పరికరాలు

రూ.62 కోట్లతో అధికారుల ప్రతిపాదనలు

పొలం పనులు మొదలవుతున్నా అనుమతులు రాని వైనం

యంత్రాలు వస్తాయా రావా..?


కడప, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రైతులకు అవసరమైన యంత్ర పనిముట్లు అందుబాటులో లేవు. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు వ్యవసాయం అంటే కాడెద్దులతో పాటు ఎద్దలబండ్లు, నాగలి, గొంటిక తదితర సంప్రదాయ పనిముట్లు ఉండేవి. సాంకేతిక వ్యవసాయం అందుబాటులోకి రావడంతో రైతన్న అటువైపు మొగ్గు చూపాడు. దీంతో పాటు ఎద్దుల పోషణ భారంగా మారడం, ఖర్చులు పెరుగుతుండడంతో సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలేశారు. యంత్రాలతోనే దుక్కుల మొదలు పంట కోతల వరకూ చేయడం మొదలు పెట్టారు.


రైతులు ఎక్కువమంది ఇప్పుడు యంత్రాలనే ఆశ్రయిస్తున్నారు. అయితే అవసరమైన యాంత్రికీకరణ పరికరాలు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనెల 1 నుంచి ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. జిల్లాలో ఇటీవల వర్షాలు కురిశాయి. దీంతో రైతులు విత్తనాల సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వేరుశెనగ, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 1,08,614 హెక్టార్లు కాగా, 1,15,836 హెక్టార్లలో పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది.


యాంత్రికీకరణ ఎక్కడ?

గత టీడీపీ పాలనలో అవసరమైన యంత్రాలను రైతులకు రాయితీ ధరలతో అందించేవారు. జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విధానాన్ని రద్దు చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతులకు పరికరాలను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలో 620 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు అవసరమైన గొర్రులు, పిల్లర్లు, మడకలు తదితర పరికరాలను అందుబాటులో ఉంచి రైతులు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో రైతు భరోసా కేంద్రానికి యంత్రాల కోసం పది లక్షల రూపాయల చొప్పున రూ.62 కోట్లతో కూడిన ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందించింది.


అయితే ఇంతవరకు ఆ ప్రతిపాదనలకు మోక్షం రాలేదని చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీ్‌ఫలో సాధారణ వర్షపాతం నమోదవుతుందంటూ వ్యవసాయశాఖ అధికారుల అంచనా. వర్షాలు సమృద్ధిగా కురిస్తే అనుకున్న మేరకు పంటలు సాగవుతాయి. అయితే అవసరమైన యంత్రాలు అందుబాటులో లేకపోతే అనుకున్న సాగు కష్టమని వ్యవసాయశాఖలోని ఓ అధికారి వ్యాఖ్యానించారు. జూన్‌ మూడో వారంలోకి అడుగుపెడుతున్నా యాంత్రికీకరణపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-06-26T10:10:16+05:30 IST