వ్యూహరచనలో ఓపీఎస్‌-ఈపీఎస్‌

ABN , First Publish Date - 2021-12-01T15:23:11+05:30 IST

అన్నాడీఎంకేపై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌), ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌)లో ఎవరిది పైచేయి అవుతుందో త్వరలో తేలిపోనుందా?.. బుధవారం

వ్యూహరచనలో ఓపీఎస్‌-ఈపీఎస్‌

- పైచేయి ఎవరిదో?

- కీలక నిర్ణయాలు తప్పవా 

- నేడు అన్నాడీఎంకే కార్యనిర్వాహక మండలి భేటీ


చెన్నై: అన్నాడీఎంకేపై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌), ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌)లో ఎవరిది పైచేయి అవుతుందో త్వరలో తేలిపోనుందా?.. బుధవారం జరుగనున్న అన్నాడీఎంకే కార్యనిర్వాహక మండలి భేటీలో తాము అనుకున్న కీలక నిర్ణయాలకు ఆమోదం పొందడం ద్వారా కిందిస్థాయి శ్రేణులకు తమదే పైచేయి అని ఆ ఇద్దరు నేతలు చెప్పబోతున్నారా?. ఇందుకోసం తమ అనుయాయులతో వ్యూహరచన చేసుకున్నారా?.. అవుననే అంటున్నాయి అన్నాడీఎంకే వర్గాలు. బుధవారం జరుగనున్న భేటీ ఇందుకు వేదిక కానుందని స్పష్టం చేస్తు న్నాయి. దీంతో అటు అన్నాడీఎంకేలో, ఇటు ఆ పార్టీని చేజిక్కించుకు నేందుకు పావులు కదుపుతున్న శశికళ వర్గంలో ఉత్కంఠ నెలకొంది.

గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకూ సఖ్యతగా కనిపించిన ఓపీఎస్‌-ఈపీఎస్‌.. పార్టీ ఓటమి తరువాత ఎవరి దారి వారిదే అన్న ధోరణి తో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. జయ మరణానంతరం తను తీవ్రంగా వ్యతిరేకించిన శశికళకు ఓపీఎస్‌ దగ్గరవుతున్నట్టు కనిపిస్తుండగా, శశికళ చలువతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఈపీఎస్‌ మాత్రం.. ఆమెపై కత్తులు నూరుతున్నారు. అయితే పార్టీపై తను పట్టుకోల్పోతున్నట్లు స్పష్టమవుతుండడం వల్లే ఓపీఎస్‌ శశికళకు దగ్గరవుతున్నారన్న వాదనా వుంది. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మధుసూదన్‌ మృతితో పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ పదవి కూడా ఖాళీ అయింది. దీంతో ఆయా పదవులను తమ వర్గీయులకు ఇప్పించుకోవడం ద్వారా పార్టీపై పట్టు సాధించవచ్చన్న వ్యూహంతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ ప్రణాళికలు వేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలు జరుగనుండడంతో అభ్యర్థుల ఎంపిక కోసం చర్చించేందుకు ఇటీవల పార్టీ నేతలంతా భేటీ అయ్యారు. అయితే ఆ సమయంలో ఈపీఎస్‌-ఓపీఎస్‌ వర్గీయులు ఘర్షణ పడడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో డిసెంబరు నెలాఖరుకు పార్టీ సంస్థాగత ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. 


ఏం తేలుస్తారో?

బుధవారం ఉదయం రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యనిర్వాహకమండలి భేటీ కానుంది. త్వరలో జరుగనున్న పార్టీ సర్వసభ్య సమా వేశంపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతకంటే ముందు పార్టీ ప్రిసీ డియం చైర్మన్‌ ఎంపికపై నేతలు కసరత్తు చేయనున్నారు. ఈ పదవికి తమ వర్గీయులనే ఖరారు చేయాలని ఈపీఎస్‌, ఓపీఎస్‌ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో ప్రధాన కార్యదర్శే కీలకం కావడంతో ఈ పదవి తనకు కావాలని ఓపీఎస్‌ పటుబడుతున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ప్రస్తుతమున్న పార్టీ పారదర్శక కమిటీ సభ్యుల సంఖ్యను 11 నుంచి 18కి పెంచాలని, తన వర్గీయులకు అందులో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఓపీఎస్‌ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై కూడా బుధవారం జరిగే సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల అభ్యర్థులు, జిల్లా స్థాయిలో ఖాళీగా వున్న పదవుల భర్తీ తదితరాలపైనా చర్చించనున్నారు. 


ఆసక్తిగా గమనిస్తున్న శశికళ

ఈ సమావేశంపై శశికళ సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓపీఎస్‌ వర్గానిది పైచేయి అయితే అది తనకు మంచిదని శశికళ భావిస్తున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రకటనలు విడుదల చేస్తున్న ఆమె.. ఓపీఎస్‌ ద్వారా పార్టీని చేజిక్కించుకోవాలని గట్టిగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇందుకు పలువురు సీనియర్లు సానుకూలంగా వున్నా, ఈపీఎస్‌ వర్గానికి చెందిన సీనియర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. అందుకే ముందుగా పార్టీపై ఓపీఎస్‌ పట్టు సాధిస్తే.. ఆ తరువాత తనకు అడ్డు ఉండదన్న భావనతో శశికళ వ్యూహరచన చేస్తున్నారు.

Updated Date - 2021-12-01T15:23:11+05:30 IST