ఉత్సాహంగా ‘సాగర తీర స్వచ్ఛత’

ABN , First Publish Date - 2022-07-04T06:07:29+05:30 IST

భీమిలి బీచ్‌లో ఆదివారం చేపట్టిన ‘సాగరతీర స్వచ్ఛత - బీచ్‌ క్లీనింగ్‌’ కార్యక్రమం విజయవంతమైంది.

ఉత్సాహంగా ‘సాగర తీర స్వచ్ఛత’
సైకత శిల్పం వద్ద కలెక్టర్‌, జేసీ, కమిషనర్‌ తదితరులు

పాల్గొన్న కలెక్టర్‌, కమిషనర్‌తోపాటు 700 మంది ఔత్సాహికులు

రెండు గంటలపాటు పరిశుభ్రత కార్యక్రమాలు

భీమునిపట్న (విశాఖపట్నం), జూలై 3: భీమిలి బీచ్‌లో ఆదివారం చేపట్టిన ‘సాగరతీర స్వచ్ఛత - బీచ్‌ క్లీనింగ్‌’ కార్యక్రమం విజయవంతమైంది. లైట్‌హౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి కలెక్టర్‌ ఎ.మల్లికార్జున కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కొనసాగిన కార్యక్రమంలో కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషాతోపాటు గ్రేటర్‌ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, పౌరులు, దివీస్‌ కంపెనీ ఉద్యోగులు దాదాపు 700 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.


వరుణ్‌ బీచ్‌ నుంచి లైట్‌హౌస్‌, గోస్తనీ సంగమ ప్రదేశం, గెస్ట్‌హౌస్‌, కొబ్బరితోట పార్క్‌ వరకు కలియతిరిగి చెత్త, చెదారం, మద్యం బాటిళ్లు సేకరించి తీరాన్ని శుభ్రపరిచారు. ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు లైట్‌హౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన ‘సాగర తీర స్వచ్ఛత, లవ్‌ వైజాగ్‌, మన వైజాగ్‌ మన బాధ్యత’ సైకత శిల్పం ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ తాను, జీవీఎంసీ కమిషనర్‌ ఇచ్చిన పిలుపు మేరకు విచ్చేసిన వందలాది మంది ఔత్సాహికులకు ధన్యవాదాలన్నారు. తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతినెలా మొదటి ఆదివారం చేపడుతున్న కార్యక్రమాన్ని రెండున్నర నెలల క్రితం ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు ఆర్కేబీచ్‌, గోకుల్‌పార్క్‌, కాళీమాత ఆలయం, తెన్నేటిపార్క్‌, సాగర్‌నగర్‌ బీచ్‌లలో పరిశుభ్రత చేపట్టినట్లు వివరించారు. మొత్తం 65 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించామన్నారు.  ఇది నిరంతర కార్యక్రమమని, ఆరు నెలల్లో మంచి ఫలితాలు సాధిస్తామని  చెప్పారు.


తీరంలో మెకానికల్‌ ఫిల్టర్లు

కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకు సాగర తీరంలో మొత్తం 30 మేజర్‌ కాలువల ద్వారా సముద్రంలో వ్యర్థాలు కలుస్తున్నాయని గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలో కలిసి నీరు కలుషితమవుతున్నందున, దీన్ని నిరోధించేందుకు మెకానికల్‌ ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజాచైతన్యంతోనే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయని, అందరి సహకారంతో ఇరవై ఏళ్ల క్రితం బీచ్‌ ఎంత పరిశుభ్రంగా ఉండేదో, అలా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా, జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌, డీఎంహచ్‌వో విజయలక్ష్మి, కార్పొరేటర్లు అప్పలకొండ, గాడు చిన్నికుమారి, పద్మ, దివీస్‌  డీజీఎం కోటేశ్వరరావు, భీమిలి జెడ్సీ ఎస్‌.వి.రమణ, తహసీల్దార్‌ ఈశ్వరరావు, ఎంపీడీవో వెంకటరమణ, నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి ముత్తంశెట్టి మహేష్‌, పలు విద్యా సంస్థల విద్యార్థులు, వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు, ప్రజలు, పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T06:07:29+05:30 IST