రైతులకు భరోసా

ABN , First Publish Date - 2020-05-30T10:33:53+05:30 IST

గ్రామస్థాయిలోనే వ్యవసాయ శాఖ సలహాలు...సూచనలు అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రైతుభరోసా

రైతులకు భరోసా

గ్రామస్థాయిలో వ్యవసాయ శాఖ కార్యకలాపాలకు శ్రీకారం 

జిల్లాలో 820 రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు 

నేటి నుంచి ప్రారంభం


(నరసన్నపేట/రామలక్ష్మణ జంక్షన్‌) 

గ్రామస్థాయిలోనే వ్యవసాయ శాఖ సలహాలు...సూచనలు అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రైతుభరోసా కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 820 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. శనివారం నుంచి వీటిని ప్రారంభించనుంది. ఇవి రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా ఉపయోగపడనున్నాయని యంత్రాంగం చెబుతోంది. రైతులకు వ్యవసాయ సలహాలు, సూచనలు అందించడమే కాకుండా, శాస్త్రవేత్తల ఆవిష్కరణలను కూడా అధికారులు అన్నదాతలకు వివరించనున్నారు. వారికి కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు, ఇతర సామగ్రిని రైతుల ముంగిటకు తీసుకురానున్నారు.

 

రైతుభరోసా కేంద్రాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి వీటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై వ్యవసాయశాఖ సేవలన్నీ వీటి ద్వారా అందనున్నాయి. జిల్లాలో 820 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికోసం నిరుపయోగంగా ఉన్న కొన్ని ప్రభుత్వ భవనాలను వినియోగించారు. మరికొన్ని అద్దె భవనాల్లో నిర్వహించనున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఈ కేంద్రాల భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.2281.8 కోట్లను  మంజూరు చేసింది. నరసన్నపేట మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ శనివారం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జేసీ సుమిత్‌ కుమార్‌ శుక్రవారం పరిశీలించారు.


సాగుకు సంబంధించి శాస్త్రవేత్తలు ఆవిష్కరించే నూతన విషయాలను రైతులకు చేర్చడమే ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశం.  వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన విషయాలపై అధికారులు రైతులకు సలహాలు ఇవ్వనున్నారు.  ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు,  రైతు ముగింటకు చేర్చనున్నారు. ప్రతి కేంద్రంలో ఆన్‌లైన్‌ సేవలకు వీలుగా కియోస్క్‌ను ఏర్పాటు చేస్తారు. ఆండ్రాయిడ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి. వీటి ద్వారా అక్కడ నుంచి రైతులు తమ అవసరమైన  ఉత్పాదకాలను ఆర్డర్‌ చేసుకుని తెప్పించుకోవచ్చును. 


లభించే సేవలు..

రానున్న రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ రైతుభరోసా కేంద్రాల ద్వారా జరుగుతాయి. వ్యవసాయ యంత్రాలు తక్కువ ధరకు అద్దెకు లభించనున్నాయి. 


సచివాలయ వ్యవస్థలో పనిచేసే గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ), జిల్లాలోని పంట నిపుణులు, శాస్త్రవేత్తల ద్వారా అభ్యుదయ రైతుల సాయంతో ప్రధాన పంటల సమగ్ర యాజమాన్యాలపై సూచనలు, సలహాలు ఇస్తారు.


రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ కియోస్కు ద్వారా వ్యవసాయ ఉత్పాదకాలను గ్రామాల్లోనే ఆర్డర్‌ చేసి ఆన్‌లైన్‌లో 48 గంటల్లోనే పొందవచ్చు. కొనుగోలు కేంద్రాలు, వాతావరణ సమాచారం ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకునే సౌలభ్యం కలుగుతుంది. వివిధ యాజమాన్య పద్ధతులపై సమాచారం వీడియో రూపంలో దొరుకుతుంది. ఎరువులకు సంబంధించిన ఆర్డర్లను ఈ పాస్‌ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. రైతులు తమ ఉత్పత్తులను మంచి ధరలకు విక్రయించే సౌలభ్యం కలుగుతుంది.


ఈ కేంద్రాల్లో స్మార్ట్‌ టీవీ ద్వారా పంట దిగుబడిపై శిక్షణ ఇవ్వనున్నారు. నిపుణులు, శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సేంద్రీయ వ్యవసాయంపై సూచనలు ఇస్తారు. విత్తనశుద్ధి, వేపగింజల కషాయం, ఎన్‌పీవీ ద్రావణం తయారీ, వర్మీ కంపోస్టు తయారీ వంటి సాంకేతిక విషయాలపై సలహాలు ఇవ్వనున్నారు.

  

రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసే రైతులకు ఉత్పాదకాల నాణ్యతను ధ్రువీకరించిన అనంతరం వాటిని సరఫరా చేస్తారు.


ప్రైవేటు డీలర్ల షాపులో అమ్ముడయ్యే కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకాల జోరుకు అడ్డుకట్ట పడుతుంది. ఈ కేంద్రాల్లో రైతులు తమకు కావాల్సిన ఉత్పాదకాలను కొనుగోలుకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రైవేటు మార్కెట్‌లో రైతును మోసగించే ప్రయత్నాలకు ఈ కేంద్రాల్లో చెక్‌ పడుతుంది.


ఏపీ ఆగ్రోస్‌ ద్వారా వ్యవసాయ ఉత్పాదకాల అమ్మకాలు, కొనగోళ్ల లావాదేవీలు జరుగుతాయి. సాధ్యమైనంత వరకు అదనపు ఖర్చు లేకుండానే నాణ్యమైన, ధ్రువీకరించిన ఉత్పాదకాలు గ్రామస్థాయిలోనే రైతులకు అందించడబడతాయి.


భవిష్యత్‌లో పశువుల దాణా, కోళ్లకు వేసే దాణా, వ్యవసాయ  యంత్రాలు, పరికరాలు ఈ కేంద్రాల వద్ద దొరుకుతాయి.  పశువులకు సంబంధించిన ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. మత్స్య రంగానికి సంబంధించిన సేవలు కూడా లభిస్తాయి.


ప్రతి పంటకూ గిట్టుబాటు 

పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  ఈ క్రమంలో రైతుభరోసా కేంద్రాలు పంట కొనుగోలు కేంద్రాలుగా రూపాంతరం చెందనున్నాయి. ప్రస్తుతం ఏపీ పౌర సరఫరాల సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌ శాఖల ద్వారా వివిధ   ఉత్పత్తులు, ధాన్యం, మొక్కజొన్న, జొన్న, ఇతర చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు, వాణిజ్య పంట ఉత్పత్తులు మొదలైన వాటికి కనీస మద్దతు ధరలను అమలు చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. వివిధ మార్కెట్లలో ఉత్పత్తుల ధరలను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. రానున్న రోజుల్లో పై సంస్థలన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారానే గ్రామస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయనున్నాయి. 

Updated Date - 2020-05-30T10:33:53+05:30 IST